వెయ్యేళ్ళ అనుభవం - వెయ్యేళ్ళ అవసరం
September 14, 2013
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పుడు సీమాంధ్రకు ముఖ్యంగా కోస్తాంధ్రకు రాజధానిగా ఎంపిక చెయ్యదగ్గ నగరం లేకపోవడం వెనుక, ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతున్నా కనీసం ఉద్యమాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఆసరా చేసుకునైనా ఉద్యమానికి సారథ్యం వహించే నాయకత్వం ఆవిర్భవించకపోవడం వెనుక చారిత్రక కారణాలున్నాయేమో పరిశీలించవలసివుంది.
ఈ పరిణామం వెనుక కారణాలు యాభై లేదా వంద సంవత్సరాలకు పరిమితమైనవా లేక అంతకంటే ముందునుంచీ ఉన్నాయా అనేది పరిశీలిస్తే దీని పునాదులు వెయ్యేళ్ళ క్రితం నుంచీ ఉన్నాయనీ, ఇది మధ్యయుగాల కోస్తాంధ్ర స్థితికీ కొనసాగింపు మాత్రమేనని అర్థమౌతుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌కీ తెలుగు భాషా సంస్కృతులకు ప్రతీకగా నిల్చిన కోస్తాంధ్ర వెయ్యేళ్లుగా నాయకత్వ సమస్యతోనూ, తమకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థ లేమితోనూ కునారిల్లుతోందని స్పష్టమౌతున్నది. 1850ల ముందు పరిస్థితి అటుంచితే ఆ తర్వాత కోస్తాంధ్రలో సంభవించిన వ్యావసాయక ఆర్థిక విప్లవం, తద్వారా వ్యాపించిన ఆంగ్ల విద్య, ఫలితంగా సంభవించిన సాంస్కృతిక పునరుజ్జీవనాలలో మునిగితేలిన కోస్తాంధ్ర తనకు ఒక నిర్దిష్టమైన రాజకీయ నాయకత్వం కొరవడిన వైనాన్ని గుర్తించలేకపోయింది. ఆశ్చర్యకరంగా 1850లకు ముందు ఏడెనిమిది వందల చరిత్ర కూడా రాజకీయ నాయకత్వ సమస్య మేరకు ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. తెలుగు సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదిగిన కోస్తాంధ్ర రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి చెందని ప్రాంతాల పట్ల నిర్లక్ష్యాన్ని వివక్షను ప్రదర్శించింది. ఈ వైఖరి ఆ ప్రాంతాలలో ప్రత్యేక అస్తిత్వ ఉద్యమాలకు దారితీయడంతో తన అస్తిత్వాన్ని ఇతర అస్తిత్వాలతో ముడిపెట్టుకు కూర్చున్న కోస్తాంధ్ర ఇతరులతో కలిసి ఉంటేనే తన అస్తిత్వం నిలబడే స్థితికీ, లేకపోతే అస్తిత్వ రాహిత్యంలోకి జారిపోయే దుస్థితికీ వచ్చేసింది.
కృష్ణ, గోదావరి, నాగార్జునసాగర్ ఆనకట్టల నిర్మాణం తర్వాత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన కోస్తాంధ్ర తగినరీతిలో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా ఎదగలేకపోవడమూ, ఆర్థిక వ్యవస్థలో మాదిరిగానే ఆలోచనా రీతుల్లోనూ సంప్రదాయ ధోరణినే అనుసరిస్తూ చుట్టూ వస్తున్న ఆధునిక ధోరణులను గుర్తించలేకపోవడమూ, సంపద, కులమూ, వివాహమూ తప్ప ఏ ఇతర అంశమూ మనుషుల్ని సంధానపరచలేక పోవడమూ అనే స్థితులకు మొత్తంగా సామాజిక ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలను క్రోడీకరించే ఒక రాజకీయ నాయకత్వం లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఒక వైపు పెరిగిన సంపద కోస్తాంధ్రలో మనుషుల్ని ద్వీపాలుగా మలచి ఎవరి అస్తిత్వం వారిదేననే ఏకాంత తత్వానికీ, మరోవైపు అణచివేయబడిన కులాల్లో ఉండాల్సిన కుల అస్తిత్వ స్పృహ అగ్రకులాలకు కూడా విస్తరించి వ్యతిరేక చైతన్యానికీ దారి తీసింది కానీ ఇతర ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలను చూసినప్పుడైనా తమకు కూడా ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం అవసరమని గుర్తించ లేకపోయింది. సంపదే పరమ లక్ష్యంగా సాగే సమాజాల్లోని మనుషులు తమ సంపదకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఏకమౌతారనీ అప్పుడు నాయకుల అవసరం ఉండదనీ ప్రతి వ్యక్తీ ఒక నాయకుడు లేదా నాయకురాలు అయి తమను తాము నడిపించుకుంటారని సమైక్యాంధ్ర ఉద్యమం రుజువు చేసింది. ఒక వైపున అసలు నాయకత్వమే లేకపోవడమూ మరోవైపు ప్రతి వ్యక్తీ నాయకుడుగా మారిపోవడమూ ఇంకొకవైపు తాము ఎవరికి వారు ఒంటరి ద్వీపాలల్లే ఉంటూనే ఇతర ప్రాంతాల వారితో కలిసి ఉంటామనే ఆదర్శం కలిగిఉండడంలోని విరోధాభాస (పారడాక్స్) చర్చనీయాంశం. ఏమైనా దీనితో పాటు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు కోస్తాంధ్ర సంపద మద్రాసుకూ, ఆ తర్వాత అరవయ్యేళ్ళపాటు హైదరాబాదుకు తరలిపోవడానికీ, కోస్తాంధ్రలో ఆ రెండు నగరాలకూ సరితూగగలిగే నగరం లేకపోవడానికీ వెనుక దాదాపు వెయ్యేళ్ళ చారిత్రక వారసత్వం ఉన్నట్లనిపిస్తున్నది. నగరం లేకపోవడానికి ఒక రాజకీయ వ్యవస్థ లేకపోవడమూ, రాజకీయ వ్యవస్థ లేకపోవడానికి బలమైన నాయకత్వం లేకపోవడమూ కారణమేమో పరిశీలించవలసివుంది.
గత వెయ్యేళ్ళలో సీమాంధ్రలో సీమాంధ్ర కేంద్రంగా బలమైన కేంద్ర ప్రభుత్వం లేదు. అది సహజపరిణామమే. ఎందుకంటే మధ్యయుగ లక్షణమే బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడమూ, చిన్నచిన్న మండలాలుగా విభజితమై ఉండడమూను అయితే మధ్యయుగ ఫ్యూఢల్ లక్షణం బలహీనమైన కేంద్ర ప్రభుత్వంలో బలమైన భూస్వామిక వర్గం ఉండడం. కానీ సీమాంధ్రలో ఆ యుగంలో బలా బలాలతో నిమిత్తం లేకుండా అసలు కేంద్ర ప్రభుత్వమే లేకపోవడం ప్రధాన లక్షణం. ఈ వెయ్యేళ్ళలో రెడ్డిరాజులు పాలించిన స్వల్పకాలం మినహాయించి సీమాంధ్ర రాజధాని సీమాంధ్రలో లేదు. అంటే వెయ్యేళ్ళ పాటు సీమాంధ్రలో కేంద్ర ప్రభుత్వం లేదు. దూరంగా ఉన్న రాజధానుల నుంచే పాలన అంతా సాగింది.
దూరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చేత పరిపాలించబడడం వెనుక మధ్యయుగ పరిమితుల మేరకైనా ఒక శక్తిగా కోస్తాంధ్ర పరిణమించ లేకపోవడం ఉందనిపిస్తుంది. జాతి, భాష, ప్రాంతీయ స్పృహలు ఏ మాత్రం లేని యుగమైనప్పటికీ కేవలం రాజ్యాధికార స్పృహతోనైనా ఈ యుగంలో సీమాంధ్ర కేంద్రంగా రాజకీయశక్తి అవతరించలేదు. కాకతీయ రాజ్యానికి సమకాలీన రాజ్యాలైన యాదవ, హోయసల రాజ్యాల పతనానంతరం అక్కడ బహమనీ, విజయనగర సామ్రాజ్యాల అవతరణకు ప్రోత్సహించిన పరిస్థితులేవో కోస్తాంధ్రలో కొరవడ్డాయి. బహుశా ఉత్తరాది నుంచి ముఖ్యంగా ఢిల్లీ నుంచి దక్షిణానికి ప్రవేశించే దారికి దూరంగా ఉండడం కోస్తాంధ్రను మధ్యయుగ ఢిల్లీ ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా చేసింది. మధ్యయుగ ఢిల్లీ రాజకీయమంతా దక్కన్ పీఠభూమి మధ్య భాగాన నెలకొన్న బహమనీ, విజయనగర సామ్రాజ్యాలతో ముడిపడి ఉండడం కూడా కోస్తాంధ్రను రాజకీయ అప్రాధాన్యతకు గురిచేసింది. ఫలితంగా శతాబ్దాల తరబడి కోస్తాంధ్రకు తనదైన స్థానిక రాజ్యమూ, రాజధానీ లేకపోయాయి.
స్వాతంత్య్రోద్యమం కూడా సీమాంధ్ర నుంచి ఒక జాతీయ స్థాయి నాయకుణ్ణి కాదు కదా కనీసం మద్రాసు రాజకీయాల్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకుణ్ని కూడా రూపొందించుకోలేకపోయింది. మహారాష్ట్ర, మద్రాసు రాష్ట్రాలు పదుల సంఖ్యలో జాతీయ నాయకుల్ని రూపొందించుకోగా కోస్తాంధ్ర ప్రకాశం పంతులు స్థాయిని మించిన నాయకుణ్ణి జాతీయోద్యమానికి ఇవ్వలేకపోయింది. వెయ్యేళ్ళ రాజకీయ సారథ్యం లేకపోవడం స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ కొనసాగినట్లనిపిస్తోంది. మద్రాసు రాష్ట్రంలో దశాబ్దాలుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉపేక్షించబడి ప్రత్యేక రాష్ట్రం కోసం 1913 నుంచే ఉద్యమించ గల్గిన రాజకీయ చైతన్యం ఒక ముఖ్యనగర నిర్మాణం పట్ల దృష్టి నిలపకపోవడంలో ఉన్నది మౌలిక ప్రాంతీయ అస్తిత్వ స్పృహ లేకపోవటమే. జాతీయోద్యమ చైతన్యం కోస్తాంధ్రలో లేనేలేదా అంటే తీరాంధ్ర జిల్లాలు జాతీయచైతన్యంలో నిస్సందేహంగా సముద్రపుటలలతో పోటీపడ్డాయి. జాతీయ కాంగ్రెస్ స్థాపితమైన ఆరేళ్ళలోనే ఆంధ్రుడికి అధ్యక్ష పదవి దక్కింది.
1892లో ఏర్పడిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం జిల్లా స్థాయి సంఘాల్లో దేశంలోనే మొట్ట మొదటిది. ఆరంభం బాగానే ఉంది కానీ క్రమానుగత అధిరోహణం జరగలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం రాష్ట్రాన్ని నడిపించగల నాయకత్వ లోపం కోస్తాంధ్రలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇందుకు నందమూరి తారక రామారావు ఒక్కడు మినహాయింపు. ఆయన రాష్ట్రాన్ని శాసించగల స్థితికి కేంద్ర రాజకీయాలను ఆదేశించగల స్థితికి చేరుకున్నాడు కానీ తెలుగు జాతిని నిండుగ వెలుగు జాతిగా మాత్రమే చూడగలిగాడు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు రాష్ట్రానికి పరంపరగా ముఖ్యమంత్రుల్నీ దేశానికి రాష్ట్రపతుల్ని, ప్రధానుల్ని ఇస్తుండగా ఒకరిద్దరు అప్రధానమైన ముఖ్యమంత్రుల్ని స్వల్పకాలానికి మాత్రమే ఇవ్వగలిగింది కోస్తాంధ్ర. తోటి వారిని కూడగట్టుకోగలిగిన నేర్పు లేకపోవడమూ ఎవరినైనా సరే అనుసరించడం ఇష్టం లేని స్వతంత్ర దృక్పథం ఉండడమూ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకోవడమే కానీ మొత్తం ప్రాంతానికి నిర్దిష్ట లక్ష్యాన్ని రూపొందించుకోవాలనే ప్రాంతీయ స్పృహ లేకపోవడమూ కోస్తాంధ్ర సంతరించుకున్న లక్షణాలు. ఇంత ప్రజా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఉన్న పరిస్థితుల్లోంచి ఒక్క ప్రజానాయకుడూ ఉద్బూతం కాకపోవడం గతానికి కాదు భవిష్యత్తుకు కూడా సూచిక అయితే అది తప్పకుండా ప్రమాద హెచ్చరిక అవుతుంది.
ఈ పరిస్థితుల సారాంశం ఏమిటంటే కోస్తాంధ్ర మిగిలిన ప్రాంతాల కంటే భిన్నమైన అస్తిత్వాన్ని కలిగి ఉంది.
అట్లాంటి కోస్తాంధ్ర అన్నిటినీ కలుపుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉండడం ఆత్మహత్యా సదృశమౌతుంది. సమైక్యమనే ఆదర్శం కోస్తాంధ్రను ఇతర ప్రాంతాల మీద ముఖ్యంగా హైదరాబాద్ నగరం మీద మరింత ఆధారపడేటట్లు చేస్తుంది. మరొకరు ఆశిస్తున్న నగరం మీద ఆధారపడడం తీవ్ర అభద్రతకు దారితీసి భవిష్యత్తు దృశ్యాదృశ్యమై పోతుంది. విభజన ఇప్పటికైనా కోస్తాంధ్రకు తనదైన ప్రాదేశిక అస్తిత్వాన్ని ఇస్తుంది. ఒక రాజకీయ నాయకత్వాన్ని అనివార్యం చేస్తుంది. ఒక రాజధానిని వాగ్దానం చేస్తుంది. తనలోకి తాను చూసుకుని తన శక్తుల్నీ, బలహీనతల్నీ అవకాశాల్నీ ప్రమాదాల్నీ గుర్తించేటట్లు చేస్తుంది. లక్ష్యాలు, గమ్యమూ పునర్ నిర్వచించబడతాయి. స్వేచ్ఛ లభిస్తుంది. ఒక దిశా నిర్దేశం జరిగి అడుగులు సరికొత్తగా పడతాయి.
విభజన జరిగి హైదరాబాదును కోల్పోవడం వల్ల కొన్ని నష్టాలు, కొన్ని కొత్త సమస్యలూ ఉత్పన్నం కావొచ్చు. అయితే అవి పరిష్కారానికి అతీతమైనవేం కావు. విభజనను అంగీకరించవలసివచ్చినప్పుడు 'అవసరం నూతన ఆవిష్కరణని అనివార్యం చేస్తుంది' అనే నానుడి వర్తిస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రాదేశిక విభాగం ఏర్పడడం, దాన్ని నడిపించడానికి ఒక కేంద్రకం ఆవిర్భవించడమే ఆ అవసరం. ఈ అవసరం ఇవ్వాళ తెలంగాణ నాయకులో ప్రజలో కేంద్ర ప్రభుత్వమో కల్పించింది కాదు. ఇది వెయ్యేళ్ళ అవసరం. ఇది వెయ్యేళ్ళ అనుభవం.
కొత్త రాజధాని ఒక ఇన్వెన్షన్ (ఆవిష్కరణ) అవుతుంది. ఒక శాస్త్రీయమైన సత్యాన్ని ఆవిష్కరించడం లేదా ఒక సాంకేతిక నిర్మాణాన్ని సాధ్యం చేసుకోవడం వంటిది. హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల క్రితం పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం ప్రారంభమైన నగరం. అన్ని నగరాల మాదిరిగానే చెప్పుకోదగిన ప్రణాళిక లేకుండానే అభివృద్ధి చెందిన నగరం. ఇవ్వాళ విపరీతంగా పెరిగిన రద్దీని తట్టుకోలేక ట్రాఫిక్ జామ్‌లతోనూ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక కురిసిన కొద్దిపాటి వర్షానికే కాలువలుగా మారిపోయే రహదార్లతోనూ సతమతమౌతున్న నగరం. దీనికి ప్రత్యామ్నాయంగా నిర్మించుకోబోయే ఆధునిక నగరం కనీసం రాబోయే రెండు మూడు వందల సంవత్సరాల అవసరాలను తీర్చగలిగే విధంగా రూపొందించుకునే అవకాశం కట్టెదుట నిలచి ఉంది. రాజధాని అనగానే విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇత్యాది పౌర అవసరాలను తీర్చగలిగేదై ఉండాలనే ఆలోచన అవసరం లేదు. రాజధానిని కేవలం పాలనా యంత్రాంగానికి పరిమితమైన కేంద్రంగా ఉంచుకుని ఇతర అవసరాలను తీర్చే విధంగా సమీప పట్టణాల్ని అభివృద్ధి పరచుకునే అవకాశం ఉంది.
ఎదురవుతున్న నూతన రాజధాని నగర నిర్మాణం అనే సవాలును సీమాంధ్రులు వెయ్యేళ్ళ అనుభవం దృష్ట్యానైనా స్వీకరించాలి. ఈ సందర్భంగా కోల్‌కాతా నగర నిర్మాణం మూడు గ్రామాల్ని కలపడంతో ప్రారంభమైందని, కొద్దిపాటి ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతో మద్రాసు రేవూ, నగరమూ ఆరంభమయ్యాయనీ, బొంబాయి అభివృద్ధికి పూనుకోక ముందు అది కేవలం రేవు మాత్రమేనని ఈ మూడు మహా నగరాలు మూడు శతాబ్దాల క్రితం ఉనికిలోనే లేవని గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాకపోగా స్ఫూర్తిదాయకం కూడా.
చారిత్రకంగా నస్టపోయిన దాన్ని భర్తీచేసుకోవడం ఈ యుగ లక్షణం. కోల్పోయిన ఆత్మగౌరవాన్నీ సామాజిక స్థానాన్నీ దళితులు ఆక్రమించుకుంటున్నారు. మహిళలు జెండర్‌లో రెండవ స్థానం అనేది లేకుండా చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తితో ఎదగడానికి ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఒక అస్తిత్వ స్పృహతో తనకు ఉన్నదేమిటో, లేనిదేమిటో గుర్తించాలి. అందుకు గతంలోకి చూడాలి. వర్తమానాన్ని అందిపుచ్చుకోవాలి. భవిష్యత్తును నిర్మించుకోవాలి. వర్తమానం గతంతో చేసే నిరంతర సంభాషణే చరిత్ర అంటున్నాడు ప్రముఖ చరిత్రకారుడు ఇ.హెచ్.కార్. అవును, చరిత్ర అంటే గతం కాదు, భవిష్యత్తు.
- కొప్పర్తి వెంకట రమణమూర్తి
No comments:
Post a Comment