Tuesday, 8 September 2015

తుంగభద్ర నీటి నష్ట నివారణపై దృష్టేది

తుంగభద్ర నీటి నష్ట నివారణపై దృష్టేది
Updated :08-09-2015 13:23:51
 తుంగభద్ర.. పేరయితే భద్రంగా ఉంది.. కానీ నీరు మాత్రం అడుగంటిపోతోంది. పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. ఫలితంగా కేటాయింపులున్నా వాడుకునే వెసులుబాటు లేకుండాపోతోంది. హెచ్చెల్సీ, పీఏబీఆర్‌కు కేటాయించిన 42.5 టీఎంసీల్లో ప్రస్తుతం కేవలం 28 టీఎంసీలకు మించి రావడం లేదు. వర్షాభావం కారణంగా ఈ ఏడాది 20 టీఎంసీలు కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో సాగు విస్తీర్ణం 2.89లక్షల ఎకరాల నుంచి 90వేల ఎకరాలకు పడిపోయింది. మరి దీన్ని ఇలాగే వదిలేద్దామా? ప్రత్యామ్నాయం గురించి ఏమాత్రం ఆలోచించమా? అయిన దానికీ, కాని దానికీ మన నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూంటారు. అవసరం వచ్చినప్పుడైనా ఒకే తాటిపైకి వచ్చి హక్కులను సాధించుకునే ప్రయత్నం చేయరు. సుంకేసుల రిజర్వాయర్‌ సమీపంలో లిఫ్ట్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నష్టం పూడ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ అన్న గురజాడ వాక్కును పుణికి పుచ్చుకుని మన నేతలు పార్టీలకతీతంగా సమైక్యంగా పోరాడితే తప్ప సమస్యకు పరిష్కారం లభించదు.
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, అనంతపురం)
వర్షపాతం తగ్గిపోయింది. నీటివనరులు ఎండిపోయాయి. భూగర్భజలం అడుగంటింది. భవిష్యత్తు అవసరాలకు ఉపరితల నీరే శరణ్యమవుతోంది. నీటి పంపకాల వివాదం ఇదివరలో రాష్ట్రాల మధ్యే నలిగింది. ఇప్పుడు జిల్లాలకు, అటు నుంచి నియోజకవర్గాలు, మండలా లు, గ్రామాలకు విస్తరిస్తోంది. కింది ప్రాంతాలకు నీరిచ్చే విషయంలో ఎవరికి వారు పట్టుపడుతున్నారు. పైప్రాంతాల ఆధిపత్యం,అక్రమాలకు కళ్లెం వేయడం కింది వారికి పెద్ద సవాల్‌ గా మారింది. ప్రభుత్వాలు, ట్రిబ్యునల్‌ కల్పించుకుని సర్దిచెప్పినా... ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. విస్తీర్ణరీత్యా రాష్ట్రం లోనే పెద్దదైన అనంతపురం జిల్లాకు నీటికేటాయింపుల్లో తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఏలికల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అవగాహనా లోపం భావితరాలకు శా పాలవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముంది. మిగు లు జలాలను నికర జలాలుగా మార్చి రాష్ట్రాల కు పంచిపెట్టడంలో ట్రిబ్యునల్‌ ఏ వ్యూహాన్ని పాటిస్తుందో చెప్పడం కష్టం. అందులో జిల్లాకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో ఊహించడం అంతకంటే కష్టం. భవిష్యత్తు కేటాయింపులను కాసేపు పక్కనపెడితే... జిల్లాకిచ్చిన నికరజలాలు పూర్తి స్థాయిలో పొందలేకపోతుండడం ఆందోళన కలిగించే అంశం.
తుంగభద్ర ఏటా పొంగి పొర్లుతోంది. వరద సమయంలో ఏటా వందల టీఎంసీలు వృథాగా నదిలో కలిసిపోతున్నాయి. అయితే... తుంగభద్ర కుడి ఎగువ కాలువ ద్వారా అందా ల్సిన నీటివాటా మాత్రం పూర్తిగా పొందడంలేదు. హెచ్చెల్సీ వాటాలో పది, పీఏబీఆర్‌ కేటాయింపుల్లో 4 టీఎంసీలు చొప్పున కోల్పోవాల్సి వస్తోంది. ఈ నీటిని వాడుకునే హక్కూ ఉంది. నదిలో నీరూ ఉంది. డ్యాంలో పూడిక వల్ల నిల్వ సామఽర్థ్యం పడిపోవడంతో వాడుకోలేని పరిస్థితి తలెత్తింది. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ, పీఏబీఆర్‌కు కేటాయించిన 42.5 టీఎంసీల్లో ప్ర స్తుతం 27, 28 టీఎంసీలే వస్తున్నాయి. వర్షాభావం నేపథ్యంలో ఈ ఏడాది 20 టీఎంసీలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. భారీ కోత వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. 2.89 లక్షల ఎకరాల్లో కేవలం 90 వేల ఎకరాలేసాగవుతోంది. మరోవైపు తాగునీటి కొరతా వెంటాడుతోంది. సుమారు 8.5 టీ ఎంసీలు ఇందులో నుంచే తాగేందుకు వాడుకోవాల్సి వస్తోంది.
నీటి కోటాలో కోత ఓ శాపమని సరిపెట్టుకుంటూ వెళుతున్నాం. దీంతో ఈ సమస్య మరింత జటిలమవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాన్వేషణలో ఏలికలకు చిత్తశుద్ధి కొరవడింది. దీన్ని పాలకులే సీరియస్‌గా తీసుకోవటడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇదే పరిస్థితి తుంగభద్ర ప్రవహించే కర్నూలు జిల్లాలోనూ ఉంది. వారు మనకంటే ఉన్నతంగా ఆలోచించారు. అన్ని పార్టీలు సంఘటితమయ్యాయి. జిల్లా అవసరాలను ముక్తకంఠంతో ప్రభుత్వం ముందుంచాయి. సమష్టి ఒత్తిడితోప్రభుత్వంలో చలనం తెప్పించారు. మంత్రాలయం సమీపంలో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసుకునేవరకు పట్టు సడలించలేదు. తుంగభద్రలో పూడికవల్ల నష్టపోతున్న నీటిని పొందేమార్గాన్ని సుగమం చేసుకున్నారు. అలాంటి సమష్టి కృషి జిల్లా నేతల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎంతసేపూ ప్రత్యర్థి పార్టీని తిట్టిపోయడానికే నేతలు పరిమితమవుతున్నారు. ఈ సమస్యపై గత ప్రభుత్వం ఏమీ చేయలేదు... తామేలా చేస్తామనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. వారెందుకు చేయలేదని వీరు, వీరెందుకు చేయలేదని వారు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారు చేయలేకపోయారు సరే.. అధికారంలో ఉన్నప్పుడు తామెందుకు చేయకూడదన్న విచక్షణ మచ్చుకైనా కనిపించకపోవడం శోచనీయం. ఇంకా చెప్పాలంటే... గత పాలకులను తిట్టిపోస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా అభివృద్ధిపై ఓ అవగాహన, నిర్దిష్ట ప్రణాళిక, అమలు వ్యూహం, సమష్టితత్వం కొరవడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ఎడారైపోతున్నా... లక్షల మంది వలసలు పోతున్నా... ఇంకా నిందలతో కాలం వెల్లదీస్తూ పోవడం దేనికి సంకేతమో నేతలే ఆలోచించాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే...! ఐరోపా దేశాల పరిస్థితే ఇక్కడా ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఉన్న ఏ చిన్న అవకాశాన్నైనా ఉపయోగించుకుని నీటిని తెచ్చుకునే మార్గాన్వేషణలో నేతలు పడితేనా ప్రయోజనకరం. మరి వారు ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం.

No comments:

Post a Comment