Wednesday 28 May 2014

సంకేతాల కన్నా ఫలితాలు ప్రధానం

సంకేతాల కన్నా ఫలితాలు ప్రధానం(ఇండియా గేట్)- ఎ. కృష్ణారావు

Published at: 28-05-2014 00:44 AM


మోదీ పంపించిన సంకేతాలు, వాటి ద్వారా ఏర్పర్చిన సదభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ సంకేతాలు ఫలితాలుగా మారడంపైనే, సదభిప్రాయాలు నిలుపుకోవడంపైనే మోదీ విజయం ఆధారపడి ఉన్నది.... ప్రజాభిప్రాయాలకు, పౌర సమాజానికి విలువ ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత. తనకు ప్రస్తుతం ఉన్న సానుకూల పవనాలను స్థిరంగా మార్చుకోవడం మోదీ చేతిలోనే ఉన్న పని.
యూపీఏ హయాంలో మంత్రివర్గంలో మార్పులు జరుగుతున్నాయంటే చాలా పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగేది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టిలో పడితే చాలు మంత్రిపదవులు దక్కే అవకాశాలు ఎక్కువయ్యేవి. వీరు కాక సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించేవారు. ఆయన కటాక్ష వీక్షణాల కోసం ఆరాటపడేవారు. అందుకు ఆయన చుట్టూ తిరిగేవారు. అహ్మద్‌పటేల్ కటాక్షం కోల్పోయారంటే మంత్రిపదవి కోల్పోయినట్లే లెక్క. పార్టీ నిధుల చెల్లింపుల్లోనో, వ్యక్తిగత చెల్లింపుల్లోనో ఎక్కడో ఒక చోట తేడా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ పాత్ర మంత్రుల ఎంపికలో దాదాపు లేదనే చెప్పాలి. అసలు ఏ మంత్రిని మన్మోహన్ సింగ్ స్వయంగా నియమించారో చెప్పడం కష్టం. అదే పి.వి. నరసింహారావు మన్మోహన్ సింగ్‌ను మంత్రిగా నియమించే ముందు చాలా పేర్లను పరిశీలించి చివరకు స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులతో మన్మోహన్ సింగ్ సంబంధాల ఆధారంగా ఆయనను ఆర్థిక మంత్రిగా నియమించారు.
ఆయన శిష్యుడైన మన్మోహన్ సింగ్ మాత్రం గురువును ఏమాత్రం అనుసరించలేదు. పదవిలో ఉన్నంతకాలం స్వతంత్రత అన్న పదానికి అర్థం తెలియనట్లే మన్మోహన్ దాదాపు వ్యవహరించారు. విచిత్రమేమంటే మంత్రుల ఎంపికలో చాలామంది లాబీయిస్టులు కీలక పాత్ర పోషించేవారు. ప్రముఖ లాబీయిస్టు నీరారాడియాకూ సీనియర్ జర్నలిస్టులు కొందరికీ జరిగిన సంభాషణల్లో ఎవరెవరిని మంత్రిపదవుల్లో నియమించాలో, ఏఏ విధాన నిర్ణయాలు తీసుకోవాలో అన్న అంశాలపై చర్చలు జరిగేవి. టి.ఆర్. బాలూ, దయానిధి మారన్, కనిమొళి తదితరుల కోసం లాబీయింగ్ జరిగినట్లు ఆ సంభాషణల్లో తేలింది. చాలా అలవోకగా జరిగే సంభాషణల్లో ఏఏ కాంగ్రెస్ నేతలకు ఏఏ సందేశం చేర్చాలో, ఏఏ పార్టీ విందుల్లో ఎవరెవర్ని ముగ్గులోకి లాగాలో అన్న అంశాలు ప్రస్తావనకు వచ్చేవి. పారిశ్రామికవేత్తల అభీష్టాల ప్రకారం మంత్రుల నియామకాలు, ఉద్వాసనలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆ అవసరం లేదు. సాధారణ మధ్యతరగతి ప్రపంచమే కాదు, మొత్తం పారిశ్రామిక ప్రపంచం మోదీ నియామకం తర్వాత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపు వస్తుందని ఆశిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 20వేల కోట్ల మేరకు వివిధ ప్రాజెక్టులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ధరలు తగ్గించేందుకు, ఉపాధి కల్పనను పెంచేందుకు మోదీ ఏ చర్యలు తీసుకుంటారా అని అనేకమంది ఎదురు చూస్తున్నారు. తాను ప్రభుత్వంకన్నా పాలనపైనే దృష్టి కేంద్రీకరిస్తానని మోదీ స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా జరిగేందుకు మంత్రిత్వ శాఖలను విలీనం చేశారు. నిజానికి మోదీ మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులుంటారన్న విషయంలో చాలా మంది పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. మోదీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొంతమేరకు రణగొణ ధ్వనులు వినిపించినప్పటికీ జనానికి ఈ విషయంలో ఆసక్తి లేదని, మోదీ పాలన ఎలా ఉంటుందా అన్న విషయంపైనే అందరి దృష్టి నిమగ్నం కావడంతో వాటికి ఎవరూ ప్రచార రూపం కూడా కల్పించలేదు. ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, శాంతా కుమార్, సుమిత్రా మహాజన్ లాంటి వారిని ఎందుకు ప్రక్కనపెట్టారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కావడం లేదు. 75 సంవత్సరాలు దాటిన వారిని మంత్రివర్గంలో నియమించకూడదని మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదేనని హర్షం వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ సర్కార్‌కూ మోదీ సర్కార్‌కూ తేడా ఎంతో ఉన్నది. అప్పుడు ప్రధానమంత్రికి అస్తిత్వం లేదు. ఇక్కడ ప్రధానమంత్రికే ప్రధాన అస్తిత్వం. మన్మోహన్ సింగ్ సర్కార్ ఎదుర్కొన్నట్లుగా ఇక్కడ సంకీర్ణ రాజకీయాల ఒత్తిడి అసలు లేనే లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్డీఏ సర్కార్ లేదా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న సర్కార్. అయినప్పటికీ అది మోదీ సర్కార్‌గానే ఎక్కువ గుర్తింపు పొందింది.
మోదీ తన కేబినెట్‌లో సమర్థులైన వారిని మంత్రివర్గంలో నియమించుకున్నప్పటికీ వారు తీసుకునే నిర్ణయాల ఘనత కూడా మోదీకే దక్కుతుంది. మోదీని మెప్పించడం, తమ సమర్థత ప్రదర్శించడంపైనే వారికి బాధ్యతలు అప్పగించడం ఆధారపడి ఉన్నది. ఇక ఐఐటి, ఐఐఎం, యూజీసీ, ఎన్‌సీఆర్‌టీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యాసంస్థలతో వ్యవహరించే, దేశ విద్యావిధానం రూపురేఖలు మార్చగల ప్రతిష్టాత్మకమైన మానవవనరుల శాఖను నిన్నటివరకూ టీవీ సీరియల్స్‌లో నటించి, పెద్దగా చదువుకోని స్మృతి ఇరానీ వంటి నేతకు అప్పగించినప్పటికీ ఎవరూ పట్టించుకోని స్థితి. నిర్ణయాలు తీసుకునేది ప్రధానమంత్రి మోదీ కనుక ఆయన ఎవరితోనైనా పనిచేయించగలరనే ఒక అభిప్రాయం నెలకొనడం ఇందుకు కారణం. అయినా ఓటు వేసిన వారి వేలుపై సిరా గుర్తు ఆరనే లేదు. అఖండ మెజారిటీ సాధించిన మోదీని ఇప్పుడెవరైనా ప్రశ్నించే సాహ సం ఎలా చేయగలరు? రెండు సీట్లు సాధించిన మిత్రపక్షానికీ, 16 సీట్లు సాధించిన మిత్రపక్షానికీ ఒకేస్థాయిలో కేబినెట్‌లో స్థానం కల్పించవచ్చు. అడిగే నిర్మొహమాటం ఎవరికి ఉన్నది? ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్ల ఆధారంగానూ మంత్రివర్గ కేటాయింపులు జరగలేదు. బీజేపీని మొత్తం ఒకే ఒక పార్టీగా గుర్తించారు కానీ రాష్ట్రాల వారీగా ఆ పార్టీకి కేబినెట్ శాఖలు కేటాయించాలని మోదీ అనుకోనే లేదు. లోక్‌సభ అభ్యర్థులకే ప్రాధాన్యతనీయాలనీ ఆయన భావించలేదు. సమర్థత, విధేయత ఆధారంగా ఆయన రాజ్యసభ సభ్యులకూ ముఖ్యమైన శాఖలు కేటాయించారు. ఇందుకు మోదీ తర్కం మోదీకి ఉన్నది. అయినా ఆయన పదవులు, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తున్నానని, అభివృద్ది, పేదరిక నిర్మూలనం, మహిళలకు ప్రాధాన్యతపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాన ని చెప్పిన తర్వాత ఎవరైనా ఇతర ఆలోచనలనన్నిటినీ మౌనంగా అణిచిపెట్టుకోవాల్సిందే. మోదీ ఆలోచనా విధానానికే ప్రాధాన్యత నీయాలి.
ఎవరేమన్నా సరే.. ఇప్పుడు మోదీ ఏం చేసినా హర్షిస్తున్నారు. వాటికి కొత్త తాత్విక దృక్పథాలు కల్పిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ వారణాసికి వెళ్లి విభూతి దాల్చి గంగా హారతిలో పాల్గొనడం చూసి పులకరించిన వారెందరో ఉన్నారు. మోదీ తల్లి ఆటోలో వెళ్లి ఓటు వేసినందుకు ఎంత సామాన్య కుటుంబం ఆయనది.. అని చర్చించిన వారెందరో ఉన్నారు. ఆ తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మోదీ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని సంతోషించిన వారు చాలామంది ఉన్నారు. మోదీ తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతూ మెట్ల వద్ద ఆగి మెట్లకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టడాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో అపూర్వ దృశ్యంగా అభివర్ణించిన వారు అనేకులు. చాయ్‌వాలా ప్రధాని అయ్యారని సంతోషించేవారు ఒకరైతే, చీపురుతో హెగ్డేవార్ భవన్ నేలను తుడిచారని చెప్పుకుంటూ ఆ ఫోటోలను ఒకరికి మరొకరు పంపించుకునేవారు ఎంతోమంది. మోదీ గురించి చెప్పుకోవడమే, ఆయన గురించిన సమాచారాన్ని పంచుకోవడమే ఇప్పుడు నలుగురి మధ్య సంభాషణల్లో ప్రధానాంశమైంది. దృశ్యమాధ్యమాలు ఈచర్చను మరింత పురికొల్పాయి.
సంకేతాల ద్వారానే మోదీ తన సందేశాలను పంపిస్తున్నారన్న విషయం ఈ పరిణామాలతో స్పష్టం అవుతున్నది. ప్రధానమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఇప్పటివరకూ ఇలా ఏ నేతా నిర్ణయం తీసుకోకపోవడంతో విదేశాంగ శాఖ అధికారులకు ఏమి చేయాలో తోచలేదు. దీనితో నరేంద్రమోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ద్వారా విదేశాంగ శాఖకు ఆదేశాలను పంపించాల్సి వచ్చింది. భారత దేశంలో బలమైన ప్రజా మద్దతుతో తాను అధికారంలోకి వచ్చానని చెప్పడం కోసమే మోదీ వారిని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పాలన అంతగా లేని సార్క్ దేశాల అధినేతలకు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఇది ఉపకరించింది. అంతేకాక సార్క్ దేశాధినేతలతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకునేందుకు సిద్దంగా ఉన్నానని, తన సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన పాక్ వ్యతిరేక వైఖరి ఏర్పర్చుకోవాలనుకోవడం లేదని కూడా మోదీ సంకేతాలు పంపించారు. తమిళ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించడం ద్వారా విదేశాంగ విధానం విషయంలో ఒత్తిళ్లకు లొంగబోనని స్పష్టీకరించారు. మరో వైపు మోదీ పార్లమెంట్ మెట్లకు ప్రణామం చేయడం కూడా ప్రజాస్వామ్య మందిరంగా పార్లమెంట్ స్థాయిని పెంచేందుకు దోహదం చేసిందని విశ్లేషించేవారు ఉన్నారు. ఇక తొలి కేబినెట్ సమావేశంలోనే నల్లధనంపై ఉన్నతస్థాయి సంఘం ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆయన తన ప్రాధాన్యతల గురించి సంకేతాలు అందజేశారు.
మోదీ పంపించిన సంకేతాలు, వాటి ద్వారా ఏర్పర్చిన సదభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. కానీ ఈ సంకేతాలు ఫలితాలుగా మారడంపైనే, సదభిప్రాయాలు నిలుపుకోవడంపైనే మోదీ విజయం ఆధారపడి ఉన్నది. పాక్‌తో సర్కార్ శాశ్వత స్నేహం కోరుకుంటుందా లేక పాకిస్థాన్‌తో వైషమ్యాలను భారతీయ ప్రజల మనోభావాలను పురికొల్పేందుకు, తన రాజకీయ ప్రయోజనాలకు కాపాడుకునేందుకు ఉపయోగించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. ఉపఖండంలో శాంతి నెలకొంటే కానీ దేశంలో పరిపాలనపై దృష్టి కేంద్రీకరించలేమన్న విషయం మోదీకి తెలియనిది కాదు. ఇక పార్లమెంట్ ప్రమాణాలు పెరగడం అనేది అందులో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై చర్చించడం, వాటికి సమర్థవంతమైన పరిష్కార మార్గాలను సూచించడంపై ఆధారపడి ఉన్నది. మెజారిటీ ఉన్నందువల్ల మోదీకి పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యానికి నిజమైన వేదికగా మార్చడం పెద్ద కష్టం కాదు. అంతేకాదు పార్లమెంట్ వెలుపల ఉన్న ప్రజాభిప్రాయాలకు, పౌర సమాజానికి విలువ ఇచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్థకత. తనకు ప్రస్తుతం ఉన్న సానుకూల పవనాలను స్థిరంగా మార్చుకోవడం మోదీ చేతిలోనే ఉన్న పని.
- ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

No comments:

Post a Comment