Friday 30 January 2015

వర్ణం - కులం - అరవిందరావు

వర్ణం - కులం

శ్రీకృష్ణుడు,
కుచేలుడు స్నేహితులనీ, వారిద్దరూ సాందీపని అనే గురువు వద్ద వేదాల్ని చదువుకున్నారనీ మనకు తెలుసు. కృష్ణుడు యాదవుడు కదా! మరి ఈనాటి యాదవులు వేదమెందుకు చదవడం లేదు? తమకు తామే శూద్రులని ఎలా అనుకుంటున్నారు? ఈ ప్రశ్న మన మెదడుకు రాకపోవచ్చు. దీనికి సమాధానం ద్విజుడు అనే పదానికి అర్థం గమనిస్తే తెలుస్తుంది.


ద్విజుడంటే ఎవరు?
బ్రాహ్మణుడని మనం అనుకుంటాం. కాని అది సరికాదు. ద్విజుడు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే మూడు వర్ణాలు కూడా. ఈ మూడు వర్ణాలవారూ వేదాల్ని చదివేవారు. ‘జన్మనా జాయతే శూద్రః’ అన్నట్లు పుట్టుకతో అందరూ శూద్రులే. ఉపనయనం అనే కర్మ వల్ల ‘కర్మణా జాయతే ద్విజః’ అన్నట్టు ద్విజులుగా మారేవారు. వేదంలో చెప్పిన అన్ని విషయాలపై వీరికి అధికారం ఉంది. ఇక్కడ మళ్ళీ వైశ్యుడు అనే పదానికి ఉన్న అర్థం చాలా ముఖ్యం. ‘కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం(గీత 18-44)’ అని దీని నిర్వచనం. అంటే సేద్యం చేయడం. పశువుల్ని కాయడం. అన్ని విధాల వ్యాపారాలు వైశ్యుడు అనే పదంలోకి వస్తాయి. అందువల్లే నిన్న మొన్నటివరకూ పల్లెల్లో పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు మొదలైన వాళ్లందరూ జందాలు వేసుకుని నియమ నిష్ఠలతో ఉండేవారు. ఇటీవలి కాలం వరకూ చాలామంది భారతం, భాగవతం మొదలైనవి బాగా చదువుకునేవారు. అలాగే క్షత్రియులు కాకుండా రాజ్యాలు పాలించిన మిగతా కులాలవారు బ్రాహ్మణులతో సమానంగా అన్ని శాసా్త్రలూ చదివారు. పుస్తకాలు రాశారు. ఈ వర్గాలవారు తమని తాము శూద్రులని అనుకుంటున్నారు కానీ వీరందరూ ద్విజులు అనే వర్ణంలో భాగమే.

నాలుగు వర్ణాలను తాను సృష్టించానని గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం మనకు తెలుసు. గుణాన్ని బట్టి, అంటే వ్యక్తి యొక్క స్వభావసిద్ధమైన ప్రవర్తనను బట్టి ఈ విభజన అని ఆయన చెప్పాడు. కేవలం గీతలోనే కాక భారతంలో పలుచోట్ల వర్ణం ప్రస్తావన ఉంది. ఇప్పుడు సైకాలజీలో ఎలాగ పర్సనాలిటీ టైప్స్‌ అంటూ విశ్లేషిస్తున్నారో అలాగే పూర్వీకులు మనిషి స్వభావాన్ని నాలుగు విధాలుగా గమనించారు. క్షమాగుణం, అహింస, సత్యము, సంతుష్టి విద్య పట్ల ఆసక్తి, తపస్సు మొదలైన గుణాల్ని సత్త్వ గుణమన్నారు. శౌర్యము, ఇతరుల్ని శాసించే స్వభావం, అధికారం పట్ల, ధనం పట్ల కోరిక మొదలైన వాటిని రజో గుణమన్నారు. సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేకపోవడం, సోమరితనం, పట్టుదల, స్ఫూర్తి లేకపోవడం మొదలైన వాటిని తామస గుణమన్నారు. ప్రకృతిలో అన్ని జంతువుల్లోనూ, పదార్థాల్లోనూ, మనుషుల్లోనూ ఈ గుణాలున్నాయని గమనించారు. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలూ వివిధ నిష్పత్తులలో కలవడం వల్ల నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయని చెప్పారు. సత్త్వగుణం ముఖ్యంగా ఉంటే బ్రాహ్మణ వర్ణమనీ, రజో గుణంలోని శౌర్యము, శాసించే స్వభావం అధిక పాళ్లలో ఉంటే క్షత్రియ వర్ణమనీ, రజోగుణంలోనే ధనం పట్ల కోరిక ఎక్కువగా ఉంటే వైశ్యస్వభావమనీ, స్వయం స్ఫూర్తి తక్కువగా ఉంటే శూద్రస్వభావమనీ విభాగం చేశారు.

ఇంతవరకూ బాగానే ఉంది. పుట్టిన ప్రతి మనిషి వర్ణాన్ని ఎలా నిర్ణయించాలి? ఏదో ఒక లేబొరేటరీలో పరీక్షించి అతని స్వభావాన్ని కొంతకాలం గమనించి ఫలానా వర్ణమనీ నిర్ణయించే ప్రక్రియ ఉంటే తప్ప పేచీ వస్తుంది. తండ్రి సత్త్వగుణం కలవాడు కావచ్చు. కానీ అతని పిల్లలకు ఆ స్వభావం లేకపోవచ్చు. ఈ ప్రశ్న ఈనాడు మనమెంత తీవ్రంగా వేస్తున్నామో మహాభారతంలో కూడా అంతే ఉద్వేగంగా చర్చించారు. మనందరికీ తెలిసిన యక్షప్రశ్నలు, నహుష ప్రశ్నలు, ధర్మవ్యాధుని కథలలో ఎవరు బ్రాహ్మణుడు అన్నది ఒక ముఖ్య ప్రశ్న. వేదవ్యాసుడు నిర్మొహమాటంగా ఫలానా గుణాలున్న వాడే బ్రాహ్మణుడు, అవి లేనివాడు కాడు అని అనేకచోట్ల చెప్పాడు. భారతం మొత్తానికి సంస్కృతంలో వ్యాఖ్య వ్రాసిన నీలకంఠ పండితుడు మొదలైనవాళ్లు కూడా గుణాలకే ప్రాధాన్యమిస్తూ ఆయా గుణాలున్న వాణ్ణే బ్రాహ్మణుడనాలి, అవి లేనివాడు శూద్రుడే అని చెప్పారు. ఒక వర్ణాన్ని నిర్వచిస్తూ ఏ గుణాలు చెప్పారో అవి ఎవరిలో ఉన్నా, ఏ జాతిలో పుట్టినా అతన్ని ఆ వర్ణం వాడిగా గుర్తించాలి అని సూటిగా చెప్పారు. భాగవతంలోని 11వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని వ్యాసుడు మళ్ళీ చెప్పాడు. బ్రాహ్మణుల్లోని తపోబలం సన్నగిల్లినవాళ్లు, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవాళ్ళు, క్షత్రియులుగా మారారనీ, మరికొందరు సేవాస్వభావం కలవారు శూద్రులుగా మారారనీ శాంతిపర్వం 188వ అధ్యాయం చెబుతుంది.

వేదాల్ని గమనించినా ఇలాంటి స్పష్ట అభిప్రాయమే కనిపిస్తుంది. శుక్లయజుర్వేదానికి చెందిన బృహదారణ్యక ఉపనిషత్తు (1411) లో ఇలా చెప్పారు- సృష్టిలో మొదట అందరూ బ్రాహ్మణులే. అది సమాజం అవసరాల్ని తీర్చలేకపోవడం వల్ల క్షత్రియవర్ణం అనేది ఏర్పడింది. అంటే ఇతరుల దాడుల్ని ఎదుర్కోవడం అవసరమైంది. పై రెండు కూడా సమాజాన్ని పూర్తిగా నిర్మించలేకపోయాయి. కాబట్టి వైశ్య అనే వర్ణం ఏర్పడింది. అంటే సంపదను సృష్టించే విభాగం ఒకటి ఉండాలి. పై మూడూ ఉన్నా వ్యవస్థ పూర్తి కాకపోవడం వల్ల శూద్ర అనే వర్ణం వచ్చింది. దీన్ని ఉపనిషత్తులో ‘పూష’ అన్నారు. అంటే అన్ని ప్రాణాలను పోషించేది అని దీని అర్థం. మనం ఈనాడు రైతును అన్నదాత అన్నట్లు.

పై చెప్పిన విధంగా వ్యక్తిని పరీక్షించడానికి ఎలాంటి లేబొరేటరీ వ్యవస్థ చేయలేం కాబట్టి ఆయా వర్ణాలవారు క్రమక్రమంగా తమ తండ్రి తాతలకు సంబంధించిన పనుల్నే కొనసాగించడ వల్ల వర్ణవ్యవస్థ కాస్తా కులవ్యవస్థగా మారింది. ప్రాచీన సమాజమంతా గ్రామీణ సమాజం. ప్రతి గ్రామం ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి గలదిగా ఉండేది. గుడ్డలు నేయడానికొకరు, వ్యవసాయ పనిముట్లు చేసేవారొకరు, బంగారు పనిచేసే వారొకరు ఇలా ఆయా వృత్తులు చేసే వాళ్లు తమ పిల్లలకు ఆ వృత్తుల్లోని మెళకువల్ని నేర్పడం వల్ల అలాంటి వాళ్లందరూ ఒక కులంగానే ఏర్పడ్డారు. పక్క గ్రామంలోని వ్యక్తికి అమ్మాయిని ఇవ్వాలన్నా ఆ నైపుణ్యం ఉన్న వ్యక్తికే ఇచ్చారు. ఇలాగ కులవ్యవస్థ ఏర్పడింది. ఇలా ఉన్నప్పటికీ వారు ఆయా కులాలకే పరిమితం కాలేదు. క్షత్రియులే కాకుండా యుద్ధాలు చేసి రాజ్యాలని స్థాపించిన అనేక కులాల్ని మనం చరిత్రలో చూడగలం. అందుకే కులాలెన్ని ఉన్నా సమాజంలో సమస్యలు రాలేదు. పండుగల్లో, ఉత్సవాల్లో అందరూ అవసరమే, అందరూ భాగస్వాములే.

బ్రిటీష్‌ కాలం వరకూ పై వ్యవస్థ సమాజ భద్రతకు సమస్య కాలేదు. విభజించి పాలించే సిద్ధాంతం, మతమార్పిడి అనే లక్ష్యంతో బ్రిటీష్‌ వారు మన సమాజాన్ని ఎన్ని విభాగాలుగా చేయవచ్చు అని పరిశీలించి మొదటిసారిగా కులాలన్నింటినీ లెక్కించి ఐదారు వేలల్లో ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కొన్ని వర్గాలలో తాము అణగదొక్కబడిన వారమనే భావన (Victim Mentality) ని తీవ్రంగా సృష్టించారు. మన చరిత్రలో ఉన్న మంచిని దాచడం, చెడును మాత్రం పెద్దగా చేసి చూపడం వల్ల మన సంస్కృతిపై ద్వేషం కలిగించడమే వీరి ఉద్దేశం.

సమాజంలో మార్పును గుర్తించి మన మత గురువులు చాలామంది సమాజంలోని మార్పుకనుగుణంగా స్మృతుల్ని సవరించి వ్రాయాలని సూచించారు. ఇటీవలే సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆలోచన ప్రకారం మహామహోపాధ్యాయ, పద్మశ్రీ బిరుదు పొందిన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వ్రాసిన ‘కౌండిన్యస్మృతి’ అనే పుస్తకం ఇందుకు ఉదాహరణ. ఈ పుస్తకం మన రాజ్యాంగ విలువలకు అద్దం పట్టడం చూడగలం. అస్పృశ్యత, కులం, వర్ణం మొదలైన విషయాలపై ఉపనిషత్తుల సిద్ధాంతం. మన రాజ్యాంగ సిద్ధాంతం రెండూ ఒకటే. మార్పు అంటే బ్రాహ్మణుడు తన విధుల్ని, ధర్మాన్ని మానేయాలని అర్థం కాదు. సమాజంలో అందరినీ అందులో భాగస్వామ్యులుగా చేయాలని అర్థం.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తూ సమాజాన్ని కలిపే శక్తులు తక్కువగా ఉండటం వల్లా, విభజించే శక్తులే ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత ఓటుబ్యాంకు రాజకీయం వల్లా కులాలు మరింత పటిష్టంగా తయారయ్యాయి. అందరూ కులవ్యవస్థను తీవ్రంగా విమర్శించేవారే కానీ కులపు గోడలు మాత్రం మరింత గట్టిగా కట్టుకున్నారు. ఇది మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి. మిగతా సంస్కృతుల వాళ్ళు విమర్శించడానికున్న ఒక ముఖ్యమైన అంశం. ఒక్కొక్క కులాన్ని ఆకర్షించడానికి ఒక్కో ఊ్యహంతో మతమార్పిడులు చేయబూనడం దేశభద్రతకు మరొక సమస్య.

భారతీయ సంస్కృతి గూర్చి పని చేస్తున్న వ్యవస్థలు అస్పృశ్యతపై ఎలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందో అలాగే కుల నిర్మాణంపై కూడా స్పష్టత, విధాన పరమైన నిర్ణయం ఇవ్వడం ఈనాడు చాలా ముఖ్యం. అస్పృశ్యత ఎలాగ మన భారతీయ మత గ్రంథాల్లో లేదో కులాలు కూడా మత గ్రంథాల్లో లేవు. మనిషి స్వభావం ఆధారంగా చెప్పబడిన వర్ణం వేరు, మనమిప్పుడు చూస్తున్న కులం వేరు. ఈ అంశంపై విధానపరమైన ఒక నిర్ణయాన్ని ధర్మ సంసద్‌, సాధుపరిషత్‌ మొదలైన వ్యవస్థల ద్వారా అందించటం చాలా అవసరం.

No comments:

Post a Comment