Monday 19 January 2015

జపానుకు పడగ్గదే సమస్య!

జపానుకు పడగ్గదే సమస్య! (19-Jan-2015)
జీవిత కాలం ఎక్కువ.. సంతానోత్పత్తి తక్కువ
11 ఏళ్లు వెనక్కుపోయిన జన సంఖ్య
దేశాన్ని వేధిస్తున్న ‘బ్రహ్మచర్య జాడ్యం’
ప్రేమలు, పెళ్లిళ్లకు యువత దూరం... దూరం
 పెళ్లి తర్వాత కెరీర్‌ ఉండదని మహిళల ఆందోళన

మీరు జపాన్‌లో ఓ గంట అటూఇటూ తిరిగారనుకోండి! అక్కడ వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువనే సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది! యువత సంఖ్య చాలా తక్కువనీ అర్థమైపోతుంది! జపాన్‌ అంతటా ఇదే పరిస్థితి! ఆ దేశం ముందున్న అతి పెద్ద సవాల్‌ కూడా ఇదే! నిగెటా ప్రాంతంలోని ఓ స్కూల్లో ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య 125. మరి ఇప్పుడో! కేవలం ఆరు. అక్కడ 65 ఏళ్లుపైబడినవారి సంఖ్య పెరుగుతూ 14 ఏళ్లలోపు బాలల సంఖ్య క్షీణిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం పార్లమెంటులోనో పరిశ్రమలు, కంపెనీల్లోనో లేదు! జపాన్‌కు పడకగదే పెద్ద సమస్య! అక్కడ సీ్త్ర పురుషుల కలయికే అతి తక్కు వ. కలిసినా పిల్లల్ని కనడం అతి స్వల్పం. అందుకే, భూమ్మీద అతితక్కువ సంతానోత్పత్తి ఎక్కడంటే జపాన్‌ లోనే! ఇక సగటు ఆయుఃప్రమాణం 83 ఏళ్లు. ప్రపంచంలోనే ఇది అత్యధికం. కానీ, సంతాన సాఫల్యశాతం చాలా తక్కువ. 50ఏళ్లు న్న ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు, 40 ఏళ్లున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు బ్రహ్మచర్యంలో ఉండిపోతున్నారు. ఫలితంగా జనాభా పడిపోతోంది. ఒక్క 2013లోనే 2,84,000 మేర పడిపోగా నిరుడు ఏప్రిల్‌నాటికి 12.71 కోట్లుగా నమోదైంది. ఇది 2003నాటి జనాభాతో సమానం. జనాభాపరంగా జపాన్‌ 11ఏళ్లు వెనక్కెళ్లిందన్నమాట. అంతేనా.. 1950తో పోలిస్తే ఇప్పటి జనాభా 52శాతం మాత్రమే ఎక్కువ. ఇక ప్రస్తుత జనాభాలో 65 ఏళ్లు పైబడినవాళ్లు 3కోట్ల పైమాటే! దేశంలో ఇందరు వృద్ధులుండటమూ చరిత్రలో ఇదే తొలిసారి. అదే సమయంలో 14 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య 13శాతమే. ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాదికి పది లక్షల జనాభా తగ్గుతుందని అంచనా. అంటే 2060నాటికి ఈ సంఖ్య 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. వారిలోనూ సగం 65 ఏళ్లుపైబడిన వృద్ధులే ఉంటారట! జపాన్‌లో జనాభా పడిపోవడానికి ప్రధాన కారణం యువత సెక్స్‌పై పూర్తిగా ఆసక్తి కోల్పోవడమే. ఓ సర్వే ప్రకారం 16-24 ఏళ్ల వయస్కులైన యువతలో 45శాతం అమ్మాయిలకు, 25శాతం అబ్బాయిలకు సెక్స్‌ అంటే అయిష్టం. వారంతా ‘బ్రహ్మచర్య జాడ్యం’ (సెలిబసీ సిండ్రోమ్‌)తో బాధపడుతున్నారు. లైంగికా సక్తిపై 2005నాటి అధ్యయనంలో 60శాతం యూనివర్సిటీ విద్యార్థులు సెక్స్‌ అంటే ఇష్టమని చెబితే.. 2012లో అది 47శాతానికి పడిపోగా ఇప్పుడు మరింత దిగజారింది. ‘దానికి’ బదులు ఆన్‌లైన్‌లో బూతు సైట్లు చూడడం.. ‘నింటెండో లవ్‌ ప్లస్‌’ గేమ్‌ పేరిట కంప్యూటర్లో ఓ గర్ల్‌ఫ్రెండ్‌ బొమ్మ గీసుకుని, దానితో ఊహల్లోనే డేటింగ్‌ చేస్తారు. ఇలాంటివారిని ‘హికికోమోరీ’ అంటారు. వీళ్లు గదిదాటి బయటకు రారు. కనీసం తల్లిదండ్రులతోనూ మాట్లాడరు. ఇలాంటి పదిలక్షల మందికిపైగా ఒంటరి పక్షులను జనజీవన స్రవంతిలోకి తేవడానికి ‘అద్దె సోదరి’ పేరిట ప్రభుత్వమే ఓ కార్యక్రమం చేపట్టింది. ఇక పెళ్లి చేసుకుంటే ఖర్చులు భరించలేమన్నది అబ్బాయిల ఆవేదన. కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడమేనన్నది అమ్మాయిల ఆందోళన. వెరసి, ఆర్థిక, సాంస్కృతిక ఇబ్బందులతో జపాన్‌లో పెళ్లిళ్లే తగ్గిపోయాయి. కారణం.. 1990నుంచీ జపాన్‌లో జీతాలు స్తంభించిపోగా ఖర్చులు దారుణంగా పెరిగాయి. కాబట్టే ‘పెళ్లంటే నూరేళ్ల మంట’ అనుకుంటూ వైవాహిక జీవితంపై అంతులేని విముఖత పెంచుకుంటున్నారు.

No comments:

Post a Comment