Wednesday 28 May 2014

ముస్లింలు మైనారిటీలు కారు

ముస్లింలు మైనారిటీలు కారు

Published at: 28-05-2014 05:41 AM
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 13.4 శాతమున్న ముస్లింలు మైనారిటీలు ఎలా అవుతారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ప్రశ్నించారు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలే నిజమైన మైనారిటీలని ఆమె వ్యాఖ్యానించారు. మైనారిటీ వ్యవహారాల శాఖ అంటే ముస్లింలకు ఒక్కరికే సంబంధించిన శాఖ కాదని మొత్తం మైనారిటీ వర్గాల అభివృద్ధికి కృషిచేసే శాఖ అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పించడమనేది ముస్లింల అభివృద్ధికి పరిష్కారం కాదని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను మెరుగుపరచడంపై ప్రత్యేకదృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. తాము ముస్లింలకు రిజర్వేషన్లిస్తామని ఎప్పుడూ చెప్పలేదని.. అది కాంగ్రెస్ ప్రభుత్వమిచ్చిన హామీ అని చెప్పారు. రిజర్వేషనల్లేవి ముస్లింల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని వ్యాఖ్యానించారు. మైనారిటీల ఆర్థిక, సాంఘిక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముస్లింల అభివృద్ధికోసం ఏం చర్యలు తీసుకుంటారన్న విలేకరుల ప్రశ్నకు హెప్తుల్లా సూటిగా సమాధానమిచ్చారు. "ముస్లింలకు మాత్రమే ఎందుకు? ఇది ముస్లింల సంక్షేమ శాఖ కాదు. అన్ని రకాల మైనారిటీల సంక్షేమ శాఖ ఇది''అని తేల్చి చెప్పారు. అసలు ముస్లింలు మైనారిటీలేకాదని హెప్తుల్లా తేల్చి చెప్పారు." 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 13.80 కోట్ల మంది ముస్లింలున్నారు. ఇది దేశ జనాభాలో 13.4శాతం. మరి అటువంటప్పుడు ముస్లింలు ఎలా మైనారిటీలు అవుతారు. అసలు ప్రస్తుతం పార్శీలు మైనారిటీలు. వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అటువంటి వారికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి'' అని హెప్తుల్లా అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సూచనలను అమలు చేస్తారా అన్న ప్రశ్నకు ఆ కమిటీ సూచించిన అన్ని సూచనలూ అమలు చేయాలని ఏమీ లేదని స్పష్టంచేశారు.

No comments:

Post a Comment