Wednesday 21 May 2014

కొత్త రాజధానిగా విజయవాడ

కొత్త రాజధానిగా విజయవాడ - టి. కొండబాబు

Published at: 22-05-2014 08:00 AM
రాజధాని నగరానికి ప్రథమ ప్రాతిపదిక రాష్ట్రంలోని అన్ని వైపులకూ సమాన దూరంలో రాష్ట్రం మధ్యలో ఉండటం. అన్ని ప్రధాన ప్రాంతాలకూ అత్యధిక రవాణా మార్గాలు, రవాణా సదుపాయాలు కలిగి ఉండటం రెండోది. మూడోది నీటి కొరత లేకపోవటం... ఈ ప్రమాణాల రీత్యా చూసినపుడు రాష్ట్ర నడిబొడ్డున నేటి కాలానికి తగిన అన్ని మౌలిక వసతులనూ కలిగి ఉన్న రాష్ట్రంలోని రెండో పెద్ద నగరం విజయవాడ... రాజధానికి ఇక్కడ గల అనుకూలతలు ఖచ్చితంగా అద్వితీయం.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, రాష్ట్ర విభజన వ్యవహారాలూ కొలిక్కి వస్తున్నాయి. జూన్ 2వ తేదీని అపాయింట్ డేట్‌గా ప్రకటించినప్పటికీ అది జూన్ 26కు మారే అవకాశం ఉందంటున్నారు. కొబ్బరికాయను పగలగొడితే, అందులోని కొబ్బరి, నీళ్ల పరిమాణంలో తేడా రాదు కానీ మొలకెత్తే అవకాశాన్ని కోల్పోతుంది. అది చెట్టుగా మారలేదు. తెలుగురాష్ట్రం రెండు ముక్కలయినట్లు చెపుతున్న కొందరు రాష్ట్ర విభజనను కొబ్బరికాయను పగులగొట్టినట్లుగా, అభివృద్ధి ఆగిపోయినట్లుగానే ఇప్పటికీ చెబుతున్నారు. ఆంధ్రసీమ (ఆంధ్రప్రదేశ్) ప్రాంతంలో విద్య, ఉద్యోగాలు భ్రమే అంటున్నారు. రాష్ట్ర విభజనను ఒక కొబ్బరి మొక్క కుదురులోని పిలకను వేరు చేసి విడిగా మొలేసినట్లుగా భావిస్తే ఈ భయాలన్నీ పటాపంచలవుతాయి.
భవిష్యత్‌ను సరిగ్గా అంచనా వేస్తే కల్పవృక్షంగా ఎదుగుతుందని చెప్పగలము. కొబ్బరి చెట్టును మన ఆంధ్రులు (జాతి వాచకం) కల్పవృక్షమనే అంటారు. ముఖ్యంగా ఆంధ్రసీమ ఎదిగి తీరుతుంది. కాకపోతే ఉమ్మడి కుదురు మొక్కతో సమానంగా ఎదగాలంటే పిలకకు తగిన ఎరువులు, నీరూ సమృద్ధిగా అవసరమని గుర్తించాలి. ఆ స్థాయిలో ఆర్థిక మద్దతు ఇవ్వాలి. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కాబోతున్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇప్పటికే ఈ విషయమై కాబోతున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి హామీ పొంది ఉన్నారు. ఎన్నికల హామీగా ప్రజల సమక్షంలోనూ మోదీతో ప్రకటింపజేశారు. అంటే ఇపుడు అందరూ పునర్నిర్మాణం గురించే ఆలోచించాలి. నిర్మాణాత్మక ఆలోచనకు రావాలి. అయితే ఇప్పుడు తక్షణ అంశంగా రాజధాని ఎక్కడ? అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనిని అంతర్గత వివాదంగా మారుస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పొరబాటు ఇప్పుడు జరగకూడదని, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా వికేంద్రీకరించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను విస్తృత పరచాలని ఎక్కువ మంది చెప్పడం సానుకూలమైన అంశం.
ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం నగరాన్ని ఉత్తరాంధ్రవారు రాజధానిగా సూచిస్తుండగా రాయలసీమవాసులు కొందరు గతంలో తమ ప్రాంతానికి రిజర్వ్ అయిన రాజధానిని త్యాగం చేసినందుకు కర్నూలును తిరిగి రాజధాని చేయాలని, ఇంకొందరు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి బెటరని అంటున్నారు. వాస్తవానికి విశాఖకు రాజధాని స్థాయి ఇప్పటికే ఉంది. అయితే రాష్ట్రానికి ఓ మూలనున్న ఈ నగరం దక్షిణాంధ్ర, రాయలసీమ వాసులకు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో వుంది. సామాన్యుల రాకపోకలకు అనువు కాదు. పైగా నీటి సమస్యా ఉంది. ఇక కర్నూలు, తిరుపతి పట్టణాలూ ఓ మూలగానే ఉన్నాయి. ఇవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వారికి దూరం. పైగా తిరుపతిపై ఇప్పటికే లక్షలాది యాత్రీకుల ఒత్తిడి ఉంది. కర్నూలుకు తుంగభద్ర వరద ముప్పు ఉంది. ఇక ఈ అంశాన్ని 'సమస్య'గా చూస్తున్న పరిష్కారవాదులేమో రాయలసీమకు, కోస్తాంధ్రకు మధ్య ప్రాంతంలో ప్రకాశం జిల్లా దొనకొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ లేదా పులిచింతలలో 50వేలు నుంచి లక్షల ఎకరాల వరకు భూములు సేకరించి రాజధానిగా కొత్త నగరాన్ని నిర్మించాలంటున్నారు. ఇందుకు అటవీ ప్రాంతాన్ని ఢీ నోటిఫై చేయాలంటున్నారు. మరికొందరు ఇదే ఫార్ములాతో లక్షల జనాభాకు సరిపడా రాజధాని నగర నిర్మాణం జరిపి, దానిపై జనాభా ఒత్తిడి పడకుండా చూడాలంటున్నారు. ఈ ప్రతిపాదనలేమి శాస్త్రీయం కావు. పైగా ఆచరణాత్మకం కావు. భావి సమస్యలు తొలగించేవి అసలే కావు. కొత్త సమస్యలు పుట్టిస్తూ ఆర్థిక భారం మోపేవి. రాజధానిపై ఒత్తిడి పడకుండా చూద్దాం సరే, దానికి కొత్త నగరమెందుకు? ఉన్న నగరాలను అందుకు అనువుగా మార్చుకోలేమా? పైగా అందుకు లక్షల ఎకరాల అడవులను ధ్వంసం చేయడమెందుకు? పైగా పరిశ్రమల వంటి ఉత్పాదక అవసరాల కోసం కూడా కాదాయె! ఈ కొత్త నగరంలో నివసించే ఆ 5 లక్షల మంది ఎవరు? ఏ వర్గం వారు? ఈ కొత్త నగరానికి హైవేలను, రైల్వే మార్గాలను మళ్లించగలమా? రాజధాని నగర నిర్మాణం పేరుతో వెచ్చించే లక్షల ఎకరాలు, లక్షల కోట్లు పరిశ్రమలు, మౌలిక వసతుల కోసం వెచ్చించడం మేలు కదా!
వాస్తవికంగా చూస్తే రాజధానికి కేవలం 400 నుంచి వెయ్యి రెండు వేల ఎకరాల భూమి ఉంటే చాలు. అసలు రాజధాని అంటే ఏమిటి? అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, హైకోర్టు, డీజీపీ ఆఫీస్ వంటి పాలక సదుపాయాలు; సభలూ సమావేశాల కోసం ఐదు ఆరు పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, బహిరంగ సభలు, ప్రజావేదికల కోసం నాలుగు ఐదు పెద్ద మైదానాలు. ఇవి ఉంటే రాజధాని ఉన్నట్లే!
రాజధాని నగరానికి ప్రథమ ప్రాతిపదిక రాష్ట్రంలోని అన్ని వైపులకూ సమాన దూరంలో రాష్ట్రం మధ్యలో ఉండటం. అన్ని ప్రధాన ప్రాంతాలకూ అత్యధిక రవాణా మార్గాలు, రవాణా సదుపాయాలు కలిగి ఉండటం రెండోది. మూడోది నీటి కొరత లేకపోవటం. కేంద్ర కమిటీ ప్రధాన ప్రమాణాలు ఇవే! రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భాషాసంస్కృతులకు వెసులుబాటుగా, అందరినీ ఇముడ్చుకునే సౌజన్యం కలిగి ఉండటం అత్యున్నత అదనపు ప్రమాణం. ఈ శాస్త్రీయ ప్రాతిపదికలతో రాజధానిపై సులభంగా నిర్ణయానికి రాగలం. ఇక పారిశ్రామిక మౌలిక వసతులు, పరిశ్రమలనూ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం, ప్రతిజిల్లాలో అక్కడ ఉన్న వనరులు, అవసరాలను బట్టి ఎక్కడ అనువైనవి అక్కడ ఏర్పాటు చేయడాలి. దీంతో రాజధానితో సమానంగా మిగతా జిల్లాలు, నగరాలు అభివృద్ధవుతాయి. పల్లెల నుంచి నగరాలను వలసలు లేకుండా పల్లెలే క్రమంగా నగరీకరణ చెందుతాయి. మనవారు ఎక్కడికో ఉపాధికి పోవలసిన అవసరమూ ఉండదు. పెద్ద నగరాలపై ఒత్తిడి పడదు. రాజధాని అనగానే రాజు గారి కిరీటంగా చూడకూడదు. అది రాష్ట్ర పరిపాలనా కేంద్రం మాత్రమే. ఈ ప్రమాణాలరీత్యా చూసినపుడు రాష్ట్ర నడిబొడ్డున నేటి కాలానికి తగిన అన్ని మౌలిక వసతులనూ కలిగి ఉన్న రాష్ట్రంలోని రెండో పెద్ద నగరం విజయవాడ. 'పెద్ద' అనే విషయాన్ని పక్కన పెడితే, భౌగోళికంగా ఖచ్చితంగా మధ్యలో ఉన్నందునో, నదీ తీర ప్రాంతమయినందునో ఏమో గానీ ఆధునిక భారతదేశంలో ఇది తొలినుంచీ చైతన్యవంతమైన ప్రాంతం. తెలుగు నాట తొలి నుంచీ పత్రికలు, ప్రసార సాధనాలతోనూ; జాతీయస్థాయి రాజకీయ కార్యకలాపాలతోనూ అన్ని ప్రాంతాలవారికి అనుసంధానమై, సంస్కృతీ సంప్రదాయాలు, భాషాసాహిత్యాల పరంగానూ అందరినీ కలుపుకుంటూ ఉంది.
ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర (సీమ)లకు సమాన దూరంలో ఉన్న నడిగడ్డ ఇది. గుంటూరు, ఏలూరు, మచిలీపట్నంను మమేకం చేసుకుంటున్న నగరం. రాజధానికి ఇక్కడ గల అనుకూలతలు ఖచ్చితంగా అద్వితీయం. ఇంతక్రితం మనం చెప్పుకున్న ప్రాతిపదికలను పరిగణలోనికి తీసుకుంటే, అత్యధిక రైల్వే లైన్లను కలిపే దేశంలో రెండో అతి పెద్ద, దక్షిణాదిలోనే నెం.1 జంక్షన్ ఇది. పక్కనే 30కి.మీ దూరంలో ఉన్న గుంటూరు మరో జంట జంక్షన్. విజయవాడకు రైల్వేజోన్ రానుంది. ఏర్పాటవుతున్న దానితో కలిపి ప్రధానమైన నాలుగు జాతీయరహదార్లు, రెండు కోస్తా రహదార్లు నగరం మీదుగా వెళుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా రోజుకు 2,700 బస్సు సర్వీసులు నడిచే ఆసియాలో రెండో పెద్ద బస్‌స్టేషన్ గల నగరమిది. ఇప్పటికే ఉన్న కృష్ణా బ్యారేజ్ రిజర్వాయర్‌కు కొత్తగా ఎగువన పులిచింతల ప్రాజెక్టు, ఇక్కడే కలిసే 43 టీఎంసీల గోదావరి నీటి పోలవరం కాల్వ కలిసి అత్యున్నత జలనిధి ఇది. ఇక అంతర్జాతీయ స్థాయి విస్తరిస్తున్న గన్నవరం విమానాశ్రయం ఉంది. రాష్ట్రంలోనే ఏకైక 'ఎయిర్ కోస్తా' విమానయానసంస్థ కేంద్ర స్థానమూ ఇక్కడే. గంట ప్రయాణ దూరంలోనూ రెండుపోర్టులు.. బందరు పోర్టు, నిర్మించబోయే నిజాం పోర్టు ఉన్నాయి. ప్రతిపాదిత నర్సాపురం పోర్టు, వాడరేవు పోర్టు రెండు గంటల ప్రయాణ దూరంలోకి వస్తాయి. ఇక ఇంతక్రితం చెప్పుకున్న 'రాజధాని భవనాల' నిర్మాణాల కోసం 40వేల ఎకరాల వరకూ భూములున్నాయి. నగరంలో 60:40 ప్రకారం సేకరిస్తే నున్న సూర ంపల్లి, గొల్లపూడి, కుంచనపల్లి, తాడేపల్లి, మంగళగిరిలలో 10వేల ఎకరాలు; ప్రభుత్వ భూములయితే పక్కనే మంగళగిరి, హనుమాన్ జంక్షన్, చినకాకాని వద్ద 5వేల ఎకరాలున్నాయి. ఇందుకోసం నగరాన్ని తొలుత పరిటాల, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, నున్న, వెదురుపావులూరు, గన్నవరం; చోడవరం, ఉయ్యూరు; అమరావతి, లింగాయపాలెం, తాడేపల్లి, చిర్రావూరు; మంగళగిరి, నంబూరు, చిన్నకాకాని వంటి శివారు ప్రాంతాల వరకూ విస్తరించాలి.
నగరంలో అంతర్గత రవాణాకు 550 సిటీ బస్సులుండగా, గుంటూరుకు, తెనాలికి డీఎంయూ లోకల్ ట్రైన్లు ఉన్నాయి. వీటిని రేపల్లె-నిజాంపట్నం, బందర్, గుడివాడ, ఏలూరులకు పొడిగించే ప్రతిపాదన ఉంది. తర్వాతి దశలో నూజివీడుతో సహా మెట్రో రైల్ ఏర్పటైతే సరి. బందరులో మెరైన్ అకాడమీ, మంగళగిరి రైఫిల్ రేంజ్, నాగాయలంక వద్ద గొల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం, గుంటూరులో జాతీయ విపత్తుల నివారణ కేంద్రం ఏర్పాటవుతున్నందున ఇవన్నీ ఈ తీర ప్రాంతాన్ని, రాజధానిని అన్ని విధాలా (ప్రకృతి నుంచి, శత్రు భయం నుంచి) రక్షించగలవు. కొండపల్లి, నూజివీడు, ముసునూరు, మంగళగిరి అటవీ ప్రాంతాలు కాలుష్యాన్ని సమతుల్యం చేయడానికి అనువుగా ఉంటాయి. విజయవాడలో ఐటి, ఆటోమొబైల్ పరిశ్రమలు, విద్యా కేంద్రాలు ఉంటే చాలు. ప్రకాశం బ్యారేజ్‌ను సెంటర్‌గా అనుకుంటే ఎటు చూసినా 20-30 కిలోమీటర్ల లోపు పరిశ్రమలు లేకుండా ఉంటాయి. నగరంలో జనాభా ఒత్తిడి లేకుండా ఉంటుంది. కాలుష్యం ఉండదు. ఇక శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలలో భారీ పరిశ్రమలు కల్పించాలి. అవకాశం ఉన్న ప్రతిచోటా పోర్టులు, షిప్పింగ్ యార్డులు, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మించాలి. గతంలో చేసినట్లు వేలకొద్దీ ఎకరాలు కాక పరిశ్రమలకు భూముల కేటాయింపులో శాస్త్రీయ విధానం ఉండాలి. ఏమైనా నవ్యాంధ్రకు రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తే విజయాంధ్రకు మార్గం సుగమం కాగలదనడంలో ఎటువంటి సందేహం లేదు.
n టి. కొండబాబు
సీనియర్ జర్నలిస్ట్

No comments:

Post a Comment