Thursday, 5 September 2013

ఒట్టేసి చెప్తున్నా.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తా - Chandrababu

ఒట్టేసి చెప్తున్నా.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తా

September 06, 2013


గుంటూరు, సెప్టెంబర్ 5: "కాంగ్రెస్ పెట్టిన చిచ్చుతో రగులుతున్న తెలుగుజాతిపై ఒట్టేసి చెబుతున్నా. మీ పొట్టలు కొట్టేందుకు చూస్తోన్న ఆ పార్టీని మీ అందరి సహకారంతో భూస్థాపితం చేస్తా. అప్పటివరకు నిద్రపోను. నేను ధర్మయుద్ధం చేస్తున్నా. మీకు ద్రోహం చేసిన వారెవరైనా అంతుచూసే వరకు ఊరుకోను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మోతడక నుంచి చంద్రబాబు తన ఐదో రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తీరును చంద్రబాబు ఎండగట్టారు.

'ఇదేమి న్యాయం. 36 రోజులుగా కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. తమ పిల్లలు చదువులు ఏమైపోతాయి. ఉద్యోగాలు ఎలా వస్తాయి? రేపటి రోజున తాగడానికైనా నీళ్లుంటాయా? అన్న భయంతో ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించకపోవడం దారుణం. సమాధానం చెప్పకుండా ముందుకు పోతున్నారు. ఇది న్యాయమా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఢిల్లీలో మకాం వేసిన దుష్ట చతుష్టయం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని.. కాంగ్రెస్ పెద్దలు చిదంబరం, అహ్మద్‌పటేల్, గులాంనబీ అజాద్, దిగ్విజయ్‌సింగ్‌లను తూర్పారబట్టారు. 'చిదంబరం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ అదే గొప్పనుకుంటున్నారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ మొనగాడిలా, హీరోలా ఫోజులు కొడుతున్నాడు. దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ ఎంపీలుగా గెలవలేరు. వీళ్లా తెలుగుజాతి తలరాతను రాసేద'ని మండిపడ్డారు. జగన్‌పై విమర్శలు సంధించారు.

'అత్తగారింటికి పోయినట్లుగా జైలుకు పోతున్నారు. అలాంటి దొంగబ్బాయి జగన్‌కు సీఎం పదవి కావాలట. దోచుకున్న డబ్బులతో పార్టీ, పేపర్, టీవీ పెట్టి నాపై విషం కక్కుతున్నారు. ఆ పత్రికలో నాపై నాలుగు పేజీలు చెత్తరాతలు రాస్తారు. వాళ్ల గురించి మూడు పేజీలు పరుచుకుంటారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న జగన్‌కు శాశ్వతంగా జైలులో ఉండే పరిస్థితి వచ్చింది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలుగుజాతితో పెట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. 'తెలుగుజాతి అంటే వీళ్లకు లెక్కలేని తనం. సోనియాను హెచ్చరిస్తున్నా. మీ అత్త ఇందిరాగాంధీ.. ఎన్‌టీఆర్‌ను బర్తరఫ్ చేస్తే తెలుగుజాతి ఆమె మెడలు వంచి మళ్లీ అధికారం కట్టబెట్టింది. మీ ఓట్లు, సీట్ల కోసం చిచ్చు పెడతారా?' అని ధ్వజమెత్తారు. సీఎంపైనా చంద్రబాబు నిప్పులు చెరిగారు.

'కిరణ్ చేతకాని దద్దమ్మ. ఫోజులు కొడుతుంటారు. ఢిల్లీకి వెళ్లి లీకులు చేశాడు. ఇంకో పక్కన తెలంగాణ ఇచ్చేస్తున్నామని వరంగల్ జిల్లా నేతలను వెంట తీసుకెళ్లి పార్టీలో చేర్పించారు. ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ఈ నాటకం. ప్రజలే మీ చెవిలో పువ్వులు పెట్టే రోజు దగ్గరలోనే ఉంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ ఉత్సవ విగ్రహంలా సైజుకు తప్ప ఏమీ చేయలేని వ్యక్తి అని మండిపడ్డారు.

కాగా, పంట రుణాలు చెల్లించమంటూ బ్యాంకు అధికారులు చేస్తున్న ఒత్తిళ్లపై చంద్రబాబు మండిపడ్డారు. తాను అ«ధికారంలోకి వస్తే పంటరుణాలు రద్దు చేస్తానని ప్రకటించారు. 'యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టమని నాపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ రోజున నేను తెలుగుజాతి అభివృద్ధిపైనే ఆలోచించాను. అందుకే ఆ రోజు సున్నితంగా తిరస్కరించాన'ని చంద్రబాబు తెలిపారు.


ఐదో రోజు ఆత్మగౌరవ యాత్రలో భాగంగా పలుచోట్ల ఎన్‌టీఆర్ విగ్రహాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. యాత్ర పొడవునా ప్రజలు వేలాదిగా హాజరై ఆయనకు ఘనస్వాగతం పలికారు. నిడుముక్కల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే రైతులకు రుణమాఫీ చేసి తీరుతుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వ్యవసాయం కోసం బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపిస్తామన్నారు. 'చేతకాని ప్రధాని.. బంగారం కొనొద్దంటున్నారు. పెట్రోలు బంకులు రాత్రి వేళ మూసేస్తామంటున్నారు. ఇదో తుగ్లక్ పరిపాలన' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొన్నెకల్లులో చంద్రబాబు కాన్వాయ్ ప్రధాన మార్గంలో ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్థులు పట్టుబట్టి తమ వీధుల్లో నుంచి తీసుకెళ్లారు. కాగా, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మోతడకలోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొల్గొని విద్యార్థులతో చంద్రబాబు తన అనుభవాలను పంచుకున్నారు. సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌కు అంతర్జాతీయం గుర్తింపు తీసుకురావడానికి పడిన శ్రమను వివరించారు. తన కళ్లముందే హైదరాబాద్‌ను నాశనం చేసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. విజన్ 2020 ప్రారంభించానని, దాన్ని కాంగ్రెస్ దొంగలు నేడు విజన్ 420గా మార్చారన్నారు.



యాత్రలో ఇంజనీరింగ్ విద్యార్థులతో భేటీ సందర్భంగా హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణంలో తన కృషిని వివరించారు. "హైటెక్ సిటీ నిర్మాణం కోసం దేశంలోని నిపుణులందరినీ పిలిపించాను. చివరకు ఎల్అండ్‌టీ సంస్థతో 15 నెలలకు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం చేశాం. నాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అడిగితే తొలుత నిరాకరించారు. చివరకు రెండు నిమిషాల అపాయింట్‌మెంట్ తీసుకొన్నా. చక్కని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి అందులో విజన్ ఐటీ, భారత శక్తి సామర్థ్యాలు, బిల్‌గేట్స్ నుంచి ఏం ఆశిస్తున్నది మొత్తం వివరించాను.
రెండు నిమిషాలన్న బిల్‌గేట్స్ ఏకంగా 45 నిమిషాల పాటు ఆ ప్రదర్శన చూసి శభాష్ అని మెచ్చుకున్నారు.

అమెరికా తర్వాత హైటెక్ సిటీలోనే మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటుకావడంతో మిగతా కంపెనీలన్నీ తరలి వచ్చాయి. ఇందుకోసం న్యూయార్కులో 18 రోజులుండి ఫైళ్లు మోసుకుంటూ తిరిగాను. హైదరాబాద్ ఎందుకు రావాలి, ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెబుతూ ఒక విధంగా మార్కెటింగ్ చేశాను. అంత శ్రమ వల్లే నేడు హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారింది. ఒక ఐటీ జాబ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఇతర రంగాల్లో ఐదు ఉద్యోగాలు వస్తున్నాయి.

ఐఎస్‌బీని ముంబై, బెంగళూరు, చెన్నైలో పెట్టాలని ఆలోచన చేస్తే.. దేశంలోని పారిశ్రామికవేత్తలను నా ఇంటికి తీసుకెళ్లి వాళ్లకు టిఫిన్లు వడ్డించి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఒప్పించానని చంద్రబాబు చెప్పారు. ఫార్ములా-1 తీసుకొద్దామని ఆలోచిస్తే విమర్శించారు. అది ఢిల్లీకి వెళ్లడంతో అక్కడ గణనీయమైన అభివృద్ధి జరుగుతోంది. ఈ రోజు హైదరాబాద్ రావాలంటే.. అక్కడ రూ. లక్ష కోట్ల అవినీతి జరిగింది. మనకేం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. ఒక కుటుంబం వల్ల తెలుగుజాతికి తలవంపులు వచ్చాయి'' అని బాబు వివరించారు.



తాడికొండ మండలం గరికపాడులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డు తగిలారు. దీంతో చంద్రబాబు కన్నెర్ర చేశారు. 'మీరంతా జైలులో ఉండాల్సిన వాళ్లు. పిచ్చి వేషాలు వేస్తే మీ తాట తీస్తా. ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలి. మీ పులివెందులకే వస్తా. అక్కడే మీ సంగతి తేలుస్తా' అని మండిపడ్డారు. దీంతో వైసీపీ కార్యకర్త చంద్రబాబు పైకి చెప్పు విసిరాడు. అయితే అది బాబుకు కొద్దిదూరంలో పడింది. దీంతో వైసీపీ వారి వైపు దూసుకెళ్లబోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు వారించారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకోనందుకు పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment