Thursday, 29 January 2015

ముదురుతున్న ‘లౌకిక’ వివాదం

ముదురుతున్న ‘లౌకిక’ వివాదం
  ప్రకటనలో లౌకిక పదాల తొలగింపుపై విపక్షాల మండిపాటు
 శివసేన ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నిప్పులు

న్యూఢిల్లీ, జనవరి 29: లౌకికవాదం.. వివాదం రోజురోజుకూ ముదురుతోంది! కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన వాణిజ్య ప్రకటన కారణంగా మొదలైన ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. దీనికి మూలం.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ శాఖ జారీ చేసిన ప్రకటనలో రాజ్యాంగ పీఠిక ఉన్న పేజీని అంతర్‌చిత్రంగా(వాటర్‌మార్క్‌డ్‌) ముద్రించడం. అది రాజ్యాంగం అసలు ప్రతిలోని పత్రం కావడంతో దాంట్లో సామ్యవాద, లౌకిక అనే పదాలు లేకపోవడంతో కాంగ్రెస్‌ సహా దేశంలోని పలు పార్టీలు కేంద్ర సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించాయి. వారి విమర్శలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ స్పందించారు. ‘‘ 1976లో చేసిన సవరణ(42)కు ముందు ఉన్న పీఠికను పొరపాటున తీసుకోవడం వల్లే ఇలా జరిగింద’’ని ఆయన వివరణ ఇవ్వడంతో వివాదం కొంత సద్దుమణిగినట్టయింది. కానీ, ఇంతలోనే.. కేంద్ర ప్రకటనలో ఆ రెండు పదాలూ లేకపోవడం ఎంతమాత్రం వివాదాస్పదం కాదని, నిజానికి అది దేశ ప్రజలందరి కోరిక అని.. సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద అనే పదాలను పూర్తిగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదానికి తిరిగి ఆజ్యం పోసినట్టయింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా.. ఈ వివాదంపై చర్చ జరగాలని వ్యాఖ్యానించడంతో అది మరింత రగిలింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాలన్న వాదనపై కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ 2012 ఏప్రిల్‌లో ఇదే ప్రకటన ఇచ్చిందని, అప్పుడు ఆ పార్టీకి లౌకికవాదం గుర్తురాలేదా? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇక, ఈ రెండు పదాలనూ పీఠిక నుంచి తొలగించాలన్న శివసేన ఎంపీ డిమాండ్‌పై బీహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ, మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన పట్టాళి మక్కల్‌ కట్చి (పీఎంకే) సైతం సంజయ్‌రౌత్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ విషయంలో కేంద్రాన్ని సమర్థిస్తున్న వారు మాత్రం.. రాజ్యాంగం అసలు ప్రతిలోని పీఠికలో ఈ రెండు పదాలూ లేవని, ఎమర్జెన్సీ చీకటి పాలన ఉన్నప్పుడు 1976లో ఆగస్టు 28న రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారని, ఆ రోజున అప్పటి న్యాయమంత్రి హెచ్‌.ఆర్‌.గోఖలే 42వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు కూర్చునేసీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. 1948 నవంబర్‌ 15నే.. పీఠికలో ఈ రెండు పదాలనూ చేర్చాల్సిందిగారాజ్యాంగ సభ ముందుకు సవరణ వస్తే, ఆ ప్రతిపాదనను అంబేద్కర్‌ నిరాకరించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.



 పీఠిక నుంచి ఆ పదాన్ని తొలగించే ప్రసక్తే లేదు
 భారతీయుల రక్తంలోనే లౌకికవాదం : వెంకయ్య 

చెన్నై: తమ ప్రభుత్వం సెక్యులరిజానికి కట్టుబడి ఉందని, రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్‌ అనే పదాన్ని తొలగించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘‘లౌకికవాదం భారతీయుల రక్తంలోనే ఉంది. అయితే, ఆ పదం రాజ్యాంగం అసలు ప్రతిలోని పీఠికలో లేదు. ఎమర్జెన్సీ సమయంలో ఆ పదాన్ని చేర్చారు. ప్రభుత్వం వాణిజ్యప్రకటనలో వినియోగించినది అసలు ప్రతిలోని పీఠిక భాగం. మేం (ప్రభుత్వం) లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం ’ అని ఆయన వివరించారు.

No comments:

Post a Comment