Saturday, 21 September 2013

ఐటీఐఆర్ - ఏమిటా రహస్యం!?

ఏమిటా రహస్యం!?

September 22, 2013


హైదరాబాద్, సెప్టెంబర్ 21 : హైదరాబాద్ ప్రతిపత్తిపై రకరకాల ప్రతిపాదనలు తెరమీదికి వస్తున్న సమయంలో... కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. "ఢిల్లీ పెద్దలు చెప్పేదొకటి. ఇక్కడ జరిగేది మరొకటి. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి'' అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. దీనిపై ఢిల్లీలో ఉన్న తమ సహచరుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. హైదరాబాద్‌కు భారీ ప్రాజెక్టు ప్రకటించడం, మరిన్ని ప్రాజెక్టులు డంప్ చేయాలనే ప్రతిపాదనలు వంటివి... రాజధాని నగరం 'భవిష్యత్ హోదా'తో ముడిపడినవే అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ యూటీ, చండీగఢ్ తరహా యూటీ, ఢిల్లీ తరహా యూటీ వంటి అనేక ప్రతిపాదనల నేపథ్యంలో... హైదరాబాద్‌ను పారిశ్రామికంగా, మౌలికంగా పరిపుష్టం చేసే చర్యలు తీసుకోవడం గమనార్హం.



కేంద్ర ప్రభుత్వం 2008లో ఐటీఐఆర్‌లపై ఒక విధానాన్ని రూపొందించింది. సెజ్‌ల ఏర్పాటుపై మంచి ఊపుమీదున్న అప్పటి ప్రభుత్వం ఐటీఐఆర్‌నూ ఒకచూపు చూడాలని అనుకుంది. వైఎస్ తర్వాత సీఎం అయిన రోశయ్య 2010 తొలి నాళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తర్వాత రెండున్నరేళ్లకు... అంటే గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ఐటీఐఆర్‌కు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇది జరిగిన ఏడాదికి అంటే... శుక్రవారం తుది ఆమోదముద్ర వేసింది. 'అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైంది. హైదరాబాద్‌ను వదులుకోం' అని సీమాం«ద్రులు వాదిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

"హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అనే పట్టుదలను పెంచేలా కేంద్ర నిర్ణయం ఉంది. అలాగే... హైదరాబాద్‌పై కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో ఇది ముడిపడి ఉండొచ్చు'' అని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఐటీఐఆర్ పాతికేళ్లలో, రెండు దశల్లో పూర్తయ్యే ప్రాజెక్టు. తొలి ఐదేళ్లలోనే రేడియల్ రోడ్లు, మెట్రో రైలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తారు. తర్వాతి 20 ఏళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఆశించిన స్థాయిలో వస్తాయా, రావా? అనే సంగతి పక్కనపెడితే... తొలి ఐదేళ్లలో మాత్రం మౌలిక వసతుల కల్పన జరగడం ఖాయం.

విభజన నిర్ణయంపై సీమాం«ద్రులకు సర్దిచెప్పాలన్నా, హైదరాబాద్‌పై మమకారాన్ని తగ్గించాలనుకున్నా... ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటించడం రాజకీయంగా తెలివైన నిర్ణయం అవుతుంది. కానీ, కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. హైదరాబాద్ విషయంలో కేంద్రం ఏదో మతలబుతోనే వ్యవహరిస్తోందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


రాజధానిలో చినుకు పడిందంటే రోడ్లు చిత్తడి చిత్తడే. మ్యాన్‌హోళ్లు నోళ్లు తెరుచుకుంటాయి. నగరంలో ఏ రోడ్డు చూసినా గోతులమయమే. గల్లీరోడ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తంగా నగర పౌరులకు వసతుల కల్పనలో జీహెచ్ఎంసీపై వైఫల్య ముద్రే ఉంది. అయితే... ఉన్నదాన్నే సరిగా నిర్వహించలేక నానా తంటాలు పడుతుండగా, కొత్తగా మరికొన్ని గ్రామాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ వాదుల్లోనే అనేక అనుమానాలున్నాయి. తెలంగాణపై నిర్ణయం ప్రకటించాక జీహెచ్ఎంసీ పరిధులను విస్తరించడం రాజకీయంగా అనైతికమని చెబుతున్నారు. ఇక సీఎం కిరణ్ కూడా హైదరాబాద్ నగర, శివార్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆదివారం ఆయన శివారు ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో... తెలంగాణ, సీమాంధ్రలోని ప్రధాన నగరాల్లో విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను ఆమోదించారు. ఇక గన్నవరం విమానాశ్రయాభివృద్ధి, వరంగల్ జిల్లాలో లెదర్ పార్కు ఏర్పాటు వంటి నిర్ణయాలను పరిశీలిస్తే రాష్ట్ర విభజన తప్పదని.. హైదరాబాద్‌పై మాత్రం 'ప్రత్యేక' ఏర్పాట్లు ఉంటాయని భావిస్తున్నారు.


హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న బడాబాబుల భూముల రేట్లను పెంచడానికే కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ కేటాయించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. "రెండేళ్ల కిందట పంపిన ప్రతిపాదనలను... రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆమోదించడం వెనుక కుట్ర ఉంది. రెండో శ్రేణి నగరాలను అభివృద్ధి చేయకుండా హైదరాబాద్‌కే మళ్లీ ఐటీఐఆర్‌ను కేటాయించడం సమంజసం కాదు'' అని ఆరోపించారు. మరోవైపు... హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకే శివారు గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారని తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హజారీ శ్రీనివాసరావు ఆరోపించారు.


విశాఖపట్నం: రాష్ట్ర విభజన ప్రకటనపై సీమాంధ్రలో తీవ్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో హౖౖెదరాబాద్‌కు భారీ ఐటీ ప్రాజెక్టు కేటాయించిన కేంద్రానికి... విశాఖపట్నం ఎందుకు గుర్తుకురాలేదని టీడీపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో విశాఖకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని మంత్రులపై బండారు ధ్వజమెత్తారు. మరోవైపు తాము హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అలాగే కోస్తా కారిడార్‌కు కార్యరూపమివ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు.

No comments:

Post a Comment