|
ఇతర మతాలవారు ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ
ఈ దేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్ తల్లిదండ్రులే పిల్లల మతాన్ని మార్చేస్తున్నారు అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామే ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్‌వాపసీ ఆరెస్సెస్ వాళ్లూ వినండి.. మీరే వాపస్ రండి భారతదేశం మా తాతముత్తాతల గడ్డ: అసద్ భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని.. ముస్లింలు, క్రైస్తవులు ఘర్‌వాపసీలో భాగంగా హిందూమతంలోకి రావాలని ఆరెస్సెస్, వీహెచ్‌పీ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బదులిచ్చారు. ‘ఆరెస్సెస్ వాళ్లూ వినండి..’ అని పేరు పెట్టి ప్రస్తావించి మరీ సమాధానమిచ్చారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతో ముస్లింలేనని, ఇతర మతాల వాళ్లంతా ఇస్లాంను ఆశ్రయించడమే అసలైన ఘర్ వాపసీ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్, జనవరి 5: సెగలు పుట్టిస్తున్న ‘ఘర్‌వాపసీ’ వివాదానికి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘(మతం మార్చుకున్న) ముస్లింలకు రూ.5 లక్షలు.. క్రైస్తవులకు రూ.2లక్షలు ఇస్తారా? ఐదు లక్షలు కాదు.. ఐదు కోట్లు కాదు.. ఐదువేల కోట్లు కాదు.. ఐదు వందల కోట్ల డాలర్లు కాదు.. ప్రపంచంలో ఉన్న సంపదనంతా తెచ్చి మన కాళ్ల మీద పడేసినా అప్పుడు కూడా మనం ఇస్లాంను వదిలిపెట్టం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ.. వినండి ఆరెస్సెస్ వాళ్లల్లారా.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. పరిస్థితులు, వారి తల్లిదండ్రులు వారిని ఇతర మతాల్లోకి మారుస్తారు. అది మీ ఇష్టం. మీ విశ్వాసం ఏదైనాగానీ.. మా విశ్వాసం ప్రకారం ప్రతి ఒక్కరూ ముస్లింగానే పుడతారు. మీరే రండి వాపస్’’ అన్నారు. తమ విశ్వాసం ప్రకారం ప్రపంచంలోని అన్ని మతాలకూ అసలైన ఇల్లు ఇస్లామేనని.. ఇస్లాంలో బలవంతపు మతమార్పిడులు ఉండవని అన్నారు. అన్ని మతాలకు చెందినవారినీ మళ్లీ ఇస్లాంలోకి ఆహ్వానిస్తున్నామని, అయితే ఇందులో బలవంతం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. ‘‘తిరిగొస్తే మేం మీకేం పైసలివ్వం. ఇవ్వడానికి మా దగ్గరేం లేవు. కానీ, ఆ తర్వాతి కాలంలో మీరు ప్రపంచాన్నే జయిస్తామన్న గ్యారెంటీ మాత్రం ఇస్తాం. రండి’’ అన్నారు. ఇతర మతాలవారందరూ ఇస్లాంను ఆశ్రయించినప్పుడు మాత్రమే అసలైన ఘర్‌వాపసీ జరిగినట్టని పేర్కొన్నారు. అల్లా పంపితే ఆదం హిందుస్థాన్‌కు వచ్చారని.. ఇది తమ తాతముత్తాతల గడ్డ అని, మొత్తం దేశమే తమదైనప్పుడు తాము ఎవరి ఇంటికి తిరిగి రావాలని వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకు కోసమే ఒవైసీ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మజీద్ మెమన్ అన్నారు. హిందూ, ముస్లిం ఛాందసవాదులు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారని, ఇలాంటి వారి వ్యాఖ్యలు యావద్దేశానికీ హాని చేస్తాయని జేడీ(యు) నేత అలీ అన్వర్ అన్నారు. అసదుద్దీన్ ఒవైసీని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియాలకు ముస్లిం ప్రతిరూపమంటూ జేడీ(యు)కే చెందిన మరో నేత కేసీ త్యాగి అభివర్ణించారు. ఒవైసీ, ఆయనలాంటి వారు చేసే వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంమీద నమ్మకం ఉన్నవారెవరూ లక్ష్యపెట్టరాదని సీపీఐ నేత అతుల్ అంజాన్ అన్నారు. ఇక ఆరెస్సెస్, ఎంఐఎం నేతలను ఒకే గదిలో పెట్టి తాళం వేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. కాగా... తన వ్యాఖ్యలపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో అసదుద్దీన్ వివరణ ఇచ్చారు. మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఉత్సవంలో తాను ఆ మాటలు చెప్పానని, మొత్తం గంటన్నర ప్రసంగంలో ఇంకా చాలా విషయాలతోపాటు అదీ చెప్పానని పేర్కొన్నా రు. ప్రజాస్వామ్యంలో తన అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు తనకూ ఉందని, అవతలివాళ్లు నమ్మొచ్చు లేదా నమ్మకపోవచ్చని వ్యాఖ్యానించారు. |
No comments:
Post a Comment