Wednesday 28 January 2015

వర్గమా? కులమా? ఏది ముందు? - రంగనాయకమ్మ

వర్గమా? కులమా? ఏది ముందు? - రంగనాయకమ్మ
‘కులాలు’ అన్నప్పుడు, వాటి వృత్తుల్ని (శ్రమల్ని) చూడగలిగితే, పెద్దా చిన్నా కులాల మధ్య సాగుతోన్న ‘శ్రమ విభజన’ని చూడగలిగితే, ఆ శ్రమ విభజనని మొత్తంగా మార్చడం రిజర్వేషన్ల ద్వారా సాధ్యం కాదనీ, దానికి వర్గ పోరాటాలు అవసరమవుతాయనీ గ్రహించగలిగితే, తమ ప్రత్యేక కమ్యూనిస్టు పార్టీ ద్వారా కుల నిర్మూలన సాధించగలరు.

‘కాలం కోరుతున్న వామపక్ష ఉద్యమం’ పేరుతో వైకే, కమ్యూనిస్టు పార్టీల తీరు తెన్నుల గురించీ, అసలా పార్టీల లక్ష్యాల గురించీ, కొంత చర్చ చేశారు (ఆంధ్రజ్యోతి, జనవరి 20). ఆ పార్టీల మీద దళిత నాయకుల నించి వచ్చే విమర్శలు ఎప్పుడూ ఎలా ఉంటున్నాయంటే, ‘కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యని పట్టించుకోవడం లేదు’ అనీ, ‘ఆ పార్టీలు, దళిత నాయకుల్ని పదవుల్లోకి రానివ్వడం లేదు’ అనీ ఉంటున్నాయి. ఇప్పుడు వైకే విమర్శలో ఉన్న ప్రధానాంశం కూడా అదే. పదవులలోకి దళిత నాయకులు ప్రవేశిస్తే, అవి సరైన కమ్యూనిస్టు పార్టీలు అయినట్టేనా? ఆ పార్టీల లోపం అనేది, వాటి పదవుల్లో దళితులు లేకపోవడమేనా?

వైకే, ‘కుల-వర్గ వ్యవస్తని ధ్వంసం చేసి కుల రహిత - వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలంటే అందుకు నాయకత్వం వహించే పార్టీ, కేవలం శ్రామిక వర్గ పార్టీగానే కాకుండా, అణచబడ్డ కులాల శ్రామిక వర్గ పార్టీగా ఉండాలనే పరమ సత్యాన్ని ఆ పార్టీల నాయకత్వాలు ఇప్పటికీ తిరస్కరిస్తున్నాయి’ అన్నారు. ఈ మాటల్లో అర్థం ఏమిటి? వ్యవస్థని, ‘కుల - వర్గ వ్యవస్థ’గా చూడడం! ‘వర్గ - కుల వ్యవస్థ’గా కాదు! ‘కుల రహిత - వర్గ రహిత సమాజాన్ని’ నిర్మించడం! అంటే రెండు మార్పుల్నీ కలిపి చెప్పినా, వ్యవస్థలో అసలు కుల విధానాన్ని మొదటి లక్షణంగా చూడడం! కులాల నిర్మూలనని మొదటి నిర్మూలనగా చూడడం! కుల విధానం వల్ల అవమానాలు అనుభవించే ప్రజల ఆశ, ‘కుల నిర్మూలనే మొదట జరగాలి’ అన్నదిగా వుండడం చాలా న్యాయమే. కానీ, కులాల్నీ వర్గాల్నీ తీసుకుంటే, దేన్ని బట్టి ఏది? - అనే ప్రశ్నని చర్చించుకోవాలి. వర్గాల వల్ల కులాలా, కులాల వల్ల వర్గాలా? - అనే ప్రశ్నని!

వైకే, కమ్యూనిస్టు పార్టీ అనేదాన్ని, ‘కేవలం శ్రామిక వర్గ పార్టీగానే కాకుండా, అణచబడ్డ కులాల శ్రామిక వర్గ పార్టీగా ఉండాలనే పరమ సత్యాన్ని’ గ్రహించాలంటున్నారు.
‘శ్రామిక వర్గం’ అన్న మాటలు, ఆ వర్గ శ్రామికులందరికీ సంబంధించినవి కావా? ‘వర్గం’ అనే దానిలో, ఆ వర్గ శ్రామికులందరూ వుంటే, ‘అణచబడ్డ కులాల శ్రామికుల పార్టీ’ అనే మాటలెందుకు? ఆ పార్టీకి ఆ మాటలే పెట్టుకుంటే, ఇతర కులాల శ్రామికులకు ‘అణచబడని కులాల శ్రామిక పార్టీ’ పేరుతో, లేదా ఆ లక్ష్యంతో, వేరే శ్రామిక పార్టీ ఉండాలా?

అసలు, చిన్నా - పెద్దా కులాల విధానానికి అర్థం, ప్రధానంగా రకరకాల శారీరక శ్రమలు చేసేవన్నీ చిన్న కులాలు. అలాగే, ప్రధానంగా మేధా శ్రమలు చేసేవన్నీ పెద్ద కులాలు. భూములూ, యంత్రాల వంటి పనిముట్లూ గల వాళ్ళు, పెద్ద కులాల్లో ఎక్కువగానూ, చిన్న కులాల్లో తక్కువగానూ ఉన్నారు ఈ నాటికీ. ఏ కులంలో అయినా, ‘పెద్ద ఆస్తి’గా ఉండేది శ్రమ దోపిడీ ద్వారా ఏర్పడే ఆస్తే. సొంత శ్రమతో, ‘పెద్ద ఆస్తి’గా వుండేది, శ్రమ దోపిడీ ద్వారా ఏర్పడే ఆస్తే. సొంత శ్రమతో, ‘పెద్ద ఆస్తి’ ఏర్పడదు. పెద్ద ఆస్తిపరులంతా దోపిడీ వర్గమే. ఆ వర్గం, అన్ని కులాల్లోనూ వుంటుంది. ఆ వర్గంతో పోరాడవలసిన శ్రామికులు, అన్ని కులాల్లోనూ వుంటారు. కాకపోతే, ఒక కులంలో ఎక్కువ సంఖ్యా, ఒక కులంలో తక్కువ సంఖ్యా.

‘శ్రామికులు’ అనే మాట, ‘శ్రమ సంబంధాల’లో నించి, అంటే ‘వర్గాల’లో నించి పుట్టే మాటే గానీ, అది ‘కులాల’లో నించి పుట్టే మాట కాదు. కులాలన్నీ శ్రమ సంంధాల విషయాలే అయినప్పటికీ, ఒక కులాన్నంతా ఒక వర్గానికే చెందినదిగా నిర్ణయించటం తప్పు అవుతుంది. ఒకే కులంలో, వేరు వర్గాలు వుంటాయి. దోపిడీ నించి విముక్తి కోసం, పోరాడవలసిన బాధ్యత, ఆ దోపిడీకి గురి అయ్యే అన్ని కులాల శ్రామికులకూ వుంటుంది. ఏ కులంలోనూ అందరూ శ్రామికులుగా వుండరు. అసలు కమ్యూనిస్టు పార్టీల తీరు తెన్నుల్లో జరుగుతోన్న ప్రధాన లోపం, వర్గ పోరాట దృక్పధం లేకపోవడమే.

రష్యా చైనాల్లో కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాధికారాన్ని సాధించగలిగి, ఒకటి రెండు ముందడుగులు వేసి కూడా, క్రమంగా దారి తప్పి, దోపిడీ వర్గాలకే దారులు సుగమం చెయ్యడానికి కారణాలేమిటి? అక్కడ కుల విధానాలు వుండి, చిన్న కులాలకు పార్టీల్లో పెద్ద పదవులు ఇవ్వకపోవడమా? - కాదు. అసలు కారణం అక్కడ కూడా మొదటి నించీ శ్రామిక జనాభాకి వర్గ భేదాల దృష్టి వుండవలసినట్టుగా లేదు.

సరిగ్గా ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఇక్కడ ఎంత ‘‘అణచబడ్డ కులాల’’ శ్రామికులకైనా, అసలు ‘వర్గాలు’ అంటే ఏమిటో, అవి ఎందుకు ఏర్పడతాయో, ‘శ్రమ దోపిడీ’ అంటే, ‘అదనపు విలువ’ అంటే, ‘యజమానీ శ్రామిక సంబంధా’లంటే, ‘రాజ్యాంగ యంత్రం’ అంటే, ఒక్క ముక్క అయినా తెలీదు.

ఈ నాడు అమలులో వున్న సమాజం మారాలనుకుంటున్నాం. ఎందుకు? ఇందులో వున్న తప్పులేమిటి? రేపటి సమాజాన్ని తప్పులు లేకుండా ఎలా మార్చాలి? వర్గ భేదాలే తెలియకపోతే, రేపు ఆ వర్గాల్ని ఎలా తీసి వెయ్యగలుగుతారు? లెక్క ఎలా చెయ్యాలో తెలియకుండా లెక్క చెయ్యగలరా? ఎలా చేస్తారు? వర్గ పోరాటాలన్నీ, వర్గ సామరస్యాలుగానూ, ఆ సామరస్యాలు కూడా వర్గ యాచనలు గానూ మారిపోయిన కమ్యూనిస్టు పార్టీల్లో, వర్గ దృష్టే లేనప్పుడు, కుల దృష్టికి మాత్రం స్థానం ఎక్కడ వుంటుంది? పోరాటాలు చేసే పార్టీలైనా, శ్రామిక ప్రజలకు నేర్పుతోన్న వర్గ దృష్టి ఏమిటి? అవి ప్రజలకు ఏ సిద్ధాంతం నేర్పుతున్నాయి? పోరాట దృష్టి వదిలేసి, బూర్జువా పార్టీగా మారి, కేవలం పేరుతో మాత్రమే కమ్యూనిస్టు పార్టీగా వున్న ఏ పార్టీ అయినా, శ్రామిక ప్రజల కోసం ఏం చెయ్యగలదు? ఆ ప్రజలకు ఏదో ఒక కాలక్షేపపు పార్టీ కావాలంటే, బూర్జువా పార్టీలే బోలెడు వున్నాయి.

‘‘అణచబడ్డ’’ చిన్న కులాల వారే గొప్ప ఉద్యమాలు చేస్తున్నట్టు వారి నాయకులు చెప్పుకుంటారు. వారు చేసే ఉద్యమా లు ఏమిటి? వారిలో ఒక పక్షం వారు, ‘‘మనం కూడా బూర్జువాలమై తోటి దళిత జనాల్ని దోచుకోవాలి’’ అంటూ వుంటే; ఇంకో పక్షం వారు, ‘‘మొట్ట మొదట కుల విధానాన్ని నిర్మూలించాలి. ఆ తర్వాతే వర్గాల మాట ఎత్తాలి!’’ అంటున్నారు.

వైకే అన్నది, ‘‘కుల రహిత - వర్గ రహిత’’ అని! ‘కుల నిర్మూలన’ జరగాలంటే, రెండు గ్లాసుల నిర్మూలనలూ, దేవాలయ ప్రవేశాలూ, సహ పంక్తి భోజనాలూ వంటివి ఎన్ని సాగినా, రిజర్వేషన్ల వంటి దాన ధర్మాలు అణచబడ్డ పిడికెడు జనాలకు మాత్రమే ఎన్ని యుగాల పాటు సాగినా, కులాలు కులాలే. అసలు జరగవలిసినది, కులాంతర స్ర్తీ పురుష కుటుంబ సంబంధాలూ, కులాంతర తరాల ఎదుగుదలలూనూ. అవి జరగడం ఎలా సాధ్యమో అదే ఆలోచించాలి!

లేదా, మొదటే ‘కుల నిర్మూలన’ కావాలందామా? దాన్ని కోరే వాళ్ళు కొత్త కమ్యూనిస్టు పార్టీని వారే నిర్మించి, వారే ఆ పార్టీ పదవులు నిర్వహిస్తూ, వర్గ నిర్మూలనతో సంబంధం లేకుండా, మొదటే కుల నిర్మూలన చెయ్యగలగాలి. ప్రస్తుత కమ్యూనిస్టు పార్టీల లోపాల్ని, కుల నిర్మూలనలు చెయ్యలేక పోవడంగా భావించేవారు, ‘‘అణచబడ్డకులాల శ్రామిక వర్గ పార్టీ’’ స్థాపించి, కుల నిర్మూలన విప్లవకారులుగా కృషి చెయ్యాలి. ప్రస్తుతం వున్న కమ్యూనిస్టు పార్టీల మీద నమ్మకాలు లేనప్పుడు, కుల నిర్మూలనలు చెయ్యాలని ఆ పార్టీలతో వాదనలు ఎందుకు? నచ్చనిదాన్ని తిరస్కరించడమే కదా మార్గం?  దళిత నాయకులు కూడా ‘‘కుల రాహిత్యం’తో పాటు, ‘‘వర్గ రాహిత్యాన్ని’’ కూడా కోరే వారైతే, వారు వర్గాల సంగతులూ, వర్గాలకూ కులాలకూ వున్న సంబంధాలూ, తెలుసుకోవాలి.

 ‘కులాలు’ అన్నప్పుడు, వాటి వృత్తుల్ని (శ్రమ ల్ని) చూడగలిగితే, పెద్దా చిన్నా కులాల మధ్య సాగుతోన్న ‘శ్రమ విభజన’ని చూడగలిగితే, ఆ శ్రమవిభజనని మొత్తంగా మార్చడం రిజర్వేషన్ల ద్వారా సాధ్యంకాదనీ, దానికి వర్గ పోరాటాలు అవసరమవుతాయనీ గ్రహించగలిగితే, తమ ప్రత్యేక కమ్యూనిస్టు పార్టీ ద్వారా కుల నిర్మూలన సాధించగలరు.

 రంగనాయకమ్మ

No comments:

Post a Comment