నాలుగేళ్ల తర్వాత జరిగే ఆత్మహత్యలకే మా బాధ్యత Updated :21-09-2015 01:38:47 |
ప్రస్తుత మరణాలకు గత ప్రభుత్వాలే కారణం: లక్ష్మారెడ్డి
అచ్చంపేట, సెప్టెంబరు 20: ‘‘తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణం. నాలుగేళ్ల తర్వాత అంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన పూర్తయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకొంటేనే అప్పుడు మేము బాధ్యత వహిస్తాం’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.6 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రస్తుతం తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రతి విషయంపైనా రాజకీయ కోణంలో ఆలోచిస్తూ డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం, అచ్చంపేటలో 100 పడకల ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ బంగారు తెలంగాణ దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడం లేదన్నారు. |
No comments:
Post a Comment