సీలింగ్ వద్దే వద్దు
September 09, 2013
హైదరాబాద్, సెప్టెంబర్ 8 : "సాగుభూమి విస్తీర్ణంపై సీలింగ్ వద్దే వద్దు. మన రాష్ట్ర పరిస్థితులకు కొత్తగా ఎలాంటి సీలింగ్ పనికిరాదు. ఇప్పటికే అనేక భూ సంస్కరణలను అమలు చేస్తున్నాం. కమ్యూనిస్టులు, ఆ భావజాలం కలిగిన సంస్థలు మినహా ప్రధాన పార్టీలు కూడా కొత్తగా సీలింగ్ వద్దని స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తాం'' అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ స్థాయి భూసంస్కరణల ముసాయిదాపై చర్చించేందుకు ఆదివారం ఇక్కడి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో రాజకీయ పార్టీలు, రైతు ప్రజాసంఘాల సమావేశాన్ని నిర్వహించారు.
భూ సంస్కరణల ముసాయిదాలో కీలకమైన రెండు ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. భూములపై మరింత సీలింగ్ విధించాలని, ధార్మిక సంస్థలు, పరిశ్రమలు, ఇతర కంపెనీలకు భూ కేటాయింపుల్లో ఎలాంటి మిన హాయింపులూ ఇవ్వొద్దని కేంద్రం ప్రతిపాదించింది. మన రాష్ట్రం ఈ రెండు కీలక ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనపై అవగాహన కల్పించేందుకు, పార్టీల అభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మంత్రి రఘువీరా భేటీ వివరాలు వెల్లడించారు.
సీలింగ్ వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ, లోక్‌సత్తా మద్దతు ఇవ్వగా వామపక్షాలు వ్యతిరేకించాయని తెలిపారు. "భూ సంస్కరణల అమలులో ఇప్పటికీ కొన్ని లోసుగులు, లోపాలు, నిర్లిప్తత ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని పార్టీల ప్రతినిధులు, మేధావులు సూచించారు. వాటిని ప్రభుత్వం కచ్చితంగా పరిష్కరిస్తుందని చెప్పాం. ఇక సీలింగ్‌పై కేంద్ర ప్రతిపాదలన్నింటికి అంగీకరించాలని కమ్యూనిస్టుపార్టీలు కోరాయి. ఇప్పుడున్న సీలింగ్‌ను తాకవద్దని, ఉన్నదాన్నే మరింత సమర్థంగా అమలు చేయాలని, తప్పుడు «ద్రువపత్రాలు ఇచ్చిన కేసులను నిశితంగా పరిశీలించాలని ప్రధాన పార్టీలు కోరాయి.
కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరించకుండా, అలాగని ఆమోదించకుండా.. సాగునీటి లభ్యత ఆధారంగా భూముల సీలింగ్ నిర్ణయించాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ అంశంపై చాలా బాధ్యతగా కేంద్రానికి సమాధానం పంపిస్తాం. సీలింగ్ వద్దని మేం సమాధానం ఇస్తాం. ఇక దేవాదాయ, వ క్ఫ్ భూములు తక్కువగా ఉండాలంటున్నారు. అసలు ఆ భూముల్లో జోక్యం చేసుకొనే అధికారం మాకులేదు. భూ సంస్కరణల అమలుకు గతంలో కమిషనర్ ఉండేవారు. దాన్ని రద్దుచేశారు. రాష్ట్రం తిరస్కరించిన రెండు ప్రతిపాదనలనే గతంలో కోనేరు రంగారావు కమిషన్ సిఫారసు చేసింది. అప్పుడు కూడా ఆ రెండింటినీ తిరస్కరించాం.
1973-75కాలంలో వచ్చిన భూ సంస్కరణల వల్ల కేవలం ఐదున్నర లక్షల ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేశారు. కేంద్రం ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో భూ సంస్కరణల అమలుపై ప్రత్యేక కమిషనర్‌ను నియమించే ప్రతిపాదనకు అంగీకరిస్తున్నాం'' అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 1.30 లక్షల భూమి సాగుకు యోగ్యమైనదని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత దాన్ని పేదలకు పంచుతామన్నారు.
ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ "మా దగ్గర భూమి ఉన్నది. ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. మాకు నాలుగు రెట్ల విలువ చెల్లించండి అని ఎవరైనా అడిగితే? నాలుగు రెట్ల ధర చెల్లించే సత్తా మాకు లేదు'' అని రఘువీరా అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు, వైసీపీ నేత నాగిరెడ్డి, బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, లోక్‌సత్తా నేత వర్మ, న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్, ఏఐకేఎంఎస్ నేత కె.రంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘ నేత వెంకట్, ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి, కాకి మాధవరావు, గోపాలరావు పాల్గొన్నారు.
సీలింగ్ రగడ
September 08, 2013
హైదరాబాద్,సెప్టెంబర్ 7: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా భూముల సీలింగ్‌పై కేంద్రం చేపట్టిన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పీటముడులు వేస్తోంది. సెంటుభూమి కూడా లేని నిరుపేదలకు మేలు చేసేలా మలిదశ భూ సంస్కరణలు చేపట్టాలన్న కేంద్ర సర్కారు ఆలోచనలు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ భూ సంస్కరణల ముసాయిదాకు ఆమోదం తెలిపే విషయంలో ఆ ఒక్కటి తప్ప అన్నట్లుగా వ్యవహరిస్తోంది. సర్కారు తీరుపై రైతుకూలీ సంఘాలు, కమ్యూనిస్టుపార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీలింగ్ అంశంతోపాటు భూ సంస్కరణల ముసాయిదాలోని ఇతర అంశాలపై చర్చించేందుకు రెవెన్యూ శాఖ ఆదివారం రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది.
భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)కార్యాలయంలో జరిగే ఈ భేటీకి రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, సీసీఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కేంద్రం ఇటీవల భారీ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక భూ సేకరణ చట్టం తీసుకొచ్చింది. నిరుపేదలకు సాగుభూములు అందించేందుకు మలి విడత సంస్కరణలకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా ఆర్థిక, సామాజిక నిపుణులతో చర్చించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ముసాయిదాను తయారు చేసి, దానిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. వాస్తవానికి ముసాయిదాపై చర్చించేందుకు ఈ నెల 2న ఢిల్లీలో రెవెన్యూ మంత్రుల సమావేశం జరగాల్సి ఉంది. దాన్ని కేంద్రం వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని నివేదిక రూపంలో పంపించలేదని సమాచారం. పైగా, సీలింగ్ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తోంది.
ముసాయిదాలో ముఖ్యమైన ప్రతిపాదనలు
భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం సాగుభూమిపై 5-10 ఎకరాలు, సాగేతర భూమిపై 10-15 ఎకరాల సీలింగ్ ఉంటే రాష్ట్రాలు వెంటనే సీలింగ్ పరిమితిని పున: సమీక్షించాలి.
జూ మతపరమైన, విద్యాపరమైన, థార్మిక, పారిశ్రామిక సంస్థలకు వ ర్తించే సీలింగ్‌ను సమీక్షించాలి. వీటికిచ్చే మినహాయింపులను తక్షణమే రద్దుచేయాలి. వీటి విషయంలో యూనిట్‌కు సగటున 15 ఎకరాలకు మించి ఉండకూడదన్న షరతు విధించాలి.
మిగులు భూములను నిర్ధిష్టకాలంలో పేదలకు పంచేందుకు రాష్ట్రాలు సింగిల్ విండో విధానాన్ని అవలంభించాలి.
అన్ని రాష్ట్రాలు భూ యాజమాన్యంపై సీలింగ్ విధించాలి. లీజులకు ఇచ్చే భూములు కూడా దీని పరిధిలోకి తీసుకురావాలి. ఎట్టిపరిస్థితుల్లో ఒక వ్యక్తి, సంస్థ, వ్యవస్థ ఏ రూపంలోనూ అత్యధిక భూమి కలిగి ఉండకూడదు.
బినామీ భూముల హక్కుదారులను కనిపెట్టేందుకు, వివిధదారుల్లో భూమి వ్యక్తుల చేతుల్లో బందీకాకుండా ఉండేందుకు ఉపయోగించే ప్రొహిబిషన్ ఆఫ్‌ది రైట్ టూ రికవర్ ప్రాపర్టీ చట్టం-1989ను తగిన విధంగా సవరించాలి.
మిగులు భూములు పేదలకు పంపిణీ చేసిన తర్వాత అవి పేదల యాజమాన్యంలోనే ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. ఒకవేళ ఆ భూమి పేదల చేతిలో లేకుంటే వెంటనే తిరిగి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలి.
మిగులు భూముల జాబితాలను తయారు చేసి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజన గ్రామ సభ ఆమోదం, లేదా నిర్ణయం మేరకే మైనింగ్ చేపట్టాలి. మైనింగ్‌కు అనుమతి పొందిన సంస్థ తన లాభాల్లో కొంత వాటాను గ్రామానికి కేటాయించాలి. ఇలా అనేక రకాల సూచనలతో ముసాయిదాను సిద్ధం చేశారు.
రాష్ట్రాలు పేదల భూములు, ప్రభుత్వ భూముల రక్షణకు భూ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ నివేదికలను ఏటా అసెంబ్లీలో చర్చకుపెట్టాలి.
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి.
పేదల తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు విలువైన భూములు అమ్ముకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. గిరిజనేతర ప్రాంతాల్లో గిరిజనుల భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ఇవి కాకుండా మరో 14 సాధారణ ప్రతిపాదనలున్నాయి. సీలింగ్ మినహా అన్నిటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద భూ సంస్కరణల ముసాయిదాపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్రం ప్రతిపాదించినట్లుగా భూ సీలింగ్‌కు ఒప్పుకోవద్దని రెవెన్యూశాఖ సీఎంకు నివేదించింది. ఆ సమావేశం అనంతరం రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడారు. "భూ సంస్కరణల్లో భాగంగా మరింత భూమి సీలింగ్ తీసుకురావాలన్న కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం అంగీకరించదు. భూమి సీలింగ్‌ను సాగునీటి వనరులున్న భూమికి 5-10 ఎకరాలు, వర్షాధార పంటలు పండే భూమికి 10-15 ఎక రాలు పెట్టాలంటున్నారు.
ఇది సాధ్యంకాదు. దీనికి మేం సిద్ధంగా లేం. ఇందుకు కారణం ఉంది. సీలింగ్ వల్ల అనేక ఇబ్బందులొస్తాయి. ఓ వైపు యాంత్రికీకరణ పెరిగిపోతే, కమతాలు మరీ చిన్నవై సమస్యలొస్తాయి. కాబట్టి వాటిని మేం మార్పుచేయడం తగదు. ఇది శాస్తీయపరంగా కూడా సాధ్యం కాదు'' అని ఆయన చెప్పారు.మంత్రి ప్రకటనపై అఖిల భారత రైతు కూలీ సంఘం, రైతు సంఘం, వ్యవసాయకార్మిక సంంఘం, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీలింగ్ వద్దనడం అంటే పేదలకు వచ్చే సాగుభూమిని అడ్డుకోవడమేనని అవి స్పష్టం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాల స్పందన భిన్నంగా రావడంతో తమ వాదనపై వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
No comments:
Post a Comment