మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి చర్యలు వేగవంతం Updated :07-09-2015 10:45:13 |
విజయవాడ, సెప్టెంబర్ 7 : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూసేకరణకు అవసరమైన నోటిఫికేషన్ వెలువడటంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పోర్టు నిర్మాణంతో పాటు ఆధారిత పరిశ్రమలకు భూకేటాయింపులు జరుగనున్నాయి. ఇందుకోసం దాదాపు 30వేల ఎకరాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. అయితే భూములు ఇచ్చే విషయంలో రైతులు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు.
పోర్టు నిర్మాణంతోనే జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు జిల్లా అభివృద్ధి ముడిపడి ఉంది. అంతేకాకుండా రెండు తెలుగురాష్ట్రాలకు అతిసమీపంలో ఉన్న పోర్టు ఇదే అవుతుంది. శాతవాహనుల కాలం నుంచి అభివృద్ధిలో ఉన్న ఈ పోర్టు 1970వ దశకం నుంచి తిరోగమనంలో పయనించడం మొదలుపెట్టింది. క్రమేణా మూతపడిపోగా నిర్మాణం పనులు తిరిగి ప్రారంభించేందుకు నామమాత్రపు ప్రయత్నాలు జరిగాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు భూసేకరణ మాత్రం మొదలుకాలేదు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోర్టు నిర్మాణంతో పాటు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీయల్ కారిడార్‌కు అవసరమైన భూకేటాయింపులకు అనుమతి ఇవ్వడంతో ఆగమేఘాల మీద అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. బందర్ పోర్టు నిర్మాణంతో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోర్టు నిర్మాణానికి దాదాపు 5200 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. వీటిలో 4800 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగ కంపెనీకి అప్పగించాల్సి ఉంది. వీటితో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు.
బందరు తీరంలో రూ.50వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 6వేల నుంచి 8వేల ఎకరాల భూములు కేటాయించాల్సి ఉంది. పెదపట్నంలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు భూములు సమకూర్చాల్సి ఉంది. అలాగే పవర్ ప్లాంటులు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సుమారు 30వేల ఎకరాల భూములు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో ప్రభుత్వ భూమి 15వేల ఎకరాలు ఉండగా, ప్రైవేటు భూములు 14,427 ఎకరాలు ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి నోటిఫికేషన్ విడుదలపై ఒకపక్క హర్షం వ్యక్తమవుతూ ఉండగా భూముల విషయంలో రైతుల్లో మాత్రం సందిగ్ధ స్థితి కనిపిస్తోంది.
అధికారులు ప్రజాప్రతినిధులు నచ్చజెప్పినా సమస్య ఇంకా ఓ కొలక్కి రాలేదు. ఈ నేపథ్యంలో 30వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తుళ్లూరు తరహాలో భూసమీకరణ జరుగుతుందని భావించగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంపై రైతులకు నష్టపరిహారం ఏ విధంగా అందుతుందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తమకు ఏ విధంగా న్యాయం చేస్తుందో స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లడం లేదని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు.
భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం రైతులు ఆయా గ్రామాల ప్రజలతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పోర్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అయితే అనేక వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయిన పోర్టు నిర్మాణ పనులు ఈసారైనా వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
|
No comments:
Post a Comment