Friday, 20 September 2013

మార్కెట్, మండల్, మందిర్ - రాజ్‌దీప్ సర్దేశాయ్

మార్కెట్, మండల్, మందిర్ (దీప శిఖ) - రాజ్‌దీప్ సర్దేశాయ్

September 20, 2013
ఆడ్వాణీ రాజకీయ జీవితం ముగిసినట్టుగానే చాలా మంది భావిస్తున్నారు. 1990ల తొలినాళ్ళలో ఆడ్వాణీ హిందూత్వ నాయకుడుగా ప్రభవించిన అనంతరం వాజపేయి విషయంలో కూడా ఇలానే భావించారు. 1996లో సంకీర్ణ రాజకీయాల అనివార్యతల వల్ల 'సమ్మిళిత' వాజపేయి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా మోదీని ప్రకటించడం వల్ల ఆశిస్తున్న 272 ప్లస్ మెజారిటీ ఎన్డీఏకి రాకపోతే?! ఆడ్వాణీ రాజకీయ ప్రస్థానం మరో చివరి మలుపు తిరుగుతుందా?


పాములపర్తి వెంకట నరసింహారావు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, లాల్ కృష్ణ ఆడ్వాణీ- గత శతాబ్ది చివరి దశకంలో భారత రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసిన నాయక త్రయం. ఈ త్రిమూర్తులలో చివరి వ్యక్తి తన రాజకీయ జీవిత చరమాంకంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న తరుణమిది. ఇరవయ్యో శతాబ్దాంతంలో రాజకీయాలను పునర్ నిర్వచించిన ఈ ముగ్గురు నేతల జీవిత కృషిని సింహావలోకనం చేసుకొనేందుకు ఇది సరైన సమయం కాదూ?

తమ తమ దృఢవిశ్వాసాలను బట్టి గాక, పరిస్థితులను బట్టే ఈ ముగ్గురు నాయకులు సమకాలీన రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించారనడం సముచితంగా ఉంటుంది. 1991 మేలో రాజీవ్ గాంధీ హత్యకు గురై ఉండకపోతే నరసింహారావు విశ్రాంత జీవితంలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చరిత్రలో ఒక పాదసూచికగా మిగిలిపోయి ఉండేవారని ఖాయంగా చెప్పవచ్చు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను అరికట్టడంలో నరసింహారావు వైఫల్యం ఆయన స్మృతికి ఎంతైనా కళంకం.

ఇక వీపీ సింగ్, ఇందిర-సంజయ్‌ల హయాంలో న్యూఢిల్లీ ఆదేశానుసారం వ్యవహరించిన మరొక ముఖ్యమంత్రి మాత్రమే. బోఫోర్స్ కుంభకోణం బహిర్గతమయిన తరువాతనే ఆయన ప్రసిద్ధుడయ్యారు; అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్న యోధుడుగా వెలుగొందారు. సరే, ఆడ్వాణీ, భారతీయ జనతా పార్టీ అస్తిత్వపు జీవ ధాతువు. రాజీవ్ ప్రభుత్వం బాబ్రీ మసీదు గేట్లు తెరచి ఉండకపోయినట్లయితే ఆడ్వాణీ తమ పార్టీ నాయకుడుగానే మిగిలిపోయి వుండేవారు.

మూడు పోటీదాయక భావజాలాల-మార్కెట్, మండల్, మందిర్-కు ఈ నాయకత్రయం ప్రతినిధులు. అయితే వారి ఆధీనంలో లేని శక్తుల కారణంగానే ఆ మూడు భావజాలాలు యాదృచ్ఛికంగా రూపుదిద్దుకుని నిర్ణయాత్మకమయ్యాయి. 1991లో చెల్లింపుల సమతౌల్యం సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ విపణి శక్తుల ప్రవేశానికి అనుమతించడం మినహా నరసింహారావుకు గత్యంతరం లేకపోయింది. తన నాయకత్వానికి జనతాదళ్‌లో అంతర్గతంగా తీవ్ర సవాళ్లు రాకుండా ఉన్నట్టయితే మండల్ కమిషన్ నివేదికను అమలుపరచడానికి వీపీ సింగ్ సాహసించేవారు కాదు. షాబానో అనే ముస్లిం మహిళ భర్త నుంచి భరణం పొందే హక్కును కలిగి వుండడానికి రాజీవ్ ప్రభుత్వం అనుమతించి ఉన్నట్టయితే ఆడ్వాణీ 'రథయాత్ర' హిందూ పునరుజ్జీవనానికి చిహ్నమయ్యేది కాదు.


పీవీ, వీపీ, ఆడ్వాణీలలో ఏ ఒక్కరూ స్వత సిద్ధ జననేత కాదు. ప్రజలను విశేషంగా ఆకట్టుకునే గుణం వారి నాయకత్వంలో లేదు. నరసింహారావు స్వల్పకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దశలో ఆయన మహారాష్ట్ర నుంచి మాత్రమే లోక్‌సభకు ఎన్నిక కాగలిగారు. వీపీసింగ్‌కు సైతం సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగిన ప్రజాబలం లేదు. ఇందిర-సంజయ్‌ల కరుణా కటాక్షాలతోనే ఆయన రాజకీయ ఉన్నతిని పొందారు. ఆడ్వాణీకి సైతం ఎప్పుడూ 'సొంత' రాష్ట్రం లేదు. న్యూఢిల్లీ, గాంధీనగర్‌ల నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యేవారు. ఒక విధంగా మార్కెట్, మండల్, మందిర్ భావజాలాలకు ప్రతినిధులవ్వడం వల్లే వారికి ఒక స్పష్టమైన రాజకీయ ఉపయుక్తత సమకూరింది. లేనిపక్షంలో వారు ఏ విధంగానూ స్ఫూర్తిదాయక నాయకులు కారు.


లాల్ కృష్ణ అడ్వాణీ, అటల్ బిహారీ వాజపేయిల మధ్య వ్యత్యాసాన్ని చూడండి. వాజపేయి 'సహజ' రాజకీయవేత్త. అద్భుతమైన వక్త. ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్. రాజనీతిజ్ఞుడైన నాయకుడు. సామాన్య ప్రజలను అర్థం చేసుకున్న నాయకుడు. మరి ఆడ్వాణీ వ్యూహకర్త, సైద్ధాంతికవేత్త మాత్రమే. జనసమూహాలను ఆయన ఉత్తేజపరచలేరు. వాటి నుంచి ఆయన స్ఫూర్తి పొందలేరు. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయగల నేర్పరి. మూడుసార్లు ప్రధాన మంత్రి అయిన నేతగా వాజపేయి చరిత్ర ప్రసిద్ధులయ్యారు. అయితే ఒక వాస్తవాన్ని మనం స్పష్టంగా గుర్తించాల్సి వుంది. అడ్వాణీ నిరంతర శ్రమ వల్లే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని త్రోసిపుచ్చే ప్రత్యామ్నాయ శక్తి సృష్టించబడింది. భారతీయ జనతా పార్టీకి వాజపేయి, సచిన్ టెండూల్కర్ వంటి ఉజ్వల బ్యాట్స్‌మాన్ కాగా అడ్వాణీ ద్రావిడ్ వంటి పరిపూర్ణ ప్రతిభావంతుడైన క్రీడాకారుడు.

పరిమిత ప్రజాకర్షణ గల పీవీ, వీపీ, ఆడ్వాణీల రాజకీయ జీవితాలను, వారు సృష్టించిన విప్లవాలే అంతిమంగా పరిసమాప్తి చేయడంలో ఆశ్చర్యమేముంది? మార్కెట్ శక్తులకు అనుకూలమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన నరసింహారావు, నెహ్రూ-గాంధీ కుటుంబేతరులను బయటి వ్యక్తులుగా చూసే కుటుంబ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించలేకపోయారు. లైసెన్స్-పర్మిట్ రాజ్‌ను అంతమొందించిన ఘనతను మన్మోహన్ సింగ్ వంటి అధికారికేగానీ నరసింహారావు వంటి రాజకీయవేత్తకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఒక మచ్చుతునక. మన్మోహన్, అధినేత్రి అభిమతం ప్రకారం వ్యవహరించే వ్యక్తి కాగా నరసింహారావు ఆ కుటుంబ మనుగడకు ముప్పుగా పరిణమించిన నేత మరి.


వీపీ సింగ్ ఉన్నత కులస్తుడైన ఠాకూర్. మండల్ సిఫారసుల అమలుతో ఉత్తర భారతావనిలో ప్రభవించిన ఓ బీసీ రాజకీయ మహాశక్తితో పోటీ పడలేకపోయారు. 1990ల తొలినాళ్లలో అధికారాన్ని చవిచూసిన లాలూలు, ములాయంలు, ఆ ప్రాభవాన్ని మరెవ్వరితోనూ పంచుకోవడానికి ససేమిరా అన్నారు. తమ రాజకీయ దక్షతపై వారికి అపరిమిత విశ్వాసం ఉంది. విధేయులను కూడగట్టుకుని తమ పట్ల వ్యక్తి ఆరాధనా తత్వాన్ని ప్రోత్సహించారు. వీపీ సింగ్ నిస్సహాయుడైపోయాడు. ఏ చరిత్ర ఆవిర్భావానికి అయితే తాను సహాయపడ్డాడో ఆ చరిత్రే తనను పరిత్యజించిందనే విషాదంతో ఆయన ఈ లోకపు ఆవలి తీరాలకు వెళ్ళిపోయారు.

గత శతాబ్ది చివరి రెండు దశకాలలో ఆడ్వాణీ పలువురు యువ నాయకులను తీర్చిదిద్దారు. నరేంద్ర మోదీ అనే వ్యక్తి కూడా వీరిలో ఒకరు. ఈ యువనేతలందరికీ ఆడ్వాణీ ఒక పెద్దగా వ్యవహరించారు. అయోధ్య రథయాత్రలో ఆడ్వాణీకి మోదీ సహ రథికుడుగా కూడా ఉన్నారు. హిందూత్వ భావజాలంతో రూపొందిన నాయకులు వీరు. తమ భావజాలానికి సుపరిపాలన అనే మంత్రాన్ని జోడించి పార్టీ విస్తృత వ్యాప్తికి ఈ యువనేతలు పూనుకున్నారు. ఈ లక్ష్య సాధనలో మంచి ఫలితాలను సాధించి అగ్రగామిగా ఉన్న నేత నరేంద్ర మోదీ. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఆయన వెనుక నిలబడ్డారు. దేశ జనాభా రూపురేఖల్లో చోటుచేసుకున్న మార్పులూ ఈ రాజకీయ పరిణామాన్ని అనివార్యం చేశాయి.


విధి విన్యాసాలు ముఖ్యంగా రాజకీయాల్లో విచిత్రంగా ఉంటాయి. 2002 గుజరాత్ మతతత్వ ఊచకోతల అనంతరం మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా పట్టు పట్టింది. అయితే పార్టీ సిద్ధాంతకర్త అయిన ఆడ్వాణీ మోదీని గట్టిగా వెనకేసుకువచ్చారు. మోదీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలకు తప్పుడు సందేశం పంపినట్లవుతుందని ఆయన వాదించారు. హిందూత్వ అభిమానులు సైతం పార్టీకి దూరమవుతారని ఆడ్వాణీ అన్నారు. 'అలా జరిగి ఉంటే..' అనే ఆలోచనలకు తావిచ్చే సంఘటనలు భారత రాజకీయ చరిత్రలో చాలా ఉన్నాయి. 2002లో పనాజీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశంలో అడ్వాణీ వాదనలను అంగీకరించకుండా వాజపేయి 'రాజధర్మ'ను అనుసరించి మోదీని తొలగించడానికి నిర్ణయం తీసుకొని ఉన్నట్టయితే?!

తాజా కలం : ఆడ్వాణీ రాజకీయ జీవితం ముగిసినట్టుగానే చాలా మంది భావిస్తున్నారు. 1990ల తొలినాళ్ళలో ఆడ్వాణీ హిందూత్వ నాయకుడుగా ప్రభవించిన అనంతరం వాజపేయి విషయంలో కూడా ఇలానే భావించారు. అయినప్పటికీ 1996లో సంకీర్ణ రాజకీయాల అనివార్యతల వల్ల 'సమ్మిళిత' వాజపేయి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా మోదీని ప్రకటించడం వల్ల ఆశిస్తున్న 272 ప్లస్ మెజారిటీ ఎన్డీఏకి రాకపోతే?! ఆడ్వాణీ రాజకీయ ప్రస్థానం మరో చివరిమలుపు తిరుగుతుందా?
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

No comments:

Post a Comment