హస్తిన బాటలో ఎత్తులు పొత్తులు! (కొత్త పలుకు!) - ఆర్కే
September 15, 2013
రాష్ట్ర విభజన జరిగితే తమ జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని తెలంగాణ ప్రజలు నమ్ముతుండగా, విభజన వల్ల తమ జీవితాల్లో చీకట్లు ముసురుకుంటాయని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉభయ ప్రాంతాల ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా విభజన వల్ల లాభం ఎంత, నష్టం ఎంత అని రాజకీయ పార్టీలు, వాటి నాయకులు బేరీజు వేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ రాజకీయ లాభనష్టాల లెక్కలు తేలక కొన్ని పార్టీలు అయోమయంలో ఉండగా, మరికొన్ని పార్టీలు తమ పూర్వ వైఖరిని మార్చుకుంటున్నాయి. మొత్తంమీద రాష్ట్ర విభజన వల్ల ప్రజల జీవితాలలో మార్పు వస్తుందో లేదో తెలియదు గానీ, రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులలో ముఖ్యమైనది తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ మధ్య చిగురించబోతున్న స్నేహం కాగా, కాంగ్రెస్- జగన్ పార్టీల మధ్య కుదిరిన పరోక్ష అవగాహన రెండవది. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉభయ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయవచ్చునని అంచనా వేసిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు, తెలుగుదేశం- బి.జె.పి.ల మధ్య మొగ్గ తొడగనున్న స్నేహం గురించి అంచనా వేయలేకపోయారు. రాష్ట్రంలో తనను రాజకీయంగా దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానంపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్న చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి స్నేహ హస్తం చాచారు. అప్పటికే తెలుగుదేశం పార్టీని మంచి చేసుకోవడానికై రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా బి.జె.పి. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లారు. ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య స్నేహం వికసిస్తుందా? అలా జరిగితే దానికి ప్రాతిపదిక ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
గతంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాలంలో బి.జె.పి.కి దూరం అయింది. గుజరాత్ అల్లర్లను తీవ్రంగా ఖండించడంతో పాటు నరేంద్ర మోదీని నిందించడం కూడా జరిగింది. అయితే, రాజకీయాలు ఇవ్వాళ ఉన్నట్టు రేపు ఉండవు. అలాగే రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీలు ఇప్పుడు ఈ సూత్రాన్నే అనుసరించబోతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య స్నేహానికి కాంగ్రెస్‌పై వ్యతిరేకతే ప్రాతిపదికగా మారబోతున్నది. వాస్తవానికి బి.జె.పి.తో జత కట్టాలన్న ఆలోచన రాష్ట్ర విభజన ప్రకటన ముందు వరకు తెలుగుదేశం పార్టీకి లేదు. 2014 ఎన్నికల తర్వాత సెక్యులరిజం ప్రాతిపదికన అవసరాన్ని బట్టి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు బయటి నుంచి మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ సంకేతాలు కూడా పంపింది. అయినా తెలుగుదేశం పార్టీ అందించిన స్నేహ హస్తాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, విభజనానంతరం రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల్లో లాభపడాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకుంది. ఈ అవగాహన మేరకు ప్రస్తుతం జైలులో ఉన్న జగన్‌కు బెయిల్ లభించేలా సి.బి.ఐ. సహకరించవలసి ఉంటుంది. ఇందుకు ప్రత్యుపకారంగా 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. ఈ అవగాహనను సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ముఖ్యులు ముందు కొట్టిపారేశారు. అయితే కడచిన కొన్ని రోజులుగా అధిష్ఠానం పెద్దల మాటలు, వైఖరిని గమనించిన తర్వాత జగన్‌తో తమ పార్టీ అవగాహన కుదుర్చుకుందని వారూ నమ్ముతున్నారు.
"మీరు చెప్పినట్టు ఎన్నికల అనంతరం జగన్ మనకు కచ్చితంగా మద్దతు ఇస్తారా? అనుమానించవలసింది ఏమీ లేదు కదా?'' అని కోటరీ ముఖ్యులను సోనియాగాంధీ అడిగిన విషయం తమకు తెలిసిందనీ, దీంతో జగన్‌తో అవగాహన కుదర్చుకున్న విషయం తెలిసిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యుడు పేర్కొన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చెబుతున్నదాని ప్రకారం కాంగ్రెస్- జగన్ పార్టీల మధ్య అవగాహన పూర్తి స్థాయిలో ఏర్పడిందని స్పష్టం అవుతోంది. సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ జగన్ విషయంలో ఇటీవలి వరకు ఆగ్రహంగా ఉన్నారు. అయితే సీమాంధ్రలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు లభించే అవకాశం ఉందని సమాచారం అందడంతో పాటు జగన్‌కు మద్దతు ఇస్తున్నవారిలో అత్యధికులు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నందున వారి మనోభావాలకు విరుద్ధంగా ఎన్నికల అనంతరం జగన్ బి.జె.పి.కి మద్దతు ఇవ్వలేరని అధిష్ఠానం ముఖ్యులు సోనియాకు వివరించారు. దీంతో ఉభయ పార్టీల మధ్య డీల్ కుదిరిందని కేంద్ర మంత్రి ఒకరు వివరించారు. విభజన ప్రకటన వెలువడి ఉండకపోతే ఈ డీల్ కుదిరి ఉండేది కాదు. విభజన ప్రకటన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడటంతో జగన్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. మరోవైపు జగన్‌కు బెయిల్ లభించాలంటే కాంగ్రెస్ పార్టీని మంచి చేసుకోక తప్పని స్థితి. ప్రస్తుత పరిస్థితులలో దర్యాప్తు సంస్థలు సహకరించని పక్షంలో ఆర్థిక నేరాల కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానాలు సుముఖంగా లేవు.
పంచాయతీ ఎన్నికల అనంతరం తమ పార్టీ గ్రాఫ్ పడిపోవడం గుర్తించిన జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో తాను జైలులోనే ఉంటే 2014 ఎన్నికలలో విజయావకాశాలు దెబ్బతింటాయన్న అభిప్రాయానికి వచ్చి కాంగ్రెస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అంగీకరించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రాంతంలో సొంతంగానే అధిక స్థానాలు గెలుచుకోగలమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం, ఇప్పుడు జగన్‌తో కుదుర్చుకున్న డీల్‌తో ఆయనకు లభించబోయే సీట్లు కూడా తమ ఖాతాలోకే వస్తాయని అంచనా వేస్తోంది. మొత్తంమీద రాష్ట్రం నుంచి 25 నుంచి 30 మంది ఎంపీల మద్దతు పొందగలిగితే 2014 తర్వాత కూడా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావచ్చునని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తోంది. 2014 తర్వాత కేంద్రంలో యు.పి.ఎ. మళ్లీ అధికారంలోకి రావాలన్నా, నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా రాష్ట్రానికి చెందిన ఎంపీలే కీలకం కాబోతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర రాజకీయాలలో ఉత్తర దక్షిణ «ద్రువాలను ఏకం చేయబోతున్నది.
కాంగ్రెస్- వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్ కుదిరిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. మతతత్వం పేరిట ఇంత వరకు దూరంగా పెట్టిన నరేంద్ర మోదీతో మాటామంతీ ప్రారంభించారు. రూపాయి విలువ పడిపోవడం, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరిగిపోవడం వంటి అంశాలను ఆసరా చేసుకుని జాతీయ స్థాయి రాజకీయాలలో సరికొత్త కలయికలకు నాంది పలకాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో 'అభివృద్ధి' నినాదాన్ని అందిపుచ్చుకోవాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆర్థిక రంగం తీరు పట్ల జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలతో పాటు ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా మలచుకుని 'మతతత్వం' అన్నదానికి అతీతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసిన అవసరాన్ని వివరించడం ద్వారా బి.జె.పి.తో తమ స్నేహానికి ఆమోదం పొందాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. రాజకీయాలలో కొన్ని దారులను ఎప్పుడూ తెరిచే ఉంచుకుంటారు. అయితే చంద్రబాబు అప్పుడప్పుడు అన్ని దారులనూ తానే మూసివేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా అలాగే వ్యవహరించారు. జీవితంలో ఇక ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనని ప్రకటనలు చేశారు. మతతత్వానికి వ్యతిరేకంగా నిలకడగా పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలు సైతం ఒక దశలో కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో బి.జె.పి.తో కలిసి నడిచాయి. ఇది చరిత్ర! బి.జె.పి. ప్రధాని అభ్యర్థిగా ప్రకటితుడైన నరేంద్ర మోదీ పట్ల ఉత్తరాది ప్రజలలో ఎంతో కొంత వ్యామోహం ఉంది. దక్షిణాదిన కూడా యువతలోనూ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలలోనూ సానుకూలత ఉంది. అయితే తాను ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి ఇది సరిపోదని గుర్తించిన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించారు.
కేరళలో తాము చేయగలిగింది ఏమీ లేదు. తమిళనాడులో అన్నా డి.ఎం.కె. అధినాయకురాలు జయలలిత మద్దతు ఎలాగూ లభిస్తుంది. కర్ణాటకలో యడ్యూరప్పను మళ్లీ పార్టీలోకి తీసుకుంటే అక్కడ ఎన్నో కొన్ని సీట్లు సాధించవచ్చునని అంచనాకు వచ్చిన మోదీ, మన రాష్ట్రంలో తెలుగుదేశంపై వలపు వల విసిరారు. ప్రస్తుత పరిణామాలు ఉభయకుశలోపరిగా ఉన్నాయని భావించిన తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే బి.జె.పి.కి చెందిన రాష్ట్ర నాయకులకు మాత్రం ఈ పరిణామం మింగుడు పడటం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల తాము సొంతంగా ఎదగలేమన్నది వారి అభిప్రాయం. అయితే నరేంద్ర మోదీ ఆలోచన మరోలా ఉంది. తెలుగుదేశంతో పొత్తు లేకుండా వెళితే రాష్ట్రంలో ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా బి.జె.పి. గెలుచుకోలేదని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించినా తెలంగాణలో కూడా తమకు రాజకీయంగా ప్రయోజనం ఏమీ చేకూరే పరిస్థితి లేదని మోదీ గుర్తించారు. చిన్న రాష్ట్రాల నినాదంతో తాము గతంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయంగా లబ్ధి పొందామని, తెలంగాణ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని బి.జె.పి. జాతీయ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనను కలిసిన ఏపీఎన్‌జీవో నాయకుల వద్ద లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తెలంగాణకు మేం అనుకూలమైనప్పటికీ ఎవరో పెళ్లి చేసుకుంటూ ఉంటే మేం భజంత్రీలు ఎందుకు మోగించాలని ఆమె వ్యాఖ్యానించారట! అంటే తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీ లాభపడుతున్నప్పుడు పార్లమెంట్‌లో తామెందుకు సహకరించాలన్నది ఆమె అభిప్రాయం కావచ్చు. అదే నిజమైతే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు బి.జె.పి. ఏదో ఒక మెలిక పెట్టే ప్రమాదం లేకపోలేదు.
దీనికితోడు తెలుగుదేశం పార్టీతో ఏర్పడబోయే స్నేహం కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు తెచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిహేను మంది ఎంపీల మద్దతు అవసరమని, అందుకు తెలుగుదేశం సహకారం అవసరమని నరేంద్ర మోదీ అంచనా వేస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డితో జత కట్టి రాజకీయంగా తనను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాలు దువ్వుతున్న చంద్రబాబు నాయుడు కూడా అడిగిందే తడవుగా మోదీతో చేతులు కలపడానికి ప్రాథమికంగా అంగీకరించినట్టు తెలిసింది. తామిద్దరి కాంబినేషన్‌లో అభివృద్ధి నమూనాతో ఎన్నికలకు వెళితే విజయం తథ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో అభివృద్ధి నినాదం ముందు మతతత్వం నిలబడదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే నరేంద్ర మోదీతో వెంటనే చేతులు కలపడం ద్వారా ఇతర ఆప్షన్లను క్లోజ్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలిసి వచ్చేవాళ్లు ఎంత మంది? 2014 ఎన్నికల అనంతరం వారి బలం ఎంత ఉండబోతోంది? థర్డ్ ఫ్రంట్‌కు అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతు అవసరమవుతుందా? బి.జె.పి. మద్దతు అవసరమవుతుందా? 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు ముందుకు రాకపోతే పరిస్థితి ఏమిటి? మొదలైన అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే బి.జె.పి.తో స్నేహం విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దాలంటే తనవల్లే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారనీ, ఆ కారణంగానే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తాను లేఖ ఇచ్చినా గుంటూరు, కృష్ణా జిల్లాల పర్యటనలో ప్రజల నుంచి అభ్యంతరాలు రాలేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. విభజన సమస్య పరిష్కారం కావాలన్నా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నా చంద్రబాబుకే సాధ్యం అని ప్రజలు భావించడం వల్లనే ఆత్మగౌరవ యాత్ర తమ అంచనాలకు మించి విజయవంతం అయ్యిందని తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవ యాత్రకు విరామం ప్రకటించి తిరిగి వచ్చిన చంద్రబాబు స్వరంలో మార్పు వచ్చింది. "ఇంతకాలం నన్ను అనవసరంగా భయపెట్టారు. ఇక చాలు. ఇకపై నేను చెప్పినట్టు మీరు వినండి. ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి జరిగింది చెబితే మనల్ని ఆదరించడానికి ఉభయ ప్రాంతాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పిరికితనం వదలండి'' అని పార్టీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఒకింత కరకుగా మాట్లాడారు. ఆత్మగౌరవ యాత్రకు లభించిన ఆదరణ ఆయనలో ఈ మార్పునకు కారణం కావచ్చు. రాష్ట్ర ప్రజలు కూడా విభజనకు అతీతంగా కొన్ని విషయాలలో భావ సారూప్యత ప్రదర్శిస్తున్నారు. విభజన ప్రకటన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పని ఎలాగూ అయిపోయింది కనుక అక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు మాత్రమే! అంటే చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డిల మధ్య ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితిలో సీమాంధ్ర ప్రజలున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్న సీమాంధ్ర ప్రజలకు ఆ విషయంలో నేరుగా హామీ ఇవ్వకుండా, "మీ సమస్యల పరిష్కారానికి నేను పోరాడతాను. మీకు అండగా ఉంటాను'' అని చెప్పడం ద్వారా తెలంగాణలో కూడా ఇబ్బంది తలెత్తకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది కనుక పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ అనిశ్చితే! హైదరాబాద్ విషయం తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ర్రాష్టాన్ని విభజించే పరిస్థితి లేదు. హైదరాబాద్‌పై సీమాంధ్రులకు కూడా హక్కులు కల్పిస్తే తెలంగాణవాదులు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తే బి.జె.పి. సహకారం లభించకపోవచ్చు. ర్రాష్టాన్ని విభజించమంటే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను విభజించింది అని బి.జె.పి. అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. 2014లోపు రాష్ట్ర విభజన జరగని పక్షంలో సమైక్య రాష్ట్రంలో తమ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది.
విభజన ద్వారా తెలంగాణలో లాభపడాలని కాంగ్రెస్ భావిస్తున్నప్పుడు, విభజనకు ఏదో ఒక విధంగా అడ్డుపుల్ల వేయడం ద్వారా సీమాంధ్రలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని లాభపడాలనుకోవడంలో తప్పు ఏమిటి? అని భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక జాతీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించారు. వాస్తవానికి సమైక్య నినాదం అందిపుచ్చుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌కు రాష్ట్రం విడిపోవాలన్నది మనస్సులోని కోరిక కాగా, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటోంది. మొత్తంమీద ఈ రాజకీయ ప్రయోజనాల వేటలో రాష్ట్ర విభజన అంశం ఏ మలుపు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేని స్థితి. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నది. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో పది రోజులకు పైగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోలేకపోయారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగితే టి.ఆర్.ఎస్.ను తమ పార్టీలో విలీనం చేయకతప్పని పరిస్థితి కె.సి.ఆర్.కు ఏర్పడుతుందనీ, అలా కాకుండా ఆయన విడిగా పోటీచేస్తే ఉభయ పక్షాలు నష్టపోతాయని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ర్రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమం చేస్తున్న సీమాంధ్రులు తనను టార్గెట్ చేస్తూ నిరసనలు వ్యక్తంచేయడం తెలంగాణ ప్రాంతంలో తన పట్ల సానుభూతి ఏర్పడుతోందనీ, అది తనకు లాభించే అంశమని కె.సి.ఆర్. భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారకులని సీమాంధ్రులు రోజూ నిందించడాన్ని చూస్తున్న తెలంగాణ ప్రజలలో తనపట్ల ఆదరణ పెరుగుతోందనీ, ఈ పరిస్థితులలో తొందరపడి కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల ఉపయోగం లేదన్నది కె.సి.ఆర్. అభిప్రాయంగా ఉంది. అనుకోని పరిస్థితులలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా నష్టపోతుంది. సీమాంధ్రలో ఎలాగూ కోలుకోలేదు. అదే జరిగితే కాంగ్రెస్ అధిష్ఠానం అంచనాలు తల్లకిందులు అవుతాయి. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపితే సీమాంధ్రలో జగన్ ప్రభావాన్ని అధిగమించి తామే అధిక స్థానాలు గెలుచుకుంటామని తెలుగుదేశం నాయకులు లెక్కలు వేస్తున్నారు. నరేంద్ర మోదీ-చంద్రబాబు కాంబినేషన్ రాష్ట్రంలో మ్యాజిక్ సృష్టిస్తుందా? లేదా? అన్నది తేలాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే! రాష్ట్ర విభజన విషయంలో చోటుచేసుకోబోయే పరిణామాలను బట్టి రాష్ట్రంలో ఆయా పార్టీల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అంతవరకూ ఎవరి అంచనాలు వారికి ఉంటాయి.
ఈ విషయం అలా ఉంచితే, బి.జె.పి. ప్రధాని అభ్యర్థిగా శుక్రవారంనాడు నరేంద్ర మోదీని ఎంపిక చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ వ్యవహరించిన తీరు రాజకీయ పరిశీలకుల దృష్టిలో ఆయనను అభాసుపాలు చేసింది. అంతేకాదు ఆ పార్టీలో ఆడ్వాణీ ఏకాకిగా మారారు. జీవిత చరమాంకంలో మంకుపట్టుకు పోవడం ద్వారా ఆడ్వాణీ తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకున్నారు. రాజకీయాలలో ఎత్తుపల్లాలు సహజం. ఒకప్పుడు బి.జె.పి.కి ఆడ్వాణీనే జీవనాధారం. బి.జె.పి. ఇవ్వాళ ఈ స్థితిలో ఉండటానికి ఆడ్వాణీ చేసిన కృషి, పడిన శ్రమ విస్మరించలేనిది. ఎన్.డి.ఎ. అధికారంలోకి వచ్చినప్పుడు ఉదారవాదిగా పేరున్న అటల్ బిహారీ వాజపేయి ముందు ఆడ్వాణీ నిలబడలేకపోయారు. ద్వితీయ స్థానంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. గత ఎన్నికలలో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినా ఎన్.డి.ఎ. అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు నరేంద్ర మోదీతో పోల్చితే తాను ఉదారవాదినని అనిపించుకోవడానికి ఆడ్వాణీ ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల అనంతరం ఏ కారణం వల్లనైనా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి ఇతర పార్టీలు అంగీకరించని పక్షంలో మధ్యేమార్గంగా తాను ప్రధానమంత్రి కావచ్చునన్నది ఆడ్వాణీ ఆలోచన కావచ్చు గానీ, ఇప్పుడు మోదీ ఎన్నిక సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఆయనలోని ఉక్రోషాన్ని మాత్రమే బయటపెట్టింది. ఒకప్పుడు తనను లోహ పురుష్‌గా అభివర్ణించి తన చుట్టూ తిరిగినవాళ్లే ఇప్పుడు తనను కాదని నరేంద్ర మోదీ వెనుక ఎందుకు పడుతున్నారో గుర్తించి నలుగురితో నారాయణ అని ఉంటే, ఆడ్వాణీకి గౌరవం అయినా మిగిలి ఉండేది. ప్రస్తుత చర్యల వల్ల తాను ఆశించిన ప్రధానమంత్రి అభ్యర్థిత్వం దక్కకపోగా పరువు కూడా పోయింది.
బి.జె.పి.లో ఆర్.ఎస్.ఎస్. ఆధిపత్యం అధికంగా ఉంటుందన్న విషయం మనకంటే ఆడ్వాణీకే ఎక్కువ తెలుసు. అయినా ఆయన ఈ వయస్సులో ఎందుకిలా చేశారని బి.జె.పి. శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. రాజకీయాలలో ఒక్కొక్కరికి కొంత దశ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉచ్ఛ దశలోనే ఉండాలని రాజకీయ నాయకులందరూ కోరుకుంటారు గానీ, ప్రకృతి అందుకు సహకరించదు. పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నప్పుడు గౌరవంగా తప్పుకోవడం లేదా కొంతకాలం మౌనంగా ఉండటం విజ్ఞుల లక్షణం. జీవిత చరమాంకంలో ఆడ్వాణీకి ఆ విజ్ఞత లోపించడం విచారకరం. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా ఇవ్వాళ జాతీయ నాయకులలో నరేంద్ర మోదీ గ్లామర్ ఉన్న ఏకైక నాయకుడు. మతతత్వవాది, అహంభావి, నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తి అని ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల దృష్టిలో ఆయనే ప్రస్తుతం బలమైన నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న రాహుల్‌గాంధీ ఆయన ముందు తేలిపోతున్నారు. ప్రజలలో, ముఖ్యంగా యువతలో వచ్చిన మార్పు ఇందుకు కారణం. నిక్కచ్చిగా, మొండిగా వ్యవహరించే నాయకులనే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ పరిణామం మంచికా, చెడుకా అన్నది కాలమే నిర్ణయిస్తుంది!
No comments:
Post a Comment