Wednesday 28 January 2015

అమెరికా స్నేహంతో... - ఎ.కృష్ణారావు

అమెరికా స్నేహంతో... - ఎ.కృష్ణారావు

మన్మోహన్‌ సింగ్‌ అమెరికాకు అనుగుణంగా నడిస్తే అమెరికా తనకు అనుగుణంగా నడుచుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ రీత్యా ఇరు దేశాధినేతల మధ్య రసాయన శాస్త్రం బాగా పనిచేస్తున్నట్లు కనపడుతోంది. విమానాశ్రయంలో, రిపబ్లిక్‌ పరేడ్‌ వద్ద ఇరువురూ నవ్వుతూ మాట్లాడుకోవడం, హైదరాబాద్‌ హౌజ్‌ పచ్చిక బయళ్లలో నడుస్తూ చర్చించుకోవడం, ఒకప్పటి చాయ్‌వాలా అయిన మోదీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికే చాయ్‌ అందిస్తూ సంభాషించడం అనేవాటికి దౌత్య పరిభాషలో ఎన్నోసానుకూల అర్థాలుంటాయి. అణు ఒప్పందంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించుకోవడానికి ఈ చర్చలే దోహదం చేశాయి.
నేను కిటికీలు తెరిచాను.. కానీ వీళ్లు తలుపులే తెరుస్తున్నారు.. అని మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు సంస్కరణలను తన తర్వాతి నేతలు అమలుపరుస్తున్న తీరు గురించి వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఉక్కబోస్తున్న వాతావరణం ఉండకూడదని, కొత్త గాలులు, స్వేచ్ఛా వాయువులు ప్రవేశించేందుకు, పీల్చేందుకు సరైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని భావించినందువల్లే తాను సంస్కరణలను ప్రారంభించానని ఆయన ఒక సందర్భంలో అన్నారు. ఎన్ని గాలులు ప్రవేశించినా మనం ఆ గాలులకు కొట్టుకుపోకుండా ఉండాలని. మనం స్థిరంగా నిలదొక్కుకోవాలన్నదే ఆయన అభిప్రాయం.
పి.వి. నరసింహారావు అమెరికాలో తొలిసారి పర్యటించినప్పుడు ఈ స్థిరత్వాన్నే ప్రదర్శించారు. తనను ఆమెరికా అధ్యక్షుడు ఆర్మ్‌ ట్విస్టింగ్‌ ఏమీ చేయలేదని చెబుతూ తన భుజం బాగానే ఉన్నదని మీడియా ముందు చమత్కరించారు. పి.వి. తర్వాత ప్రధానమంత్రి అయిన మన్మోహన్‌ సింగ్‌ సంస్కరణలను దూకుడుగా ప్రారంభించారు. ఇప్పుడు నరేంద్రమోదీ లాగానే ఆయన 2004లో ప్రధానమంత్రి అయిన వెంటనే అమెరికాతో బలమైన సంబంధాలకు ప్రయత్నించారు. ప్రధాని అయిన ఏడాదిలోపే 2005లో ఆయన ఆమెరికాతో భారత అమెరికా పౌర అణు ఒప్పందం గురించి చర్చలు ప్రారంభించారు. మరుసటి ఏడాదే 2006లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఢిల్లీకి వచ్చి మన్మోహన్‌తో ఈ ఒప్పందంపై చర్చించారు. అణు ఒప్పందం ఒడంబడికపై ఇరు దేశాల అగ్రనేతలు సంతకాలు చేశారు. భారత అణు రియాక్టర్లను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఆ తర్వాతి కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా అమెరికా పర్యటించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పి.వి. కిటికీలు తెరిస్తే మన్మోహన్‌ సింగ్‌ ద్వారాలు కూడా తెరిచి అమెరికాను సాదర ఆలింగనం చేసుకున్నారు. తత్ఫలితంగా ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బాగా పెరిగాయి. గత కొన్నేళ్లలోనే ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు 60 శాతం పైగా పెరిగాయని, భారత్‌తో ప్రతి ఏడాదీ పదివేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నామని ఒబామా సైతం సీఈఓల మీటింగ్‌లో అంగీకరించారు.
మన్మోహన్‌ సింగ్‌ కంటే నరేంద్రమోదీ రెండాకులు ఎక్కువ చదివారు. 2006లో బుష్‌కు మన్మోహన్‌ సింగ్‌ దంపతులు విమానాశ్రయం వద్దే కరచాలనం చేసి స్వాగతం చెప్పినట్లే మోదీ కూడా ఒబామాకు విమానాశ్రయం వద్దే ఆలింగనం చేసుకుని మరీ స్వాగతం చెప్పారు. అమెరికా వెళ్లడానికి మోదీ మన్మోహన్‌ సింగ్‌ లాగా ఏడాది సమయం కూడా తీసుకోలేదు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడిని భారత్‌కు ఆహ్వానించడానికి మోదీకి ఏడాది కూడా పట్టలేదు. తాను అమెరికా వెళ్లిన ఏడాదిలోపే ఒబామాను భారత గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. రిపబ్లిక్‌ డేకు ఒబామా వచ్చేలా చేయడం మోదీకి ఎంత అవసరమో, రావడం కూడా ఒబామాకు అంతే అవసరం. వచ్చే ఏడాది ఆయన అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరం అయి ఉంటారు కనుక వచ్చేందుకు వీలుండదు. ఆ తర్వాతి ఏడాది జనవరిలో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది కనుక రావడం అసలే వీలు కాదు. అంతేకాక, ఈ రెండేళ్లలో అమెరికన్‌ కంపెనీలకు భారత్‌లో బృహదవకాశాలు కల్పించేందుకు ఇదే అనువైన సమయం. అమెరికన్‌ కంపెనీలు భారీ ఎత్తున వ్యాపారం చేసే విధంగా నరేంద్రమోదీ ఉత్సుకత ప్రదర్శించడం ఆయనకు ఉత్సాహాన్ని కల్పిస్తే ఒబామాతో చేతులు కలిపి భారత్‌లో అభివృద్ది ఊపందుకునేలా చేసే అవకాశం లభించిందని మోదీ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే అణు ఒప్పందం ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నించారు. దాదాపు ఆరేళ్లుగా అమలులోకి రాకుండా ఈ ఒప్పందం ఆగిపోయిన కారణాలపై దృష్టి సారించారు. అణు రియాక్టర్లను సరఫరా చేసే వారే నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజును ఎదుర్కోవడానికి వీలుగా బీమా పూల్‌ను ఏర్పాటు చేసే విషయంపై మన్మోహన్‌ హయాంలోనే ప్రతిపాదనలపై చర్చ ప్రారంభమైంది. మోదీ చేసిందల్లా రూ. 1500 కోట్ల బీమాపూల్‌కు బీమా కంపెనీలను, అమెరికాను ఒప్పించడం. ఏమైతేనేం, మన్మోహన్‌ అధికారంలోకి రాగానే కుదుర్చుకున్న ఒప్పందం మోదీ హయాంలో కార్యరూపం దాల్చనున్నదన్నమాట. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో ఆగిపోయిన ప్రక్రియను ప్రారంభిస్తూ మోదీ, ఒబామాల మధ్య హైదరాబాద్‌ హౌజ్‌లో ఒప్పందం జరగడం, తదనుగుణంగా సంయుక్త ప్రకటన విడుదల కావడం ఒక చారిత్రక పరిణామం అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా భారత్‌, అమెరికాల మధ్య కొన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలకు రంగం సిద్ధమైంది. మరో పదేళ్ల పాటు రక్షణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.
మన రెండు దేశాలు అన్వేషించని రంగాలెన్నో ఉన్నాయి. మన శక్తి సామర్థ్యాలను మనం పూర్తిగా గుర్తించలేదు. మనం సరైనదిశలోనే ప్రయాణిస్తున్నాం. ఇంకా బలంగా మన సంబంధాలు బలపడాలి. మనం మరింత వ్యాపారం చేయాలని, రెండు దేశాల మధ్య ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహించాలని కోరుకుంటున్నాను.. అని ఒబామా భారత అమెరికా సీఈఓల సమావేశంలో ప్రకటించారు. మన మధ్య వ్యాపారం చాలా సాఫీగా జరగాలి. మా లక్ష్యం ఒక్కటే. ప్రపంచంలోని 50 అగ్ర దేశాల్లో భారత దేశం ఒకటిగా మారాలి.. మీకు పన్నుల వ్యవస్థను సులభతరం చేస్తాం. భారీ ప్రాజెక్టులనన్నిటినీ నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను.. అని మోదీ హామీ ఇచ్చారు.
నిజానికి గత సర్కార్‌ విధానాలకూ మోదీ విధానాలకు పెద్ద తేడా లేదు. అయితే గత సర్కార్‌కు ఉన్న ఇబ్బందులు మోదీకి లేవు. మోదీ ఇప్పుడు సర్వ స్వతంత్రుడు. సంపూర్ణ మెజారిటీ పొందిన నేత. మన్మోహన్‌ సింగ్‌ అమెరికాకు అనుగుణంగా నడిస్తే అమెరికా తనకు అనుగుణంగా నడుచుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ రీత్యా ఇరు దేశాధినేతల మధ్య రసాయన శాస్త్రం బాగా పనిచేస్తున్నట్లు కనపడుతోంది. విమానాశ్రయంలో ఆలింగనం, రిపబ్లిక్‌ పరేడ్‌ వద్ద ఇరువురూ నవ్వుతూ మాట్లాడుకోవడం, హైదరాబాద్‌ హౌజ్‌ పచ్చిక బయళ్లలోనడుస్తూ చర్చించుకోవడం, ఒకప్పటి చాయ్‌వాలా అయిన మోదీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికే చాయ్‌ అందిస్తూ సంభాషించడం అనేవాటికి దౌత్య పరిభాషలో ఎన్నోసానుకూల అర్థాలుంటాయి. ఈ చర్చల్లోనే అనేక ప్రతిష్టంభనలు తొలగిపోయేందుకు ఆస్కారం కలిగింది. అణు ఒప్పందంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించుకోవడానికి ఈ చర్చలే దోహదం చేశాయి.
నరేంద్రమోదీకి వీసా ఇవ్వకుండా అమెరికా ఒకప్పుడు పదేళ్ల నిషేధం విధించింది. గత ఏడాది అదే మోదీని ప్రధాని కాగానే ఒబామా ఆహ్వానించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అతిథిగా రావడానికి అంగీకరించారు. స్వదేశీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి. ఈ పర్యటనలో అణు ఒప్పందం ఒక కీలక భాగమైతే, చైనా దూకుడును అరికట్టడం, ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరు సాగించడం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడ ం, రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడం, పర్యావరణ మార్పు అనే ఇతర ముఖ్య అంశాలు ఎజెండాలో చేరాయి. తమది సహజ భాగస్వామ్యం అని మోదీ ప్రకటించే విధంగా ఇరు దేశాధినేతల చర్చలు సాగాయి. తనకు అసాధారణమైన ఆతిథ్యం లభించిందని, మొట్టమొదటి సారి గణతంత్రదినోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంతో భారత ప్రజాస్వామ్య ఘనత తెలుసుకోగలిగానని ఒబామా సంతోషం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ ఈ పర్యటన విజయవంతం అయిందని, మోదీ ఆశించిన ఫలితాలు వచ్చాయని సంకేతాలను అందచేస్తున్నాయి. మోదీ, ఒబామా చిత్రాలను, వారి ప్రకటనలను ఢిల్లీ ఎన్నికల్లో ఉపయోగించేందుకు కూడా బీజేపీ సిద్ధమైంది. ఇరువురు నేతలూ కలిసి ఆకాశవాణిలో చేసిన మన్‌కీ బాత్‌ ప్రసంగాలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించినవేనని అర్థం అవుతున్నది.
ఇదంతా ఏం తెలియచేస్తున్నది? నరేంద్రమోదీ ఏమి చేసినా ఒక పద్దతి ప్రకారం, వ్యూహాత్మకంగా చేస్తారని అర్థమవుతున్నది. అంతటా తన పేరు లిఖించిన సూట్‌ ధరించినా, పూటకో వేష ధారణ చేసినా, కుచ్చుటోపీలు ధరించినా, రకరకాల హావభావాలు పొంగించినా, అది ఆయన ప్రత్యేకతను తెలియజేస్తున్నది. నిజంగా భారత రాజకీయాల్లో ఒక కొత్త నాయకుడు ప్రవేశించారని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ పరిణామాలు సత్ఫలితాలనిస్తాయా? ప్రపంచ రాజకీయాలు సంక్షుభిత దశకు చేరుకోవడంలో అమెరికా పాత్ర ఎంతో ఉన్నది. వివిధ దేశాల్లో కల్లోలాల వెనుక అమెరికా వ్యాపార ప్రయోజనాల జోక్యమే కారణమన్న వాదనా ఉన్నది. అమెరికాను ఆలింగనం చేసుకోవచ్చు. కానీ ఆమెరికా ఆలింగనం చేసుకుంటే మనం తట్టుకోగలమా అన్నది ప్రశ్న. కిటికీలే కాదు, తలుపులు తెరిచినా, గోడలే లేకుండా చేసినా నిలదొక్కుకోవడం మాట అటుంచి ఉనికిని, స్వతంత్రతను కోల్పోకుండా చేసుకోవడం అవసరం.
 ఎ.కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి

No comments:

Post a Comment