Sunday 4 May 2014

జగన్ పొత్తు కేసుల కోసం

నా పొత్తు మీ కోసం.. జగన్ పొత్తు కేసుల కోసం మాయ మాటలవి

Published at: 05-05-2014 06:50 AM
నిన్నటి వరకూ మతతత్వ బీజేపీ.. నేడు మద్దతుకు అర్హమైనదా?
మైనారిటీ సోదరులూ.. జగన్ మాటల మార్మాన్ని గుర్తించండి
మీకు అండగా నిలిచింది టీడీపీయే.. రిజర్వేషన్లు పెంచుతాం
బెయిల్ కోసం తెలుగు జాతినీ చీల్చిన నీచుడు జగన్
వైసీపీ వారికి ఓటేస్తే మీ బిడ్డలను రౌడీలను చేస్తారు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము నాకే ఉంది: చంద్రబాబు
తిరుపతి/కడప, మే 4 : 'నిన్నటి వరకు బీజేపీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తూ మైనార్టీల ఓట్లు కొల్లగొట్టాలని చూశాడు. ఇప్పుడేమో కేంద్రంలో మోదీ ప్రధాని కానున్నారని తెలిసి, కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి మద్దతు ఇస్తానని చెబుతున్నాడు. మైనారిటీ సోదరులు జగన్ మాయ మాటల్లోని మర్మాన్ని గుర్తించాలి' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ తీరును ఎండగట్టారు. ఆదివారం ఆయన చిత్తూరు, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పా ల్గొని ప్రసంగించారు. బెయిల్ కోసం ఆం«ద్రుల ఆత్మగౌరవాన్ని తా కట్టు పెట్టిన జగన్ ఇప్పుడు ఎన్డీయేతో పొత్తుకు సిద్ధమవుతున్నాడని, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎంతకైనా దిగజారుతాడని బాబు దుయ్యబట్టారు. నేను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటే.. జగన్ తన కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లు పట్టుకుని ఎన్డీయేతో పొత్తుకు సిద్ధమవుతున్నారని విమర్శించా రు. మతం ముసుగులో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని నీచరాజకీయాలు చేస్తున్నాడని, స్వప్రయోజనాల కోసం కులం, మతం పేరుతో ప్రజలను చీల్చే నీచ మనస్తత్వమున్న జగన్‌కు ఓటేస్తారో.. ఎన్టీఆర్ హయాం నుంచి మతసామరస్యానికి, మైనారిటీల రక్షణకు కట్టుబడిన టీడీపీకి ఓటేస్తారో మైనారిటీ సోదరులే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలకు మోసపోవద్దన్నారు.
మైనారిటీలకు అండగా ఉంటా
మైనారిటీలకు టీడీపీ రక్షణ కవచంగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటానని, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతం పెంచుతానన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతానని, ముస్లిం సోదరులకు అండగా ఉంటానని, వారిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని స్పష్టం చేశారు.
సువార్త సభల్లో డబ్బు పంపిణీ
జగన్ పార్టీకి చెందిన వారు సువార్త సభల్లో డబ్బులు పంచుతున్నారని, ఈ డబ్బు పంపిణీని ఏసుప్రభువు ఒప్పుకుంటాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన తల్లి బైబిల్ చేతిలో లేకుండా గడప దాటడం లేదు. చర్చిల్లో ప్రచారం చేయడంతోపాటు, అక్కడే డబ్బులు పంపిణీ కూడా చేస్తున్నారు. ఇది మతతత్వం కాదా అని నిలదీశారు. జీవితాల్లో కష్ట సుఖాలను నిర్ణయించేది రాజకీయమేనని, అలాంటి రాజకీయాలను కుల,మతాలతో ముడిపెట్టవద్దని హితవు పలికారు.
రాష్ట్రంలో తెలుగుదేశం గెలవకపోతే నష్టం ప్రజలకేనన్నారు. మట్కా, ఎర్రచందనం స్మగ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారికి వైసీపీ టికెట్లు ఇచ్చిందని, అలాంటి వారిని దూరం పెట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వాళ్లకు ఓట్లేస్తే మన నెత్తిన మనం చెత్తేసుకున్నట్లేనన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రౌడీలను రాష్ట్రం దాటిస్తామన్నారు. సైకిల్ స్పీడు పెంచి అవినీతిపరులను తొక్కేస్తానన్నారు. గతంలో నా వల్ల రాష్ట్రం ఆదాయం పెరిగితే దాన్ని వైఎస్ తన కొడుక్కు దోచి పెట్టాడని ఆరోపించారు.
వైసీపీ దొంగల పార్టీ.. జగన్ కుటుంబం దొంగల ముఠా
రైతుల రుణమాఫీ సాధ్యం కాదని మాట్లాడుతున్న ఆ సైకో ప్రజల సొమ్మంతా దోచుకోవాలని చూస్తున్నాడని బాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామన్నారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతామన్నారు. డీకేటీ పట్టాలకు సంబంధించి పూర్తిహక్కులు కల్పిస్తామన్నారు. వైసీపీ ఓ దొంగల పార్టీ అని, జగన్, ఆయన కుటుంబం, ఆయన పరివారం దొంగల ముఠా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం జగన్ జాగీరు కాదని, ఆయన, ఆయన తల్లి, మామ, చిన్నాన్న ఇలా అందరూ పోటీలో ఉండి, ప్రజల సొమ్మును దోచుకునేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. జగన్‌తో పాటు ఆయన సోదరి షర్మిల కూడా బయ్యారంలో 1.40 లక్షల ఎకరాల గనులను దోచుకుందని విమర్శించారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి ఖాతాలో హవాలా డబ్బు వంద కోట్లు పడ్డాయని, సింగపూర్ నుంచి రూ.40 కోట్లు, మలేషియా నుంచి రూ.60 కోట్లు హవాలా డబ్బు ఆయనకు చేరిందని ఆరోపించారు. జగన్ మామ రవీంద్రనాథ్‌రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టి, ఎరువుల్లో మట్టి కలిపి సొమ్ము చేసుకున్నారని, ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ భర్త పశ్చిమ బెంగాల్‌లో రూ.200 కోట్లు కొట్టేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు.
ఆ పార్టీలకు ఓటేస్తే మురిగిపోయినట్లే
విభజనకు తెల్లదొరసాని సోనియా కారణమైతే, పాత్రధారులు కేసీఆర్, జగనేనన్నారు. బెయిలు కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చడానికి సహకరించిన నీచుడు జగన్ అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖతమైపోయిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని అసమర్థ కిరణ్ ఇప్పుడు ఓట్లు వేస్తే పొడిచేస్తానంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు ఎక్కడా కనిపించడం లేదని, వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే అవి మురిగిపోయినట్లేనన్నారు. 'రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము నాకే ఉంది' అని బాబు స్పష్టం చేశారు. తానెప్పుడూ పదవులకు ఆశ పడలేదన్నారు. పీఎం పదవి వరించి వచ్చినా రాష్ట్ర ప్రజల కోసం తృణప్రాయంగా త్వజించానన్నారు.
ఇవి సాదాసీదా ఎన్నికలు కావు
నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికలు సాదాసీదావి కావని చంద్రబాబు ప్రజలకు వివరించారు. కొత్త రాజధాని నిర్మించుకోవాలి.. ఆదాయం కోల్పోయాం.. అప్పులు మిగిలాయి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.. వీటన్నిటి భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఎన్నికలేనన్నారు. వీటన్నింటినీ సాధించగలిగే సత్తా, అనుభవం రాష్ట్రంలో తన ఒక్కడికే ఉందన్నారు. 'అమ్మా మీకు మళ్లీ చెబుతున్నా, రాత్రికి ఇళ్లలో కూర్చుని ఆలోచించండి, ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగుచేయగలరో చర్చించుకోండి. తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీకు బాధలు తప్పవు. వైసీపీ వాళ్లు మీ బిడ్డలను రౌడీలను చేసి రోడ్లపైకి వదిలేస్తారు, ఆలోచించుకుని టీడీపీని గెలిపించండి' అని చంద్రబాబు మహిళలను కోరారు. 'ఆలోచించుకోండి, ఇది మీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జగన్‌కివే ఆఖరి ఎన్నికలు
జగన్‌కు ఇవే ఆఖరి ఎన్నికలని..ఆరు నెలల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసులన్నీ ట్రయిల్ కొచ్చి జైలుపాలు కావడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఈసారి జైలుకెళితే 20 ఏళ్ల దాకా బయటకు రాడన్నారు. 'తెలుగుదేశం ఓటమిపాలైతే చంద్రబాబు ఉండడని, తెలుగుదేశం పార్టీ ఉండదని జగన్ మాట్లాడుతున్నాడు, ఆయనపై ఉన్న కేసుల విచారణ పూర్తయితే జైలుకెళ్లేది ఆయనే. నేను మాత్రం బయటే ఉంటా' అని బాబు పేర్కొన్నారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ నా విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

No comments:

Post a Comment