Friday 30 May 2014

పొగాకు వ్యాధుల చికిత్సకు లక్ష కోట్ల ఖర్చు

Published at: 30-05-2014 05:01 AM
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల వాడకం, తద్వారా వచ్చే వ్యాధుల చికిత్స కోసం భారీ మొత్తాలను వెచ్చించాల్సి వస్తోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధుల చికిత్స కోసం 2011లో ఆర్థిక వ్యవస్థపై పడిన భారం 1.04 లక్షల కోట్లు. ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రజారోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా వ్యయం చేసే మొత్తానికి ఇది చాలా ఎక్కువ. ఓ వైపు వ్యాధి చికిత్స కోసం భారీ మొత్తాలను వెచ్చించడం.. మరోవైపు ఉత్పాదక శక్తి తగ్గిపోవడం.. రెండూ భారత్‌కు పెనుభారంగా పరిణమించాయి. ఈ మేరకు ఈ నెల 31 (శనివారం)న పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు సంబంధిత వ్యాధులు- భారత ఆర్థిక వ్యవస్థపై వాటి భారం పేరుతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఓ నివేదిక వెల్లడించారు. పొగాకు వినియోగం వల్ల దేశ ఆర్థిక, ఉత్పాదక రంగాలపై పడే భారాన్ని ఇందులో వివరించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల తలెత్తే శ్వాసకోస సంబంధిత వ్యాధులు, క్షయ, హృద్రోగాలతో పాటు వివిధ రకాల కేన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఆయా వ్యాధుల చికిత్సకు వైద్య సహాయం, మందులపై వెచ్చించే మొత్తం 16800 కోట్లు కాగా, రోగ వ్యాప్తిని అరికట్టేందుకు పరోక్షంగా 14700 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందని నిపుణులు పేర్కొన్నారు. అదేసమయంలో అకాల మరణాల కారణంగా అయ్యే వ్యయం 73 వేల కోట్లని తెలిపారు. ఈ మొత్తాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 1.16 శాతం కాగా, 2011లో ప్రజారోగ్య సంరక్షణ కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన మొత్తానికి 12 శాతం ఎక్కువ. దేశ ఆర్థిక, ఉత్పాదక రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతూ దేశ పురోభివృద్ధికి ఆటంకం కలిగిస్తోన్న పొగాకు వినియోగాన్ని దూరం చేసుకునేలా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. దీనికోసం అన్ని రంగాల ప్రజలు సంఘటితమై పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారికి దాని వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి ఆ అలవాటు నుంచి తప్పించాలని అన్నారు.

No comments:

Post a Comment