Monday, 16 November 2015

నీరసంగానే ఎగుమతులు

నీరసంగానే ఎగుమతులు 
Updated :17-11-2015 02:28:43
అక్టోబర్‌లో 17.5 శాతం క్షీణత.. 59.5 శాతం తగ్గిన బంగారం దిగుమతులు 
 
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. వరుసగా పదకొండో నెలలోనూ దిగుమతులు క్షీణించాయి. అక్టోబర్‌ నెలలో దేశ ఎగుమతులు 17.53 శాతం తగ్గడంతో ఎగుమతుల విలువ 2,135 కోట్ల డాలర్లకు చేరుకుంది. పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, ఇంజనీరింగ్‌ వంటి వాటి ఎగుమతులు గణనీయంగా తగ్గడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో మన దేశ ఉత్పత్తులకు గిరాకీ సన్నగిల్లడం కూడా ఎగుమతులను ప్రభావితం చేస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అక్టోబర్‌లో దిగుమతులు కూడా క్షీణించాయి. 21.15 శాతం తగ్గి 3,112 కోట్ల డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్య లోటు 976 కోట్ల డాలర్లకు చేరుకుంది. బంగారం దిగుమతులు ఏకంగా 59.5 శాతం తగ్గి 170 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో మొత్తం ఎగుమతులు 17.62 శాతం మేర క్షీణించి 15,429 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన ఎగుమతుల విలువ 18,720 కోట్ల డాలర్లు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో వాణిజ్య లోటు 8,626 కోట్ల డాలర్ల నుంచి 7,776 కోట్ల డాలర్లకు తగ్గిపోయింది. చమురు, చమురేతర దిగుమతులు అక్టోబర్‌ నెలలో వరుసగా 45.31 శాతం, 9.93 శాతం మేర తగ్గి 684 కోట్ల డాలర్లు, 2420 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ ఎగుమతుల విషయానికొస్తే.. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 57 శాతం మేర క్షీణించి 246 కోట్ల డాలర్లకు చేరుకోగా.. ఇనుప ఖనిజ ఎగుమతులు 85.53 కోట్ల డాలర్లు తగ్గి 29.5 లక్షల డాలర్లకు చేరుకున్నాయి.
 
ఎగుమతుల లక్ష్యసాధన కష్టమే: ఫియో 
ఎగుమతుల క్షీణత ఇదే విధంగా కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల డాలర్ల ఎగుమతులను చేరుకోవడం కష్టమేనని భారత ఎగుమతిదారు సంస్థల సమాఖ్య (ఫియో) ప్రెసిడెంట్‌ ఎస్‌సి రాహన్‌ తెలిపారు.

No comments:

Post a Comment