Wednesday, 28 January 2015

కాలం కోరుతున్న వామపక్ష ఉద్యమం వై.కె.

కాలం కోరుతున్న వామపక్ష ఉద్యమం వై.కె. (20-Jan-2015)
ఈ దేశంలో నూటికి 80 మందిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విముక్తితో సంబంధంలేని ఏ ఉద్యమం అయినా, ఏ పార్టీ అయినా క్షీణించిపోక తప్పదు. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల దుస్థితి అదే. కమ్యూనిస్టు పార్టీలతో నిమిత్తం లేకుండానే దళిత బహుజన రాజకీయ ఉద్యమం ఇప్పటికే దేశంలో ప్రారంభమై కొన్ని పరిమితుల్లోనైనా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు మాత్రమే పరిమితమై ఉద్యమ శక్తులు ఎందుకు పనిచేయాలి? అణచబడ్డ కులాలకు చెందిన ఉద్యమ శక్తులను ఎందుకు కలుపుకొని పోకూడదు?
పార్లమెంటులో కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య బాగా తగ్గిపోవడమూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో ఒక్క క మ్యూనిస్టు సభ్యుడు సైతం లేకపోవడమూ, తెలంగాణ శాసనసభలో ఒకే ఒక్క సభ్యుడు ఉన్న నేటి స్థితిలో కమ్యూనిస్టు ఉద్యమ భవిష్యత్తు గురించి తీవ్రమైన చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి మధు మంగళగిరిలో ఒక సభలో ప్రసంగిస్తూ తోటి వామపక్షాలతోనే కాక, నక్సలైట్‌లతో సైతం కలిసి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. ఆ అంశాన్ని ప్రక్కన పెడితే, సిపిఎం, సిపిఐలు మరో 8 పార్టీలతో కలసి ప్రజా ఉద్యమాల నిర్వహణకి ఇప్పటికే విజయవాడలో ఒక సదస్సును కూడా నిర్వహించి, ఒక మేరకు పని కూడా ప్రారంభించాయి.
ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ సందర్భాలలో పది వామపక్షాల పేరిట వ్యవహరిస్తున్నాయి. పది పార్టీల్లో సి.పి.ఐ. (ఎం.ఎల్‌ - న్యూ డెమోక్రసీ)కి చెందిన రెండు పార్టీలు, సి.పి.ఐ. - (ఎం.ఎల్‌ లిబరేషన్‌)లూ ఉన్నాయి. సాయుధ పోరాటం చేయాలని ప్రకటించినా, బూర్జువా-భూస్వామ్య పార్టీలతో పొత్తులు లేకుండా స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఈ పార్టీల మధ్య పరస్పర సహకారం ఎన్నికల సందర్భాలలో నెరపుకుంటున్నారు. ప్రజా ఉద్యమాల్లో కూడా అప్పుడప్పుడు కలసి పనిచేస్తున్నారు. గత పీపుల్స్‌వార్‌ పార్టీ, ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఎన్నికల బహిష్కరణ విధానాన్ని కొనసాగిస్తూ సాయుధ పోరాట పంథాను అనుసరిస్తోంది. ఇప్పటికే కలిసి పనిచేస్తోన్న పది వామపక్షాలలో మావోయిస్టు పార్టీగానీ, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్టు ప్రచారం చేస్తున్న ప్రజా సంఘాలుగానీ లేవు. నిషేధిత పార్టీతో కలసి పనిచేయటం అసాధారణం అయిన పరిస్థితుల్లో, బహిరంగంగా పనిచేస్తోన్న సంఘాలనైనా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడదు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో సాగిన విద్యుత్‌ ఉద్యమంలో కూడా ఈ వామపక్షాలు కలిసి పనిచేశాయి. ఆ తరువాత, అలాంటి ఉమ్మడి ఉద్యమానికి బ్రేక్‌ పడింది. సమస్యల ప్రాతిపదికగా ఐక్య ఉద్యమం రూపంలో 8 వామపక్షాలు కొంతకాలం కలిసికట్టుగా పనిచేశాయి. ఆ తరువాత ఆ ప్రయాణానికీ అంతరాయం కలిగింది. ఇప్పుడు మళ్ళీ పది వామపక్షాల ఐక్య ఉద్యమం రూపుదిద్దుకుంటోంది.
భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అనైక్యతకు ప్రధాన కారణం రాజకీయ విభేదాలే. కానీ సీపీఐ నారాయణ అతిగా సూక్ష్మీకరించి చెప్పినట్లుగా నాయకుల ‘ఇగో’ (అతిశయభావం) పాత్ర కొంత ఉండవచ్చునేమో. తొలి చీలిక (1964) రాజకీయ విధానాల ప్రాతిపదికగానే జరిగింది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో చైనా, రష్యా పార్టీలు ప్రతిపాదించిన సైద్ధాంతిక అంశాల మీద ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలు ఉండటం నిజం. ఇండియా, చైనా సరిహద్దు వివాదంలో పార్టీ నాయకత్వం రెండు పూర్తి భిన్న వైఖరులను తీసుకొనటం వాస్తవం. మితవాద, మతవాద శక్తులకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలనే సిపిఐ వైఖరి పార్టీలో రెండు శిబిరాలుగా (రైటిస్టు, లెఫ్టిస్టు)గా చీలిపోయి, రెండు పార్టీలుగా నిర్మాణం కావటానికి దారితీయటం పరమసత్యం. అలాగే, 1967లో నక్సల్‌బరీ పోరాటానికి నాయకత్వం వహించిన చారుమజుందార్‌ తదితరుల ఆధ్వర్యంలో మావోయిస్టు దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాని ఎంచుకుని, 1969 ఏప్రిల్‌ నెలలో లెనిన్‌ జయంతి నాడు ఎం.ఎల్‌.పార్టీ ఆవిర్భావం కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒకపెద్ద రాజకీయ పరిణామం.
కమ్యూనిస్టు ఉద్యమంలో రెండు పంథాల మధ్య అంతర్గత రాజకీయ పోరాటం సహజం. సిపిఐ, సిపిఎంల మధ్య, సిపియంలో పార్టీ నాయకత్వానికీ, నక్సల్‌బరీవాదులకు మధ్యా జరిగింది ఒక సిద్ధాంత రాజకీయ పోరాటంగా పరిగణించాలి. కాలగమనంలో సిపిఐ, సిపిఎంల మధ్య రాజకీయ విధానపరమైన విభేదాలు తగ్గిపోయి, పరస్పర నిందాపూర్వక విమర్శలు బాగా విరమించుకుని కలిసి పనిచేయటం ఆరంభించాయి. అయితే ఉభయులూ పరస్పరం కలసి పనిచేశారని చెప్పేదాని కన్నా, ఉభయపార్టీలు బాగా కలిసి వర్గ శత్రువులైన బూర్జువా భూస్వామ్య పార్టీలను బహు బాగా కలిసి బలపర్చాయని నిరాఘాటంగా చెప్పవచ్చు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ రెండు పార్టీలు బూర్జువా-భూస్వామ్య పార్టీలకు నమ్మకమైన మిత్రపక్షాలుగా పనిచేశాయి. సిపిఐ, సిపిఎంలు అనుసరించిన అపవిత్ర ఎన్నికల పొత్తుల రాజకీయ విధానం ఎన్నికల్లో పాల్గొనే ఎంఎల్‌ పార్టీలకు కూడా ఆమోదయోగ్యంగా లేదు. పది పార్టీల్లో ఒకటైన ఎంసిపిఐకి కూడా ఈ వైఖరి నచ్చలేదు. ఆ కారణంగా ఎంఎల్‌ పార్టీలుగా వ్యవహరిస్తున్న సిపిఐ (ఎంఎల్‌), యుసిసిఆర్‌ ఐ (ఎంఎల్‌) కమిటీలు ప్రస్తుత పది వామపక్ష పార్టీల్లో చేరటానికి నిరాకరించాయన్నది సమాచారం. అయితే మిగిలిన ఎంఎల్‌ పార్టీలు (న్యూ డెమొక్రసీ రెండు పార్టీలు, లిబరేషన్‌లు బూర్జువా-భూస్వామ్య పార్టీలతో పొత్తు అంశాన్ని లేవనెత్తకుండా సిపిఐ, సిపిఎంలతో కలిసి ఒక ఐక్య ప్రజా ఉద్యమ శిబిరంగా ఏర్పడ్డాయి.
పది వామపక్షాల కూటమిలోని ఎంఎల్‌ పార్టీలు సాయుధ పోరాట పంథాని తాము విరమించినట్లు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. సిపిఐ, సిపిఎంలు మాత్రం మార్క్సిస్టు-లెనినిస్టు మౌలిక సూత్రాలను మాటల్లో వల్లె వేస్తున్నప్పటికీ, ఆచరణ లో అవి మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే, పెటీ బూర్జువా యూరోపియన్‌ తరహా సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీలుగా రూపాంతరం చెందాయన్నది సుస్పష్టం. ఆ పార్టీలకు శ్రామిక వర్గ స్వభావం గల రాజకీయ విధానం లేదు. కమ్యూనిస్టు తరహాల పని విధానం లేదు. నాయకత్వాలకు శ్రామికవర్గ స్వభావం గల త్యాగశీలమైన జీవ న విధానం లేదు. గత నాలుగున్నర దశాబ్దాలలో ఆ రెండు పార్టీలు విప్లవ స్వభావానికి బహుదూరంగానూ, బూర్జువా భూస్వామ్య పార్టీలకు అతి సన్నిహితంగానూ, మళ్ళీ తిరిగి చేరుకోలేనంత దూరంగానూ జరిగిపోయాయి. ఎంఎల్‌ పార్టీలు ప్రారంభించిన ఈ రాజకీయ ప్రయాణం కాలగమనంలో సంపూర్ణం అవుతుందా? ఇతరత్ర కారణాల రీత్యా ఇంకేదైనా పరిణామానికి లోను కానుందా? ఆ పార్టీలు నిజంగానే గత అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకుంటున్నాయా? బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదనే నిర్ణయాన్ని నిజంగా తీసుకోగలిగితే అది దేశ ప్రజలకు ప్రయోజనకరమే. గతంలో న ల్లమల గిరిప్రసాద్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కాలంలో బూర్జువా-భూస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు సమదూరంలో ఉంటామని ప్రకటించి, కొద్దిరోజుల పాటు అలాంటి ప్రచారం సాగించి, చివరికి సిపిఎం విధానానికే చేరువైంది. ఉభయ పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని బలపర్చే వైఖరినే చేపట్టాయి. ఇటీవల 2014లో సాధారణ ఎన్నికల ముందు ఖమ్మం పట్టణంలో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలో బూర్జువా పార్టీల ఎడల సమదూరం సిద్ధాంతం పాటిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడికక్కడ బూర్జువా పార్టీలతో రకరకాల సర్దుబాట్లు చేసుకున్నారు. చివరికి అవినీతిపరునిగా అపఖ్యాతి పాలైన జగన్‌ పార్టీతో సిపిఎం జట్టుకట్టింది. కులవ్యవస్థ లోతుగా పాతుకుపోయిన భారత దేశంలో కులం సాంఘిక అంశమే కాదు, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక స్వభావాలతో కలగలిసింది. అసమానతలు, అణచివేతలు, అత్యాచారాలు, దోపిడీ దుర్మార్గాల కుప్పే కులవ్యవస్థ. ఈ సత్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు గుర్తించకపోవడం ఒక పెద్ద చారిత్రక తప్పిదం. కుల-వర్గ వ్యవస్థని ధ్వంసం చేసి కుల రహిత-వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలంటే, అందుకు నాయక త్వం వహించే పార్టీ కేవలం శ్రామిక వర్గ పార్టీగానే కాకుండా, అణచబడ్డ కులాల శ్రామిక వర్గ పార్టీగా ఉండాలనే పరమసత్యాన్ని ఆ పార్టీల నాయకత్వాలు ఇప్పటికీ తిరస్కరిస్తున్నాయి.
ఈ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులుగా కమ్మ, రెడ్డి కులాలకి చెందిన వారే కొనసాగారంటే కుళ్ళిపోయిన కులవ్యవస్థ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాల్లోనూ ప్రతిబింబింబిస్తుందనడానికి అదొక గొప్ప తార్కాణం. ఈ దేశంలో నూటికి 80 మందిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విముక్తితో సంబంధంలేని ఏ ఉద్యమం అయినా, ఏ పార్టీ అయినా క్షీణించిపోక తప్పదు.ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల దుస్థితి అదే. కమ్యూనిస్టు పార్టీలతో నిమిత్తం లేకుండానే దళిత బహుజన రాజకీయ ఉద్యమం ఇప్పటికే దేశంలో ప్రారంభమై కొన్ని పరిమితుల్లోనైనా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వామపక్షాలకు మాత్రమే పరిమితమై ఉద్యమ శక్తులు ఎందుకు పనిచేయాలి? అణచబడ్డ కులాలకు చెందిన ఉద్యమ శక్తులను ఎందుకు కలుపుకొని పోకూడదు? ఏదిమైనా.. పది వామపక్షాలు ఒక కూటమిగా కృషి చేయటానికి ముందుకు రావటం ఆహ్వానించదగినది.. సాయుధ పోరాటం తప్పో, ఒప్పో, అసలు ఈ దేశానికి సాయుధ పోరాటం అవసరమో లేదో అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ, సాయుధ పోరాటంతో సంబంధంలేని మావోయిజం జపం మాత్రం పూర్తిగా తప్పు. అది ప్రజల్లో సిద్ధాంత, రాజకీయ గందరగోళానికి దారితీస్తుంది.
ప్రస్తుతం అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ సిపిఎం, సిపిఐ సభ్యుల సంఖ్య బాగా తగ్గడంతో కమ్యూనిజం ప్రభావం బాగా తగ్గిపోయిందని దోపిడీ శక్తులు, వారి సిద్ధాంతకర్తలు సంబరపడుతున్నారు. వాస్తవానికి కనుమరుగైపోతున్నది కమ్యూనిజం ముసుగులో ఉన్న నకిలీ కమ్యూనిజమే. అసలైన కమ్యూనిస్టు విప్లవోద్యమం ఏ విధంగా సాగుతుందో, దాని శక్తి సామర్థ్యాలు ఏమిటో ‘గ్రీన్‌ హంట్‌’ యుద్ధంలో పాల్గొంటున్న ప్రభుత్వ సైనిక బలగాలకూ, వాటిని నడిపిస్తోన్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు బాగా తెలుసు. ఈ వాస్తవం గత 47 ఏళ్ళ దేశ చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన నిజమైన దేశ భక్తియుత మేధావులకూ అవగతమే. దేశ నిర్దిష్ట సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటూ అవసరమైన మార్పులూ చేర్పులతో నిజమైన మార్క్సిస్టు-ఫూలే-అంబేడ్కర్‌వాద విప్లవ శక్తులు సామాజిక మార్పు దిశగా మున్ముందుకు సాగిపోతూనే ఉంటారు. ‘శాసీ్త్రయ సామాజికాభివృద్ధి నియమాల అనివార్యమైన ఆపరేషన్‌’ అంటే ఇదే.
 వై.కె.
సీనియర్‌ న్యాయవాది

No comments:

Post a Comment