Thursday, 10 September 2015

మహా కూటమిదే విజయం?

 హోం >> జాతీయం-అంతర్జాతీయం
మహా కూటమిదే విజయం?
Updated :10-09-2015 01:04:47
 సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ సర్వే అంచనా
 
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: బిహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలయికతో ఏర్పడిన మహాకూటమి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నాయి. 243 శాసనసభ స్థానాలున్న బిహార్‌లో మహాకూటమి 116-132 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సీ ఓటర్‌ సంస్థ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 94-110 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. బిహార్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 10,683 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే చేసినట్లు సీ ఓటర్‌ సంస్థ వెల్లడించింది. ఆగస్టు చివరివారంలోనూ, సెప్టెంబరు మొదటి వారంలోనూ ఈ సర్వే నిర్వహించామని చెప్పింది.
 
మహాకూటమికి 43 శాతం ఓట్లు, బీజేపీకి 40 శాతం ఓట్లు, ఇతరులకు 17 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఇష్టపడతారు అన్న ప్రశ్నకు 53శాతం నితీశ్‌కుమార్‌ పేరు చెప్పగా బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ పేరును 18శాతం మంది చెప్పారు. లాలూకు 5శాతం మంది మద్దతే లభించింది. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ప్రశ్నకు బీజేపీ కూటమి వల్లే అని 36శాతం, నితీశ్‌,లాలూ కూటమి వల్ల అని 25శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల ద్వారా మార్పు తథ్యమని 56 శాతం అభిప్రాయపడ్డారు.
 
ముఖ్యమంత్రి మారాలని 52 శాతం అభిలషించారు. 70 శాతం మంది ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చేయాలని భావిస్తున్నారు. బీహార్‌ అభివృద్ధికి బీజేపీ కూటమి కృషి చేస్తుందని 36 శాతం అభిప్రాయపడగా.. లాలూ-నితీశ్‌-కాంగ్రెస్‌ కూటమిపై 25 శాతమే ఆశలు పెట్టుకున్నారు. 

No comments:

Post a Comment