Thursday 8 May 2014

మన రాజ్యాంగమూ, మన ఎన్నికలూ - చలసాని ప్రసాద్

మన రాజ్యాంగమూ, మన ఎన్నికలూ - చలసాని ప్రసాద్

Published at: 08-05-2014 17:40 PM
ఇప్పుడు అందరి కళ్ళూ మన మీదే ఉన్నాయి. మన ఎన్నికల రంగం చాలా కీలకమైన దశకి చేరుకుంది. ఎన్నికలు ప్రజాసామ్యానికి కొలబద్దలని చెప్పగలమా?
ప్రజాస్వామ్యం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు. అయినా మనం ఇంకా బ్రిటిష్ కామన్వెల్త్‌లో భాగస్వాములమే. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూనే వున్నాం. అదే మంటే మూడు మహమ్మారులని- లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజైషన్- మన మీదికి వేటకుక్కల్లా ఉసిగొల్పుతున్నారు.
ఏ దేశంలో నయినా ఆ దేశ ప్రజలకే సార్వభౌమాధికారం ఉండాలి. ఏకత్వం ఉండాలి. సమానత్వం ఉండాలి. ఈ పునాదుల పైన లేచిన కట్టడాన్నే మనం ప్రజాస్వామ్యం అనాలి. అంతేగాని కేవలం ఓట్లు, నోట్లు, సీట్లు ప్రజాస్వామ్య వ్యవస్థని నెలకొల్పలేవు.
1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం మన దేశంలోనూ, బ్రిటిష్ ఆంధ్రలోనూ జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అందరికీ ఓటు హక్కు లేదు.ఆర్థిక ప్రాతిపదిక మీద ఆధారపడి ఓటర్లు ఉండే వారు. బ్రిటిష్ ఆంధ్రలో ఎన్నికలు 1937లో జరిగాయి. బొబ్బిలినుంచి నెల్లూరు దాక కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ని ఎదిరించి ఎన్నికల గోదాలోకి దిగిన జస్టిస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెల్చుకుంది. కృష్ణా జిల్లా దివి తాలూకాలో యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్-అంటే 17 వేల ఎకరాల ఆస్తి ఉన్న చల్లపల్లి జమిందారు నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థి గొట్టిపాటి బ్రహ్మయ్య గారు ఓడిపోయారు. బొబ్బిలిరాజా మీద వి.వి.గిరిగారు 7777 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. వివిగిరి గారి తరఫున ప్రచారం చేయడానికి బొబ్బిలి వచ్చి సరోజినీనాయుడు, జవహర్‌లాల్ నెహ్రూ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మీదకి బొబ్బిలి జమిందార్ ఏనుగులు, గుర్రాలు తోలాడు. అయితే పంద్రాగస్టు తరువాత జరిగిన ఎన్నికల్లో ఈ జస్టిస్ పార్టీ జమిందార్లే కాంగ్రెస్‌లో పడుగు పేకలా కలిసిపోయారు. అని నేనంటే నన్ను కాళోజీ కరెక్ట్ చేశాడు - 'వాళ్ళు కాంగ్రెస్‌లో కలువలా. కాంగ్రెస్సే వాళ్ళలో కలిసింది' అని. చల్లపల్లి జమిందారు కాంగ్రెస్ మంత్రి వర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పదవి వెలగబెట్టాడు.
కేరళ (1957)లో కమ్యూనిస్టు మంత్రివర్గం ఏర్పడింది. కాని నెహ్రూగారు ఉయ్యాలలోని పసిపాపని పీక పిసికి చంపేశారు (1959 జూలై 31). ప్రొఫెసర్ భాస్కరన్ అని మద్రాస్ యూనివర్శిటీలో పనిచేశారు. రాజకీయాల్లో ఆయన రాజాజీగారి శిష్యుడు. మన రాజ్యాంగం అంటే ప్రేమ. నెహ్రూగారి చేత ఈ పాపం చేయించింది ఇందిర గాంధీయేనని అంతా అనుకునేవారు. భారత రాజ్యాంగం ఒక మహిళచేత ఖూనీ చేయబడిందని ఆయన నా ద్గగర వాపోయారు. రాజాజీ శిష్యుడు అక్కడితో ఆగలేదు - 'నాకు పదిమంది రౌడీలనివ్వండి. వాళ్ళచేత అల్లర్లు చేయించి నేను నెహ్రూ మంత్రి వర్గాన్నే రద్దు చేయిస్తాను'అన్నాడు. అప్పుడు దేశంలో నంబూద్రిపాద్ ప్రతిష్ఠ అమోఘంగా పెరిగింది. రాజ్యాంగం మంచి చెడులని విశ్లేషిస్తూ చాలా వ్యాసాలు రాశా డాయన.
అదంతా పాతకథ. పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రతిష్ఠ ని దెబ్బ తీయడానికే నెహ్రూగారు చైనా భూతాన్ని సృష్టించారు. అందుకే నెహ్రూని పచ్చి అబద్దాలకోరు అని నంబూద్రిపాద్ ఆనాడే ఘాటుగా విమర్శించారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎన్నికలు అష్టావక్రంగా తయారవడం అందరం చూస్తూనే ఉన్నాం. సామాజిక వ్యవస్థ బలమైన పునాదుల మీద నిర్మాణమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ, ఆరుకాయలుగా విలసిల్లుతుంది. అంతవరకు దొంగ ఓట్లు, దొంగనోట్లే చలామణీలో ఉంటాయి. బెర్నార్ట్ షా అన్నట్టు ఎన్నికల వల్ల మంత్రుల చిరునామాలు మారతాయే తప్ప వ్యవస్థ చెక్కు చెదరదు. సామాజిక శక్తుల బలప్రయోగమే తప్పనిసరి అవుతుంది. అయితే అందాకా ఈ ఎన్నికల తతంగం అనివార్యంగా జరుగుతూనే ఉంటుంది. రాజకీయాల గురించీ, ఎన్నికల గురించి తన స్వీయచరిత్రలో నెహ్రూ చెప్పిన మాటలతో సరిపెడదాము. 'ఞౌజూజ్టీజీఛిట జీట ్చ జ్ఛn్టజ్ఛూ ్చట్ట ౌజ జ్ఛ్ట్టజీnజ ఠ్ట్ఛిౌట జటౌఝ ్టజ్ఛి ఞౌౌట ్చnఛీ జఠnఛీట జటౌఝ ్టజ్ఛి టజీఛిజి, ఞటౌఝజీటజీnజ ఛ్టౌజి ్టౌ ఞట్ట్ఛౌఛ్టి ్ఛ్చఛిజి జటౌఝ ్టజ్ఛి ౌ్టజ్ఛిట' అప్పటి నుంచీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ దీన్ని అక్షరాలా అమలు చేస్తోంది.
మన భారత రాజ్యాంగాన్ని పొగిడిన వారూ ఉన్నారు, తెగడిన వారూ ఉన్నారు. ఏది ఏమైనా మూడేళ్ళ పాటు (1946-47) నానా పాట్లు పడి 1949 నవంబర్ 25న పూర్తిచేశారు. ఎర్నెస్ట్ బార్కర్ బాగా మెచ్చుకున్నాడు. కొందరయితే అసలు మన రాజ్యాంగ నిర్ణయ సభనే తప్పుపట్టారు. అందులో సామ్యావాద భావజాలం ఉన్న వారు ఒక్కరూ లేరు. ఆర్టికల్ 356 మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి నెలకొన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. దీనిని సర్దార్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించాడు. 'కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ రాజ్యాంగం వైపు మొగ్గు చూపుతుంది. రాష్ట్రాల హక్కుల్నీ, స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తుంది. ఇది కాంగ్రెస్ విధానం. దీన్ని దెబ్బ తీయాడనికే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని తిరస్కరించుతూ ఆంగ్లేయులు 1935 గవర్నమెంటు ఆఫ్ ఇండియా యాక్ట్‌లో 90 వ ఆర్టికల్‌గా దీనిని రూపొందించారు. దీనినే దొడ్డిదోవన తీసుకొచ్చి ఆర్టికల్ 356గా చొప్పించ చూస్తున్నారు. నేను అంగీకరించనని' సభ నుంచి వాకౌట్ చేసి పటేల్ వెళ్ళిపోయారు. కొంతకాలం తరువాత అంటే 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. దీని తరువాత తెలంగాణలో కమ్యూనిస్టులు వస్తే వాళ్ళని తొలగించే అవకాశం కాంగ్రెస్‌కు ఉండాలని పటేల్ తన మనసు మార్చుకున్నారు. చూశారా? పటేల్ గారిది ఎంత దూర దృష్టో! ఆయన భయపడినట్టే కేరళలో కమ్యూనిస్టు మంత్రివర్గం ఏర్పడ్డది. ఆ శిశువుని నెహ్రూ పొట్టన పెట్టుకున్నాడు.
అదీగాక మన రాజ్యాంగం మున్నుడి (అంటే ప్రియాంబుల్) లో సావరిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని మాత్రమే వుంది. ఎమర్జెన్సీ సమయంలో అంటే 1976 డిసెంబర్‌లో మున్నుడిని మన ఇందిరాగాగాంధీగారే మార్చారు. 42 రాజ్యాంగ సవరణ ప్రకారం మన రాజ్యాంగం సావరిన్ సోషలిస్టు సెక్యులర్ డెమోక్రాటిక్‌గా మారింది. ఈ సవరణ 1977 జనవరి 3న నుంచి మాత్రమే అమలులోకి వచ్చింది. ఇందిరాగాంధీగారు సోషలిస్టు ఇమేజ్‌తో ఓట్లు దండుకోవడానికి పన్నిన ఎత్తుగడ ఇది.
అయినా మంత్రాలకు చింతకాయలు రాలవు. మన పాలకులు మేకవన్నె పులులు. భారతదేశంలో పులులు కూడా కమండలాలు పుచ్చుకుని అడవులలోకి వెళతాయి. అన్ని దేశా ల పులులలాగే ఇవి కూడా నరమాంస భక్షణతోనే తమ బొజ్జల్ని నింపుకుంటాయి.
'జ్ఞాపకముందా నేస్తం ? చరిత్ర చెప్పే సత్యం?'
పులుల నైజం, పాలకుల నైజం మారవుగాక మారవు.
అన్ని అడవుల, అన్ని దేశాల పులుల లాగానే మన దేశపు పులులు కూడా కాషాయం ధరించి హిమాలయాలకు వెళ్ళవు. మన మధ్య వుంటూ మనలని నెమరువేస్తూ భక్షిస్తూనే వుంటాయి.
కొసమెరుపు: సొంతాస్తిని ప్రాథమిక హక్కుల్లో చేర్చిన రాజ్యాంగం ఎంత బూటకపు స్వభావం కలిగివుందో మనకి ఇవాళ ప్రత్యక్షంగా అనుభవైకవేద్యమే. ఏతా వాతా తేలేదేమంటే మనది బూటకపు స్వాతంత్య్రం. పంద్రాగస్టు అధికార మార్పిడే తప్ప అసలు, సిసలు స్వాతంత్య్రం కాదు. తెల్ల దొరలు పోయి నల్లదొరలు వచ్చారు. ఈ నల్ల దొరలకి అమెరికా అండదండలు దండిగా ఉన్నాయి. దీన్ని ఎండగడుతూ కాళీపట్నం రామారావు గారు పంద్రాగస్టు ( 1972) వెండిపండగనాడు 'కుట్ర' కథ రాశారు.
ఆగస్టు పదిహేను మోసం గురించి చెప్పక పోతే అన్నం సహించదు అని చెరబండరాజు స్పష్టంగా చెప్పారు. కనక మన రాజ్యాంగం లో బోలెడు అవకతవకలున్నాయి. అయినా మనం దాన్నే నెత్తిన పెట్టుకుంటున్నాం.
- చలసాని ప్రసాద్
విప్లవ రచయితల సంఘం

No comments:

Post a Comment