Wednesday 21 May 2014

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్యాకేజీపై మోదీ దృష్టి

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్యాకేజీపై మోదీ దృష్టి

Published at: 21-05-2014 19:48 PM
న్యూఢిల్లీ, మే 21 : ఆంధ్రప్రదేశ్‌కు భారీ ప్యాకేజీపై నరేంద్రమోదీ దృష్టి సారించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని త్వరగా రూపొందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని మోదీ బుధవారం ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ లోపే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్న పట్టుదలతో మోదీ ఉన్నట్లు తెలియవచ్చింది. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని భావిస్తున్న మోదీ పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. ఉగ్రవాద నిరోధకం, ఇంటిలిజెన్సీ వ్యవస్థలో మార్పులు, దేశం పరువు తీస్తున్న నల్లధనం వంటి అనేక అంశాలపై మోదీ దృష్టి సారించారు.
మంగళవారం మోదీతో హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాధాన్యత అంశాలు చర్చకు వచ్చినట్లు తెలియవచ్చింది. దక్షిణాది నుంచి ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడంతో మోదీ సీమాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. .జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే.
నరేంద్రమోదీ ఈనెల 26న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీమాంధ్రకు భారీ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి అనిల్ గోస్వామికి ఒక బ్లూ ప్రింట్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనిపైనే హోంశాఖ దృస్టి సారించింది.

No comments:

Post a Comment