Wednesday, 28 January 2015

మధుమేహాన్ని అదుపు చేయాలంటే?

మధుమేహాన్ని అదుపు చేయాలంటే?

జీవక్రియా లోపం వల్ల రక్తంలో నిల్వ ఉన్న చక్కెర మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీనినే ఆయుర్వేదంలో ‘‘ప్రమేహం’’ అని అంటారు. ఇదే మధుమేహం. ఈ వ్యాధిబారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులాగా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడతాయి. కొందరి మూత్రం చప్పగా కూడా ఉంటుంది. వీళ్లు అనేకసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనినే అతి మూత్ర వ్యాధి అంటారు. దీనిని తగ్గించే వీలుంది. వ్యాధిని పూర్తిగా తగ్గించటం కష్టమే కానీ అదుపుచేయవచ్చు.
వ్యాధి లక్షణాలు
 శక్తి నశించి సన్నగా అవుతారు
 చక్కెరశాతం అధికమైనపుడు అపస్మారక స్థితిలోకి వెడతారు
 కాళ్లపై బొబ్బలు వస్తాయి
 ఆకలి, దాహం, అతిమూత్రం, బలహీనత ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు
 కళ్లు, కిడ్నీలు, నరాల వ్యాధులతో పాటు లైంగిక బలహీనతలొస్తాయి.

మధుమేహాన్ని సమర్థవంతంగా అదుపుచేయటానికి ఆయుర్వేదంలో చేదు, వగరు, ఘాటు రుచులు ఉండే మూలికలు ఉంటాయి. కొన్ని మూలికా ప్రయోగాలు పరిశీలిద్దాం.
మోదుగ పూలు : ప్రయోగం- మోదుగ పువ్వులను ఎండబెట్టి చూర్ణంచేయాలి. రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్‌ పువ్వుల చూర్ణం కలిపి ఒక కప్పు కషాయాన్ని మరిగించి వడబోసి ఉదయం పరగడపున, రాత్రి భోజనం ముందు తాగాలి. ఆకుల చూర్ణాన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చు. మోదుగపూల మిశ్రమం అతిమూత్రం, మధుమేహాల్ని అదుపుచేస్తుంది.
కరివేపాకు : ప్రయోగం- ప్రతి రోజూ పరగడుపున ముదిరిన పది కరివే పాకు ఆకులు బాగా నమిలి మింగాలి. వంశపారంపర్యంగా వచ్చిన, ఊబకాయం వల్ల వచ్చిన మధుమేహవ్యాధి అదుపులోకి వస్తుంది.
మెంతులు : బాగా మొలకెత్తిన మెంతులను దోరగా వేగించి పిండి చేసి రోజూ ఒక టీ స్పూన్‌ ఉదయం, రాత్రి భోజనం తర్వాత మజ్జిగతో పాటు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
నేరేడు : నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్‌ మజ్జిగతో తీసుకోవాలి. మధుమేహం, అతిమూత్రం అదుపులోకి వస్తాయి.
పొడపత్రి ఆకు : ఉదయాన్నే రెండు టీ స్పూన్లు పొడపత్రి ఆకు చూర్ణం ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి.
మర్రి ఊడలు : మర్రి ఊడలను కొద్దిగా నలగ కొట్టి గ్లాసు నీటిలో రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడపోసి తాగాలి.
కాకరకాయలు : ముదురు కాకరకాయలను గింజలతో సహా ఎండబెట్టి పొడిచేసి రోజూ ఉదయం మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్‌ మజ్జిగలో కలిపి తాగాలి.
ఉసిరి : రెండు టీ స్పూన్ల ఉసిరి పొడిని కప్పు కాకరకాయ రసంలో కలిపి రోజూ ఉదయం తాగాలి.
మారేడు : ప్రతి ఉదయం రెండు లేత మారేడు ఆకులు, రెండు లేత వేపాకులు కలిపి బాగా నమిలి మింగాలి.
ఏవి తినాలి? ఏవి తినకూడదు?
వీటితోపాటు ముదిరిన కాకరకాయ గింజలు, కరివేపాకు, వేప పువ్వులతో కారప్పొడులు చేసుకుని రోజూ భోజనంతో వాడండి. ఊబకాయం ఉన్న వారు రాత్రి భోజనం మానేసి రెండు పుల్కాలు కాని, చపాతీలు కాని తీసుకోవడం మంచిది. ఆకు కూరలు, కాయగూరలు అన్నీ తినాలి. మామిడి, సపోటా, అరటి, సీతాఫలం, చక్కెరతో చేసిన పదార్థాలు తినకూడదు. పిండి పదార్థాలు కూడా ఎక్కువగా తినవద్దు.

No comments:

Post a Comment