Saturday, 12 September 2015

ఓ ఊరి ..వ్యథ

ఓ ఊరి ..వ్యథ
Updated :12-09-2015 11:34:41
  • ఒకప్పుడు బత్తాయి సాగులో ఆదర్శం ఫ పచ్చని పల్లె.. నేడు మోడు వారింది! 
  •  పాతాళంలో నీరు తోడేందుకు భగీరథయత్నం
  •  అప్పులు తీర్చలేక గల్ఫ్‌ దేశాలకు వలసలు
బత్తాయి రైతు పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోంది. నమ్ముకున్న పంటే నట్టేట ముంచుతోంది. పెట్టిన పెట్టుబడులు సైతం రాకపోవడంతో బత్తాయి సాగుకు రైతులు స్వస్తి పలుకుతున్నారు. భూగర్భ జలం అడుగంటడంతో తోటలకు నీరందించేందుకు పదుల సంఖ్యలో బోర్లు వేసి అప్పులు పాలవుతున్నారే తప్ప చెట్లకు నీటి తడులు అందించలేకపోతున్నారు.
- ఉదయగిరి రూరల్‌, నెల్లూరు
ఉదయగిరి మండలం దాసరిపల్లి గ్రామం జిల్లాలో బత్తాయి సాగులో రెండో స్థానంలో ఉంది. గ్రామంలో 400 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉంది. అందరూ వ్యవసాయ రైతులు, రైతు కూలీలే. గ్రామం చుట్టూ 1300 ఎకరాల సాగు భూములు ఉండగా, వీటిల్లో సుమారు 900 ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. గ్రామంలో రైతులతోపాటు వ్యాపారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం మంచి లాభాలు రాబడంతో అందరూ బత్తాయి సాగువైపు మొగ్గు చూపారు. దీంతో గ్రామంతోపాటు చుట్టుపక్కల మండలాలైన వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, సీతారామపురం, కొండాపురం, కలిగిరి, అనంతసాగరం, మర్రిపాడు తదితర మండలాల్లో కాపుకొచ్చిన బత్తాయి తోటలను కొనుగోలు చేసేవారు. ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేసిన కాయలను మహారాష్ట్ర, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, చిలకలూరిపేట, హైదరాబాదు తదితర ప్రాంతాలకు సీజన్‌లో 1000 నుంచి 1200 లారీల లోడ్ల బత్తాయిలను రవాణా చేసేవారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఒక్క సీజన్‌లో కోట్ల రూపాయల టర్నోవర్‌ జరిగేది. 
  •  అందని రుణాలు
గత ఐదేళ్ల క్రితం బాగా రాబడి రావడంతో బ్యాంకుల్లో రైతులు అధికంగా డిపాజిట్లు చేస్తుండడంతో పిలిచి రుణాలిచ్చే వారు. ఐదేళ్లుగా కరువు కరాళనృత్యం చేయడంతో ఉన్న నగదుతో చెట్లను రక్షించేందుకు ఖర్చు చేశారు. అవి కూడా సరిపోక బంగారం తాకట్టు పెట్టి బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతోపాటు బ్యాంకుల్లో పెట్టిన నగలు తెచ్చుకోలేక వదిలేస్తున్నారు. దీంతో బ్యాంకులు సైతం తమ గ్రామానికి రుణాలిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెపుతన్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముంచేసిన వరుణుడు
ప్రస్తుతం దాసరిపల్లి పరిస్థితులు తలకిందులయ్యాయి. ఐదేళ్లుగా చినుకు రాలకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బత్తాయి తోటలన్నీ నిలువునా ఎండిపోయాయి. వాటిని కాపాడుకొనేందుకు ఆ ఒక్క గ్రామంలోని 700 నుంచి 800 బోర్లు వేసి సొమ్మంతా వాటికే ఖర్చు చేశారు. ఒక్క బోరు పాయింట్‌కు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేశారు. వందల అడుగులు బోర్లు వేసినా బూడిద తప్ప చుక్కనీరు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిలువునా ఎండిన చెట్లను తమ స్వహస్తాలతోనే నరికేస్తూ వంట చెరకుగా ఉపయోగిస్తూ తోటలో మిగిలిన మొదళ్లను చూసుకొని కన్నీటి పర్యాంతమవుతున్నారు. 900 ఎకరాల బత్తాయి సాగు ఉన్న గ్రామంలో ప్రస్తుతం వందకు పడిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతుంది. అటు అప్పులు, ఇటు కరువును తట్టుకోలేక ఇప్పటికే గ్రామం నుంచి 150 మంది గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, సౌదీ, ఖత్తర్‌ తదితర ప్రాంతాలకు తరలివెళ్ళారు. ఈ పరిస్థితి ఒక్క దాసరిపల్లి గ్రామంలోనే కాదు. జిల్లాలో బత్తాయి సాగు చేసిన రైతులు ఎదుర్కొంటున్న దైన్యదుస్థితి.
పరిహారం ఏదీ?
చెట్లు నిలువునా ఎండి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన తమకు ప్రభుత్వం పరి హారం అందనేలేదు. అధికారులు వచ్చి ఎండిన పంట వివరాలు రాసుకెళ్ళడం తప్ప తమకు జరిగింది శూన్యం. గ్రా మంలో తాగేందుకు నీరు కూడా దొరకడంలేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కొ కుటుంబం వలస బాట పడుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఊరు ఖాళీ అయ్యే దుస్థితి నెలకొని ఉంది.
- సయ్యద్‌ ఉస్మాన్‌అలీ, దాసరిపల్లిజూ
 
తోటలను మరిచిపోయాం
ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదు. కన్నబిడ్డల్లా పెంచుకున్న తోటలను తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరిచిపోయాం. ఒ క్కొక్కరుగా గ్రామంలో వలస వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- షేక్‌ ఖాజామొహిద్దీన్‌, దాసరిపల్లి

No comments:

Post a Comment