మేం పుతిన్‌ను పిలుస్తాం
Sakshi | Updated: January 28, 2015 04:18 (IST)
భారత్‌లో ఒబామా పర్యటనకు పోటీగా పుతిన్‌ను పిలిచేందుకు నిర్ణయం
బీజింగ్: భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించటాన్ని చైనాకు ఇబ్బందిగా మారింది. గత మూడు రోజులుగా భారత్‌ను హెచ్చరిస్తూ చైనా మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా తానూ ఓ సైనిక కవాతును నిర్వహించేందుకు చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ విజయాలకు 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అతి పెద్ద సైనిక కవాతు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరేడ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు.
వాస్తవానికి ఇలాంటి పరేడ్‌లు దశాబ్దానికి ఒకసారి నిర్వహించటం చైనా ఆనవాయితీ.. కానీ.. ఒబామా ముందు భారత సైనిక సత్తా చాటడంతో చైనా ప్రపంచ యుద్ధ విజయాల కారణంతో తానూ సైనిక బల ప్రదర్శన చేయాలని భావిస్తోంది. కాగా చైనా మీడియా అదే పనిగా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఒబామా న్యూఢిలీల పర్యటన వెనుక, చైనా భారత్‌ల సంబంధాలను దెబ్బతీయటమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. భారత్, అమెరికాల మధ్య పెరుగుతున్న స్నేహం చైనాతో పాటు రష్యాతో కూడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా ప్రభుత్వ నేతృత్వంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. భారత గణతంత్ర వేడుకల్లో మోదీ, ఒబామాలు కలసి ఉన్న ఫొటోను ఈ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. చైనాను ఇరుకున పెట్టేందుకు అమెరికా భారత్‌ను వినియోగించుకుంటోందని చైనా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఝు ఫాన్‌యిన్ వ్యాఖ్యానించారు. కొత్త ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేయటం ద్వారా ఆసియా ప్రాంతంలో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయిందని కూడా పేర్కొన్నారు.
దక్షిణాసియాలో అమెరికాకు భారత్ మిత్రపక్షంగా మారిందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాలని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ లక్ష్యమని, ఈ రెండింటికి కూడా భారత్‌కు అమెరికా సహాయం చాలా అవసరమని అన్నారు. భద్రతామండలి సభ్యత్వం కంటే కూడా భారత్ చైనాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావటం, ఆసియాలో సుస్థిరత సాధించటం ముఖ్యమన్నారు. నిరుడు సెప్టెం బర్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించినప్పుడు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమ లు.. అమెరికాతో భారత్ స్నేహం వల్ల కష్టసాధ్యమవుతుందన్నారు.
No comments:
Post a Comment