Tuesday 27 May 2014

పోలవరం ముంపు ప్రాంతాల్ని ఏపీలో కలపడం సరికాదు : కేసీఆర్

పోలవరం ముంపు ప్రాంతాల్ని ఏపీలో కలపడం సరికాదు : కేసీఆర్

Published at: 27-05-2014 16:16 PM
న్యూ ఢిల్లీ, మే 27 : తెలంగాణ బిల్లుకు (గతంలో పాసైన బిల్లు) విరుద్ధంగా ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తనకు తెలిసిందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి హోంశాఖలో ఆర్డినెన్స్ తయారు చేస్తున్నట్లు కూడా తనకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులకు ఫోన్ చేసి ఇలా చేయడం సరికాదని తెలిపినట్లు కేసీఆర్ చెప్పారు.
మంగళవారం ఢిల్లీలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని మోదీ మొట్టమొదటి కేబినెట్‌లో తీసుకోవడం దారుణమని, ఇది మంచిదికాదని అన్నారు. చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఇప్పుడు అపాయింటెడ్ డే ఒక్కటే ఉందని అదికూడా జూన్ 2న ప్రకటన జరగనుందని, చట్టాన్ని మార్చాలంటే ఆర్టికల్ 3 ప్రకారం జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా చేసే చట్టం కాదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి తన మాటను మన్నిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బిల్లులో పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని కేంద్రం యత్నిస్తోందని, పొలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపొద్దని కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలంటే రెండు రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పొలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకంకాదని, ముంపు ప్రాంతాలు తగ్గించేలా డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ముంపును తగ్గించండి... నీళ్లను తీసుకువెళ్లండని ఆయన అన్నారు.
దేశంలో 11 భూకంప ప్రమాదాల్లో పొలవరం రెండోదని కేసీఆర్ తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దూకుడుగా వెళ్లి ఆర్డినెన్స్ తెస్తే ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వార్‌రూమ్‌కు వస్తే స్వాగతిస్తామని కేసీఆర్ అన్నారు.

No comments:

Post a Comment