Saturday 10 May 2014

ఇక్కడ మేం.. అక్కడ జగన్ - కేసిఆర్

ఇక్కడ మేం.. అక్కడ జగన్

Published at: 10-05-2014 04:19 AM
మా సీట్లు 70..80..90 కూడా దాటొచ్చు.. తొమ్మిదికిపైగా ఎంపీ స్థానాలు గెలుస్తాం
యూపీఏ అధికారంలోకి వస్తే మద్దతిస్తాం.. రాహుల్, సోనియాలను ఎప్పుడూ తిట్టలేదు
ఎన్డీయేకు మద్దతిచ్చేది లేదు... సీమాంధ్రకు జగనే సీఎం.. బాబుకు అధికారం కల్ల..
టీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయి: కేసీఆర్
'స్థానికం'లో మెజారిటీ రాని చోట్లా అధ్యక్ష స్థానాల కోసం క్యాంపులు.. శ్రేణులకు నిర్దేశం
హైదరాబాద్, మే 9 :తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని తామే సొంతంగా ఏర్పాటు చేస్తామని, టీఆర్ఎస్ ఖచ్చితంగా 60కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు చెప్పారు. 90 స్థానాలకు పైగా గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ, లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. తమ పార్టీ గెలుపు అవకాశాలు, కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశాలపై ఆయన స్పందించారు. కేంద్రంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి వస్తే..రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారంటే.. మొదట మద్దతు ఇచ్చేది తామేనని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత క్యాంపులు, కాకరకాయలు ఉండవని, ఆ ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు. ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారని, సంపూర్ణ మెజారిటీతో సొంతంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
'ఎనీ డౌట్' అంటూ విలేకరులను ప్రశ్నించారు. 60పైనే స్థానాలు గెలుస్తామని, 70, 80, 90 దాటినా అదేమీ వండర్ కాదని అన్నారు. జంటనగరాల్లోనూ గణనీయమైన సీట్లు గెలుచుకుంటామని, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాలను గెల్చుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. "ఖమ్మం జిల్లాలోనూ బోణీ కొట్టబోతున్నాం. ఒక స్థానాన్ని తప్పక గెలుస్తున్నాం. మరో మూడు స్థానాల్లో టైట్ ఫైట్ ఇచ్చాం. అందులో రెండు స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది. తొమ్మిదికి పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటాం. ఎక్కువ జడ్పీ, మున్సిపల్ పీఠాలు మావే'' అని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోసం ఎవరినీ సంప్రదించలేదని, అసలు ఆ అవసరమే లేదని పేర్కొన్నారు. ఈనెల 16 తర్వాత టీఆర్ఎస్ అధికార పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు."ఇంతకుముందు కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ స్థానాలు 23-35 మధ్య ఉంటాయని చెప్పాను. పోలింగ్ తర్వాత లోతైన పరిశీలన చేసి చెబుతున్నా. కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ స్థానాల సంఖ్య 30 లోపే ఉంటుంది. అంతకంటే ఇంకా తక్కువ స్థానాలే వస్తాయి'' అని కేసీఆర్ జోస్యం చెప్పారు.
చీరి చింతకు కడతరు..
కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్సేలేదని, ఆ పార్టీ నేతలు పగటికలలు కంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై విరుచుకుపడ్డారు. "పొన్నాల లక్ష్మయ్యా! పిచ్చి ప్రయత్నాలు మానుకో..మీ పని అయిపోయింది. ప్రజల తీర్పు కోసం ఎదురుచూసే సహనశీలత ఉండాలి. బిత్తర..గత్తర అవుడు ఎందుకు? ఈ కథలు..ఆ కథలు చెప్పడం విజ్ఞత అనిపించుకోదు'' అని అన్నారు. టీఆర్ఎస్‌కి చెందిన సుమారు 20 మంది అసెంబ్లీ గెలుపు గుర్రాలు తమతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల చేసిన వ్యాఖ్యలను విలేకరులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన భగ్గుమన్నారు. "ఆ పిచ్చి పనే వద్దంటున్నాను. అదేమన్నా నీతా ? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తాడా? పొన్నాల..టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడా? బ్రోకర్ పని చేస్తున్నాడా? వాటీజ్ దిస్..అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా ?..చీరి చింతకు కడతరు'' అని నిప్పులు చెరిగారు.
సీఎం నేనే అన్న ప్రశ్న వద్దు..
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎవరనేది టీఆర్ఎస్ఎల్పీ నిర్ణయిస్తుందని కేసీఆర్ చెప్పారు. "నేనే సీఎం అనే ప్రశ్న వద్దు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ శాసనసభాపక్షం సీఎంని ఎన్నుకుంటుంది. అది టీఆర్ఎస్ఎల్పీ హక్కు.'' అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే జూన్ 2న కాకుండా, 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉండాలని తాను ఎందుకు అంటున్నాననేది సన్నాసులకు అర్థం కాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇది అభ్యర్థుల మీద నమ్మకం, అపనమ్మకానికి సంబంధించిన విషయం కాదని, ఆ ప్రయత్నంలో ఉన్న ప్రాముఖ్యమేదో తనకే తెలుసునని అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ..హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధాని చేస్తామని చెబుతున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే తాను అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని కోరుతున్నానని వివరించారు. టీఆర్ఎస్ నిప్పులాంటి పార్టీ అని, దానిని ముట్టుకుంటే మాడి మసైపోతారని, దహించుకుపోతారని చెప్పారు.
ఇక్కడ మేం.. అక్కడ జగన్
సీమాంధ్రలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని, జగన్ సీఎం కాబోతున్నారని కేసీఆర్ చెప్పారు."నా సర్వే ప్రకారం అక్కడ వైసీపీ వందకు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుంది., ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. జగన్ ఏమైనా అంటరాని పదార్థమా? అని ప్రశ్నించారు. "పొరుగు రాష్ట్రానికి ఎవరు సీఎం అయితే వారిని గుర్తించాలి. ఇది అసాధారణ విషయమేమీ కాదు. నేను టీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాక స్పష్టంగా చెప్పాను..ఉద్యమం ప్రాసెస్ అయిపోయింది. రాజకీయంగా వ్యవహరిస్తామని.. ఇప్పుడు అదే చేస్తున్నాం.. చేస్తాం'' అని కేసీఆర్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా.. ఎప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని కేసీఆర్ ఎద్దేవా చేశారు. "అది.. గాన్ కేస్. దోబీకా కుత్తా.. నా ఘర్‌కా..నా ఘాట్‌కా (చాకలి వద్ద ఉండే కుక్క ఇటు ఇంటికి, అటు చాకిరేవుకు అక్కరకు రాదు).. పోలింగ్ తర్వాత సింగపూర్‌కు పోయిండట. తర్వాత ఇంకెక్కడికి పోతడో'' అని చంద్రబాబునుద్దేశించి వ్యంగ్యంగా అన్నారు.
ఆప్షన్లకు వ్యతిరేకం..
రెండు ప్రభుత్వాలు వచ్చే వరకు ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీ.. ఏ ఒక్కటీ ముందుకు సాగవని కేసీఆర్ అన్నారు. ఆప్షన్లకు తాము వ్యతిరేకమన్నారు. ఇప్పుడు సచివాలయంలో జరిగే పనులు తాత్కాలిక ప్రతిపాదనలు మాత్రమేనన్నారు. నిజమైన పంపిణీ రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాకే జరుగుతుందని చెప్పారు. "ఇది నేను ఉత్తగనే చెబుతలేను. సీఎస్ (చీఫ్ సెక్రెటరీ)తో మాట్లాడి చెబుతున్నా'' అని అన్నారు. "సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్, చంద్రబాబు ఇద్దరూ.. హైదరాబాద్‌లో ఒక్క క్షణం ఉండబోం. అని చెప్పడం నేను టీవీల్లో చూశాను. వాళ్లు అలా అంటున్నప్పుడు సమస్యనే ఉండదు. గవర్నర్‌పై ఉన్న బాధ్యత దృష్ట్యా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఉమ్మడి రాజధాని ఉండేది ఏడాదయినా, నాలుగేళ్లయినా రెండు ప్రభుత్వాల కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో పెట్టొద్దు. ఇది ఉద్యోగుల మధ్య అనవసర ఘర్షణలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక స్థానిక సంస్థల కౌంటింగ్ జరిపితే బాగుండేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదనంతరం చేపట్టాల్సిన చర్యల సమన్వయం కోసం పార్టీ తరఫున జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను నియమించినట్లు వెల్లడించారు.
రైతులను గవర్నర్ ఆదుకోవాలి..
వడగండ్లు, అకాల వర్షాల వల్ల తెలంగాణలో పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు తమ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు. అలాగే వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
సోనియా, రాహుల్‌కు వ్యతిరేకం కాదు
సోనియా, రాహుల్‌గాంధీ విషయంలో తనకు ఎటువంటి వ్యతిరేకతా లేదని కేసీఆర్ స్పష్టం చేశారు."సోనియాగాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఆన్ రికార్డు చెప్పాను. ఈ మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. సోనియాగాంధీపై నాకు జీవితాంతం కృతజ్ఞత ఉంటుంది. ప్రత్యేకించి సోనియా, రాహుల్ విషయంలో ఎలాంటి వ్యతిరేకతా లేదు. వారిద్దరిని నేనెప్పుడూ తిట్టలేదు. అందుకే కేంద్రంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని అవుతారంటే మా మద్దతు తప్పక ఉంటుంది. యూపీఏ అధికారంలోకి రాకపోతేనే, థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్తాం. ఎన్డీయేకు మద్దతిచ్చే ప్రశ్నే లేదు. అప్పుడు కాంగ్రెస్ కూడా థర్డ్ ఫ్రంట్‌కే మద్దతు ఇస్తుంది'' అని కేసీఆర్ చెప్పారు.
గజ్వేల్ లో 50 వేల మెజారిటీతో గెలుస్తా
తాను పోటీ చేసిన మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని కేసీఆర్ చెప్పారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. "ఒక్క ఉత్తర తెలంగాణలోనే 50 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో గెలిచే స్థానాలను కలుపుకొంటేనే అధికారం వస్తుంది. ఇక మిగిలిన జిల్లాల్లో గెలిచే సీట్లు మాకు బోనస్'' అని అన్నారు. టీడీపీ 7, బీజేపీ 2 అసెంబ్లీ సీట్లు గెలుస్తాయని, సీపీఐకి దక్కేది ఒకే ఒక అసెంబ్లీ స్థానమని చెప్పారు. ఓడిపోయే మంత్రుల జాబితాలో జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారని చెప్పారు.

No comments:

Post a Comment