Saturday 10 May 2014

ఈ భూమి మీదిరో...!

ఈ భూమి మీదిరో...!

Published at: 11-05-2014 03:57 AM
పన్నేండేళ్లకుపైగా స్వాధీనంలో ఉంటే ఆక్రమణదారుకే హక్కు
మార్కెట్ ధరతో లావణి పట్టా పొందితే విక్రయ హక్కు
యాజమాన్య పత్రమున్న రక్షిత కౌలుదారే యజమాని
ఆర్ఎస్ఆర్‌లో చుక్కలున్నంత మాత్రాన ప్రభుత్వ భూమి కాబోదు
తేల్చిచెప్పిన హైకోర్టు..మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): నిర్దేశిత పత్రాలు లేకపోయినా పన్నెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం స్వాధీనంలో ఉంచుకున్న భూమిపై ఆక్రమణదారులకే హక్కు సంక్రమిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూములపై బహుళ విక్రయ లావాదేవీలున్నా యాజమాన్య హక్కులు ఉంటాయని జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి తన 127 పేజీల తీర్పులో వివరించారు. రికార్డులలో పట్టాదారు పేరు ఎందుకు లేదో ప్రభుత్వమే చెప్పాలని, పట్టా లేకపోతేనే రికార్డులను ఆధారం చేసుకోవాలని సూచించారు. మార్కెట్ విలువ చెల్లించి లావణి పట్టా పొందిన వ్యక్తికి పూర్తి విక్రయ హక్కులుంటాయని వివరించారు. అలాగే 1954 జూన్ 18కి ముందు ఆంధ్రలో, 1958 జూలై 25కు ముందు తెలంగాణలో పొందిన అసైన్డ్ భూములపైనా యజమానులకు విక్రయ హక్కులుంటాయని స్పష్టం చేశారు. పట్టాలున్నా రికార్డులలో పేర్లు లేవంటూ ప్రభుత్వం తమకు యాజమాన్య హక్కు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వివిధ జిల్లాల రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు తీర్పు ప్రకటించారు. కాలానుగుణంగా భూ యజమాన్య హక్కులు చేతులు మారుతున్నా తదనుగుణంగా రికార్డుల్లో నమోదు చేయాల్సిన బాధ్యతను అధికారులు నిర్లక్ష్యం చేశారని తేల్చారు. కాబట్టి ఆ నెపంతో హక్కులు తిరస్కరించరాదని విశదీకరించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి...
8 రెవెన్యూ నిబంధనల్లోని 1(ఎ), (బి)ల ప్రకారం బోర్డు స్టాండింగ్ ఆర్డర్ (బిఎస్‌వో) 27 మేరకు జారీ అయిన పట్టాలకు పూర్తి యాజమాన్య హక్కులుంటాయి. అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధిత) చట్టం 1977 సెక్షన్ 2(1) కింద అధికారులు నిర్ధారించకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. ఎస్టేట్, ఈనాం భూముల విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, రైత్వారీ పట్టాలు యాజమాన్య హక్కులు కల్పిస్తాయి. రికార్డుల ఏకీకరణకు ముందు తెలంగాణలో పహాణీ పత్రిక, ఛౌపాస్లా, ఫైసల్ పట్టీ, కాస్రా పహాణీలు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ (ఆర్ఓఆర్) హక్కుల నిర్ధారణకు ఆధారం. ఆంధ్రాలో అకౌంట్ నం. 1, 2 (విలేజ్ అకౌంట్లు పాతవి), అకౌంట్ నం. 3, 10 ఆధారం. గ్రామ ఖాతాల్లో వివరాల నమోదుకు ఆంధ్రాలో ఎ-రిజిస్టర్/డైగ్లాట్, లెడ్జర్/చిట్టా... తెలంగాణలో సేత్వార్, అనుబంధ సేత్వార్, వసూల్‌బాకీ రిజిస్టర్లు ప్రాథమికంగా ఆధారం. గ్రామఖాతాల ఏకీకరణ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం-1971 కింద ముద్రించిన ఎ-రిజిస్టర్/డైగ్లాట్, అకౌంట్ నం. 1, 2, రిజిస్టర్-3, విలేజ్ అకౌంట్ 4, ఆర్‌వోఆర్ తగిన ఆధారాలు. రెవెన్యూ రికార్డులపైనే ఆధారపడుతుంటే ఎ-రిజిస్టర్/డైగ్లాట్‌లో పేరున్న వ్యక్తి నుంచి కొనుగోలు చేసినవారే యజమాని. ఇలాంటి వివాదాల్లో అధికారులు, సివిల్ కోర్టులు తగు జాగ్రత్త వహించాలి. అసెస్డ్, అన్ అసెస్డ్ భూములన్నీ ప్రభుత్వానికి కావు. వాటిపై ఎవరైనా హక్కులు కోరుతుంటే ఆర్ఎస్ఆర్‌లో వివరాలు సరిపోలవు. ఇలాంటి వివాదాల పరిష్కారానికి రెవెన్యూ రికార్డులన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, పోరంబోకు, సామాజిక ప్రయోజనాలకోసం నిర్దేశించిన భూములన్నీ ప్రభుత్వానివే.
8 పన్నెండేళ్లు, అంతకుమించి ఆక్రమణలో ఉన్న పట్టాలేని భూమిపై బిఎస్‌వో-31లోని పేరా 7 ప్రకారం తమ పేరున బదలాయింపు కోరే హక్కు సదరు వ్యక్తికి ఉంటుంది. ఆ భూమిపై బహుళ విక్రయ లావాదేవీలుంటే యాజమాన్య హక్కు సంక్రమించినట్లే. ఇలాంటి భూమిపై వివాదాలుంటే నిరూపించుకునే బాధ్యత ప్రభుత్వం/ప్రత్యర్థి వర్గానిదే. చట్ట ప్రకారం కొన్న భూములపైనా ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేట్లయితే అందుకు ఆధారాలు చూపాలి.
8 రీ సర్వే, ఆర్ఎస్ఆర్‌లలో చాలా సందర్భాల్లో.. పట్టాదారు/ఈనాం దారు కాలమ్స్‌లో చుక్కలు (...) పెట్టడం లేదా ఖాళీగా ఉంచడం పరిపాటిగా ఉంది. కాబట్టి ఆర్ఎస్ఆర్ ఒక్కటే ఆధారం చేసుకుని (ఎ) యాజమాన్య హక్కు నిర్ధారించరాదు. అందుకు అవసరమయ్యే పత్రాలలో ఒకటిగా మాత్రమే దాన్ని పరిగణించాలి. (బి) ఆర్ఎస్ఆర్‌లోని వివరాల్లో ప్రభుత్వ భూమిగా చూపినంతమాత్రాన అది పట్టా భూమి కాదని భావించరాదు. ఈనాం భూమి కాదని మాత్రమే పరిగణించాలి. (
8 ఆర్ఎస్ఆర్‌లో చుక్కలు (...) లేదా ఖాళీ ఉన్నంతమాత్రాన అది ప్రభుత్వ భూమి కాజాలదు. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971కి ముందు, ఆ తర్వాత జారీచేసిన పట్టాల ఆధారంగా యాజమాన్య హక్కులు కోరవచ్చు. దీనిపై విభేదించేట్లయితే ప్రభుత్వమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి. టౌన్ సర్వే లాండ్ రిజిస్టర్ (టీఎస్ఎల్ఆర్)లోని వివరాలు యాజమాన్య హక్కుల నిర్ధారణకు ప్రామాణికం కాదు.
8 సముద్ర తీరాలు, పబ్లిక్ రోడ్లు, వీధులు, వంతెనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో యాజమాన్య హక్కుల కోసం వివాదాల్లో అట్టి వ్యక్తులపై భూ ఆక్రమణల చట్టం 1905 కింద ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదు. ప్రభుత్వమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి.

No comments:

Post a Comment