Thursday 29 January 2015

వైట్‌హౌస్‌లోనే ఒబామా తల నరికేస్తాం!

వైట్‌హౌస్‌లోనే ఒబామా తల నరికేస్తాం!

  అమెరికాను ఇస్లాం రాజ్యంగా మారుస్తాం
 ఫ్రాన్స్‌, బెల్జియం, ఇతర ఐరోపా దేశాల్లో...
 కారుబాంబులు, పేలుళ్లతో విరుచుకుపడతాం
 తాజా వీడియోలో ఐఎస్‌ హెచ్చరిక 

బాగ్దాద్‌, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు అంటేనే కనీవినీ ఎరుగని భద్రత. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబా మానే ‘నరికేస్తాం’ అని హెచ్చరించింది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ! ‘‘ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇలాంటి శిక్ష పడుతుంది. ఒబామా... తెలుసుకో! మేము అమెరికా వస్తాం! వైట్‌హౌస్‌లోనే నీ తల నరికేస్తాం! ఏకంగా అమెరికాను ఇస్లాం రాజ్యంగా మారుస్తాం!...’’ అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఐఎస్‌ హెచ్చరించింది. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఒబామా దంపతులు... మంగళవారం తమ పర్యటన ముగించుకుని సౌదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన భారత పర్యటనకు ముందే అమెరికా నేతృత్వంలోని బలగాలు ఐఎస్‌కు బలమైన స్థావరంగా ఉన్న మోసుల్‌ పట్టణంపై బాంబుల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో సోమవారమే ఈ వీడియో విడుదల కావడం గమనార్హం. ఐఎస్‌ విస్తరణను అడ్డుకునేందుకు అమెరికా నేతృత్వంలో పలు దేశాలు గత ఏడాది నుంచి సిరియా, ఇరాక్‌లలో గగనతల దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్‌ సైనికులను, ఇతర సహాయక వర్కర్లను బందీలుగా తీసుకుని... వారిని హత్య చేస్తూ... ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఐఎస్‌ వీడియోలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుర్ద్‌ సైనికుడి తల నరికేస్తూ... తాజా వీడియో విడుదల చేసింది. పెష్‌మెర్గా సైనికుల ప్రతి క్షిపణికీ ఒక కుర్దు సైనికుడి తల పంపుతామని కుర్దిష్‌ అధ్యక్షుడు మసోద్‌ బర్జానీని హెచ్చరించారు. ఫ్రాన్స్‌, బెల్జియం, ఇతర ఐరోపా దేశాలు కూడా మూల్యం చెల్లించుకోకతప్పదని, కారుబాంబులు, ఇతర పేలుళ్లతో విరుచుకుపడతామని ఐఎస్‌ హెచ్చరించింది. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని, వారు సాయుధ తిరుగుబాటుదారులు అని అమెరికా పేర్కొంది. అయితే, ఐఎస్‌ను మాత్రం ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది. ఈ రెండు సంస్థలను వైట్‌హౌస్‌ డిప్యూటీ మీడియా కార్యదర్శి ఎరిక్‌ షుల్ట్స్‌ బుధవారం పైవిధంగా పోల్చాడు. ఉగ్రవాద సంస్థల పట్ల తాము ఎలాంటి మెతక వైఖరిని ప్రదర్శించడం లేదన్నారు. కాగా, తాలిబన్‌ నేత ముల్లా ఒమర్‌ సమాచారం ఇస్తే కోటి డాలర్ల నజరానా ఇస్తామని అమెరికా ప్రకటించింది. 

No comments:

Post a Comment