హోదా కంటే ప్యాకేజీతోనే అభివృద్ధి : హరిబాబు Updated :26-09-2015 01:32:16 |
విజయవాడ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి):‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే ప్యాకేజీ వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నా నమ్మకం. ప్రత్యేక హోదా అనేది ప్రజలకు సెంటిమెంట్‌గా మారిన విషయం నిజమే. అయితే విజ్ఞులైన ప్రజలు అన్నిటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకోగలరు.’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ‘హోదా.. ప్యాకేజీ.. ఈ రెండింటిలో దేనివల్ల రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో దానినే కేంద్రం ప్రకటిస్తుంది’ అని చెప్పారు. శుక్రవారం విజయవాడలో పార్టీ నేత జమ్ముల శ్యాంకిశోర్‌తో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను నీతి ఆయోగ్ తయారుచేసి కేంద్రానికి సమర్పించగానే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఊరుకుంటే.. సరిపెట్టుకోగలమా? రాష్ట్రానికి కావల్సింది నిధులు కానీ బిరుదులు కాదన్నారు. ఈ ఒక్క ఏడాదిలో ఏపీకి కేంద్రం ఇచ్చినన్ని సంస్థలు ఇంకెక్కడా రాలేదని చెప్పారు. ఇంకా అనేక సంస్థలు రానున్నాయని, స్థలాల కేటాయింపు సమస్య వల్ల కొన్ని సంస్థలు ఇంకా ఏర్పాటు కాలేదన్నారు. మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు శంకుస్థాపన జరుగుతుందని, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటవుతుందని చెప్పారు. పట్టిసీమ స్పూర్తితో పోలవరం కూడా పూర్తి చేయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌లో మనకు హక్కు ఉందనుకోవడమే తప్పు.. దీనివల్ల సమయం వృథా తప్ప ఇంకేమీ లేదన్నారు.
|
No comments:
Post a Comment