ఇది అపురూప విజయం..
మా కర్తవ్యాన్ని బోధించిన ఫలితం ఇది. మాపై మరింత బాధ్యత పెరిగింది. చరిత్రలో లేని మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ చేతులు జోడించి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ తీర్పుతో మాకు ఎలాంటి గర్వం రాదు. ఇంకా విజృంభించి పనిచేస్తం. 2021కల్లా కోటి ఎకరాలకు నీళ్లందిస్తం. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బీపీఎల్ కార్డులున్నవారికి కల్యాణలక్ష్మి పథకం అమలు చేయబోతున్నం. కాళేశ్వరం, దుమ్ముగూడెం, లోయర్ పెన్‌గంగలకు శంకుస్థాపన చేస్తున్నాం.
- సీఎం కేసీఆర్
-వరంగల్ ఫలితం బాధ్యతను పెంచింది
-ఇంకా విజృంభించి పనిచేస్తాం
-జనవరి తర్వాత జిల్లాల్లో బస్సు యాత్ర
-త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్,కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
-మహిళా సంఘాలకు తీపి కబురు త్వరలో
-బీపీఎల్ కార్డులున్న పేదలందరికీ కల్యాణలక్ష్మి
-నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసంబద్ధ, అడ్డగోలు ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో గతంలో ఏనాడూ ఎవరికీ ఇవ్వనంత మెజారిటీ ఇచ్చి గెలిపించిన వరంగల్ ప్రజలందరికీ టీఆర్‌ఎస్ తరపున, ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా తన తరపున చేతులు జోడించి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడి అనంతరం మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాడు... నేడు... ఏనాడైనా... తెలంగాణ సాధించే క్రమంలో కూడా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా నిలబడ్డారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక విజయం నేపథ్యంలో ఇదే ఊపులో వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 80 డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంటు ఎన్నిక ఫలితం అపురూపమైందని అభివర్ణించిన ముఖ్యమంత్రి.. చరిత్రలో కనీవినీ ఎరుగని ఈ ఫలితం కర్తవ్యాన్ని బోధించిందని, బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు. దీనివల్ల తమకు ఎలాంటి గర్వం రాబోదన్నారు. ప్రజలిచ్చిన ప్రోత్సాహంతో ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.
గత 17 నెలలుగా హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన తాను ఇక ప్రజల్లోకి వెళ్తానని, బస్సుయాత్ర చేపట్టి ఒక్కో జిల్లాలో ఏడెనిమిది రోజుల చొప్పన పర్యటనలు చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆకుపచ్చ తెలంగాణ సాధనకోసం ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ప్రాజెక్టుల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని అన్నారు. త్వరలో డీఎస్సీ ప్రకటిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. మార్చి బడ్జెట్‌నుంచి బీపీఎల్ కార్డులున్న పేదలందరికీ కల్యాణలక్ష్మి వర్తింప చేస్తామన్నారు. పార్టీ శ్రేణులతో ఇంటరాక్షన్‌కు ప్రత్యేక సమయం కేటాయిస్తానని, నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే...
పంథా మార్చుకోని ప్రతిపక్షాలు..
రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ముందు నుంచీ చెప్తున్నా. ఇంత అసహన వైఖరి, గుడ్డి వ్యతిరేకత మంచిది కాదని చెప్పా. అయినా రైతుల రుణమాఫీపై నేను ప్రమాణ స్వీకారం చేసిన ఐదో రోజునే ఒక పత్రిక పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ఆ రాతలను పట్టుకొని, నా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. టీఆర్‌ఎస్ దిమ్మెల్ని కూల్చివేశారు. ఇలాంటి అసహన, తొందరపాటు, ఓర్వలేనితనం మంచిదికాదని అసెంబ్లీలోనే చెప్పినా వాళ్లు తమ పంథా మార్చుకోలేదు. అర్థంపర్థంలేని మాటలు, అడ్డగోలు మాటలు. నీచాతి నీచంగా ఒకడు కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని అంటే, ఇంకోడు ఇంకోటి. వీటన్నింటినీ ప్రజలు అసహ్యించుకున్నారు. అందుకే వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు. ప్రజలు ఎంతో సీరియస్‌గా తండోపతండోపాలుగా వచ్చి ఓటింగు శాతాన్ని పెంచారు.
ఇదేదో డబ్బులిస్తే, ఎవరో ఆర్గనైజ్ చేస్తే కాదు. 69-70 శాతం పోలింగ్ జరగడమంటే 50-50 శాతం తీర్పు రాదు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగాగానీ లేకపోతే సానుకూలంగాగానీ ఓట్లేసేందుకే వెల్లువలా వచ్చారు అని ఆరోజే నేను పార్టీ నేతలతో చెప్పాను. ఫలితాల్లో అది ప్రభుత్వ సానుకూల ఓటింగ్ అని తేలింది. నిన్న రాత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక పోస్టు పెట్టారు. టీఆర్‌ఎస్‌కు 53 శాతం ఓట్లు వస్తాయనేది అబద్ధం.. మేమే లక్ష మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ఇవాళ చూశారు కదా. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2.60 లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు 1.57 లక్షల ఓట్లు. గతంలో 22 శాతం ఓట్లతో డిపాజిట్ వస్తే ఇప్పుడు 15 శాతం ఓట్లతో అది కూడా లేదు. అంటే ఏడు శాతం ఓట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ప్రతిపక్షాలకు ఓట్లు పెరగాలి. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పిచ్చి పిచ్చి మాటలు చెప్తే ప్రతిపక్షాలు లేనిదానిని, కృత్రిమ వ్యతిరేకతను సృష్టించాలనుకొని చివరకు ప్రజల్లో అభాసుపాలైనాయి.
ఇకనైనా హుందాగా ఉండండి..
ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా, గౌరవంగా, హుందాగా వ్యవహరించాలని కోరుతున్నా. అడ్డంగా మాట్లాడితే ప్రజలకు శాశ్వతంగా దూరమైతరు. ఎందుకింత ఆత్రుత? ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏండ్లు ఉంది. పద్ధతిగా లేకుంటే ఇకముందు కూడా ఇలాగే శృంగభంగం తప్పదు. కూటమో, ఇంకోటో వరంగల్‌లో అందరికీ కలిసి ఎన్ని ఓట్లు వచ్చాయో చూశారు. అలాంటిది మిగతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ను ఓడిస్తామనడం అంతర్జాతీయ జోక్. గ్రేటర్ హైదరాబాద్‌లో 80 పైచిలుకు డివిజన్లను నేరుగా టీఆర్‌ఎస్ పార్టీ సొంతం చేసుకుంటది. ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎవరితో పొత్తు ఉండదు.
విజృంభించి పని చేస్తం..
ఉపఎన్నికల్లో ప్రభుత్వం గెలుస్తదనేది నిజం కాదు. బీహార్‌లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని రాట్లం లోక్‌సభ సీటు బీజేపీది.. అయినా ఆ పార్టీ 80వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. కానీ వరంగల్‌లో వంద శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చారు. ఈ తీర్పుతో ఇంకా విజృంభించి పని చేస్తం. విజయంతో మాకు ఎలాంటి గర్వం రాదు. గెలుపోటములు సహజం. ఉద్యమ సమయంలో గెలిచినం, ఓడినం. ఈ గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగింది.
నీటి రంగంలో తెలంగాణకు దగా..
సాగునీటి రంగంలో తెలంగాణ దగాపడ్డది. సంపూర్ణంగా న్యాయం చేయాలి. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు రావాల్సిన నీళ్లను తెచ్చేందుకు ప్రాజెక్టులను డిజైన్ చేయాల్సి ఉంది. తెలంగాణ అభివృద్ధికి పునాదిరాయి వేసే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. తప్పుచేసే అధికారం మాకు లేదు. మాకు తెలియకుంటే, అర్థం కాకుంటే విజ్ఙులు, మేధావులను అడిగి తెలుసుకుంటం.. ఆరు నెలలు ఆలస్యమైనా సరే పొరపాటు మాత్రం చేయం. తల తెగిపడినా తెలంగాణకు అన్యాయం జరిగే పనిని మేం చేయంగాక చేయం.
ఎందుకంటే ఇప్పుడు ఒక తప్పు జరిగితే భవిష్యత్తు తరాలకు ముప్పుగా ఉంటది. అందుకే నీళ్ల దగాను సవరించేందుకు.. శాశ్వతంగా కరువును పోగొట్టేందుకు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నాం. సమైక్య రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు ఏనాడూ తెలంగాణకు నీళ్లొచ్చే ప్రాజెక్టులు చేపట్టలేదు. ఎస్సెల్బీసీ ప్రత్యక్ష ఉదాహరణ. ఎస్సారెస్పీ రెండో దశ కింద ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కాలువలు తవ్వినరు. అందులో మొక్కలు పెద్ద వృక్షాలైనా ఇప్పటివరకు నీళ్లు రాలే. కల్వకుర్తి , భీమా, నెట్టెంపాడు ఎన్ని దశాబ్దాల ప్రాజెక్టులు! లోయర్ పెన్‌గంగా, లెండి ప్రాజెక్టులను ఆంధ్ర పాలకులు ఉద్దేశపూర్వకంగా ఖతం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. ఆ ప్రాజెక్టు కింద 16 లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని చెప్పి... 14 టీఎంసీల స్టోరేజీని పెట్టినరు.
16 లక్షలకు 14 టీఎంసీలు పారుతయా? ఈ మాట పిచ్చోనికి చెప్పిన కూడా ఒప్పుకోడు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీని ప్రతిపాదించారు. దానిమీద మహారాష్ట్ర వివాదం. ఇంతే. తెలంగాణ ప్రాజెక్టులమీద ఆంధ్ర పాలకులు అనుసరించిన వ్యూహమే ఇది. అంతర్ రాష్ట్ర వివాదాలున్నయా? మంచిది..లేదంటే సృష్టించు. ప్రాణహిత-చేవెళ్ల ప్రారంభించినపుడే ఆన్‌రికార్డ్.. ఉద్యమ నాయకుడిగా ఉన్న నేను ఖండించిన. మన మునిమనవండ్లు కూడా నీళ్లు చూడరు అన్నా. 2014 ఎన్నికల ప్రచారంలో పరిగి బహిరంగసభలో ప్రాణహిత-చేవెళ్ల ద్వారా పరిగికి నీళ్లు రావు, ఇక్కడికి పాలమూరు పథకం ద్వారానే నీళ్లొస్తయి అన్నా.
పచ్చ తెలంగాణ నా కల..
ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైన్ కూడా పూర్తయితుంది. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద 16 టీఎంసీలతో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించినం. రాజీవ్‌సాగర్-ఇందిరాసాగర్ అనుసంధానంతో ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తం. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు 60 ఏండ్ల నుంచి మూలకుపడింది. త్వరలో దానికి శంకుస్థాపన చేస్త. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పనిలో నిమగ్నమైనం. 2021నాటికి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం. ఈ టర్మ్‌లో మూడున్నర ఏండ్లు, ఆ తర్వాత మరో ఏడాదిన్నరలో డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌తో సహా ప్రాజెక్టులను పూర్తి చేస్తం.
తెలంగాణను పచ్చగ చేయాలనేదే నా కల. ఇరిగేషన్ ప్రాజెక్టులంటే భూసేకరణ ఏండ్ల తరబడి కొనసాగేది. కానీ ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ కాకుండా జీవో 123 ప్రకారం ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ చేసుకుంటున్నం. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు బహుశా వచ్చే నెలలో టెండర్లు పిలుస్తారు. అప్పటికి భూమి అంతా సిద్ధంగా ఉంటది. దీనివల్ల 3-4 ఏండ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. 3-4 ఏండ్లలో ప్రాజెక్టులు కడితే గులాబీ కండువా వేసుకుంటానని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నరు. ఆయన గులాబీ కండువా సిద్ధం చేసుకోవాలి.
ఏ అడుగువేసినా రభసే!
ఆంధ్రజ్యోతి అనే పత్రిక అసత్య, అసంబద్ధ రాతలతో నాపై, మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగతంగా అభ్యంతరకరంగా రాసింది. ఇక ప్రతిపక్షాలు ఆంధ్రజ్యోతినే లోకం అనుకుని పిచ్చి కూతలు కూశాయి. ఇవాళ వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రభుత్వం ఏ పని చేసినా రాద్ధాంతమే. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటే దాని మీద గోల. రవీంద్రభారతి పాతగైంది. దాని స్థానంలో మినీ రవీంద్రభారతి, ఎన్టీఆర్ స్టేడియంలో బ్రహ్మాండంగా తెలంగాణ కళాభారతి కడతామంటే రభస. టీఆర్‌ఎస్‌కు మంచి పేరు రావద్దని ముసుగువీరులతో కోర్టుల్లో పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్లు. సచివాలయం ఎట్లుంది? కూలిపోయిన జీ బ్లాక్, వంకర టింకర రోడ్లు. విదేశీయులు ఎవరన్న వస్త్తే ఇదేం సెక్రటేరియట్?అనుకుంటరు. మంచి సెక్రటేరియట్ నిర్మిస్తామంటే దాని మీద వ్యతిరేకత.
చెస్ట్ హాస్పిటల్‌ని అనంతగిరికి మార్చాలన్నా, ఉస్మానియా హాస్పిటల్‌లో భవనం శిథిలావస్థకు చేరుకొంది. రోగులు చనిపోతరని జేఎన్‌టీయూ వాళ్లు నివేదిక ఇస్తే దానిని తరలించాలన్నా రభసే. తెలంగాణలోని 45,600 చెరువుల్ని బాగుచేస్తుంటే పనులు మొదలు కాకముందే కమీషన్ కాకతీయ అంటరు. హుస్సేన్‌సాగర్‌లో కెమికల్ కలిసి కంపు కొడుతుంది, అందులోని నీళ్లు ఖాళీ చేసి బాగు చేస్తమంటే దానిపైన ఓ వివాదం.
బోనాలు, బతుకమ్మకు నిధులిస్తే కేసీఆర్ బిడ్డకు ఇస్తున్నరని అంటరు. కేసీఆర్ బిడ్డ ఒక్కరే బతుకమ్మ ఆడుతరా? తెలంగాణ ఆడబిడ్డలు ఆడరా? ఫార్మాసిటీ కట్టాలని నల్లగొండ జిల్లా ముచ్చర్ల, రాచకొండ గుట్టల్లో నేను, పారిశ్రామికవేత్తలు, జిల్లా కలెక్టర్ హెలిక్యాప్టర్‌లో సర్వే చేసిన. దానికి కేసీఆర్ ఆకాశంనుంచి కిందకు దిగు అని ఒకరంటరు. వరంగల్ పట్టణంలో మురికివాడల్లో పాదయాత్ర చేస్తే. ఏం కేసీఆర్ నువ్వు కార్పొరేటర్‌వా? కౌన్సిలర్‌వా? అంటరు. వాటర్‌గ్రిడ్‌ను రూ.30వేల కోట్లతో చేపడితే రూ.10వేల కోట్లు చాలంటరు. మరి రూ.10వేల కోట్లతో చేయొస్తే మీరెందుకో చేయలేదు?
సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్..
మేం ప్రజలకు ఇచ్చిన మాటల్ని వంద శాతం నెరవేరుస్తున్నం. ఎవరు ఏమన్నా రైతులకు రుణమాఫీని చేసినం. ఏపీలో గోల్‌మాల్ చేసిండ్రేమోగానీ.. తెలంగాణలో 50 శాతం చెల్లించినం. వచ్చే మార్చి వరకు మిగతా చెల్లిస్తం. ఇది రైతులందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం ధర్నాలు చేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఆరు నెలల్లో ఎవరి ఊహలకు అందని రీతిలో 24 గంటల కరెంటిస్తున్నం. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించినం. గతంలో క్యూలో చెప్పులు పెట్టే దుస్థితి ఉండేది. ఆరు నెలల కాలంలో పరిస్థితిని మార్చినం. రాష్ట్రంలో నాలుగు లక్షల సామర్థ్యమున్న గోడౌన్లు ఉంటే 17 లక్షల సామర్థ్యానికి పెంచినం. రూ.200 నుంచి రూ.1000, రూ.1500 పింఛన్లను పెంచినం. పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏడాదికి రూ.33వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిన ఫలమే వరంగల్ ఎన్నిక ఫలితం.
జనవరి తర్వాత బస్సు యాత్ర...
రానున్న 1-2 నెలల్లో జీహెచ్‌ఎంసీ, నారాయణ్‌ఖేడ్ ఎన్నికలతో పాటు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ వచ్చే ఏడాది జనవరి 30లోపు పూర్తిచేస్తా. ఆపై హైదరాబాద్‌లో ఉండను. గతంలో పాలమూరు ఎత్తిపోతలగానీ, గోదావరి ప్రాజెక్టులుగానీ నేను కుర్చీ వేసుకొని కూర్చొని మరీ కట్టిస్తనని చెప్పిన. ఇక బస్సుయాత్రను ప్రారంభిస్తున్న. హైదరాబాద్‌ను వదిలి ఒక్కో జిల్లాలో 8-10 రోజులు ఉంట.
ఢిల్లీలో గళమెత్తుతం...
రాష్ట్రంలో 231 కరువు మండలాలను ప్రకటించినం. రూ.1000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదిక కూడా పంపినం. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి కేంద్ర బృందం రావాలని ఆహ్వానిస్తారు. పార్లమెంటు సమావేశాల్లో ఆశ వర్కర్ల సమస్యలపై పోరాడాలని ఎంపీలకు చెప్పిన. పత్తి రైతుల మద్దతు ధరపై యుద్ధమే చేయండని ఎంపీలతో చెప్పిన.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
వరంగల్ పార్లమెంటు ప్రజలు ఇచ్చిన బాధ్యతతో సోయి ఉండి పని చేస్తం. కడుపు, నోరు కట్టుకొని అవినీతికి తావులేకుండా పాలన చేస్తం. ఇండ్ల పథకంలో కేవలం గ్రామాల ఎంపికను మాత్రమే ఎమ్మెల్యేలపై ఉం చాం. లబ్ధిదారుల ఎంపిక కలెక్టర్లకు అప్పగించినం. ఎక్కడా మంత్రు లు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోరు. లబ్ధిదారులను గ్రామసభలో ప్రకటిస్తరు. ఇంకా పారద్శకంగా ఉండేందుకు గ్రామంలో లబ్ధిదారుల పేర్లు రాసి గ్రామసభలో ఒక చిన్నారి చేత లాటరీ తీయించమని చెప్పినం.
మాట్లాడే ముందు ఆలోచించండి...
సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి ఇవాళ చేసిన ప్రకటన నాకు చాలా బాధ కలిగించింది. నాకు మొదటి నుంచి భగవంతుడి మీద విశ్వాసం ఎక్కువ. సుధాకర్‌రెడ్డిలాంటి పెద్ద మనిషి... కేసీఆర్ చేసే యాగంలో షామియానా ఆయన సొంత ఖర్చుతో వేసుకోవాలన్నరు. సొంత ఖర్చుతో కాకుంటే ప్రభుత్వ ఖర్చుతో వేసుకుంటమా! యాగం చేసేటపుడు వినియోగించే ట్రాన్స్‌ఫార్మర్లకు కూడా కరెంటు బిల్లులు కట్టాలని చెప్పిన. యాగమనేది సత్కార్యం. చాలామంది దాతలు ముందుకొస్తరు. మాట్లాడేముందు మంచి చెడ్డ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. డిసెంబరు 23-27 వరకు ఆయుత చండీ మహాయాగం చేస్తున్న. ఇది చేయడం అంత సులువు కాదు. ఆర్గనైజ్ చేసేందుకు స్కిల్ కావాలి. నాలుగు వేల మంది బ్రాహ్మణులు కావాలి. ఒక్క రాష్ట్రంలో దొరకరు, 3,4 రాష్ర్టాల నుంచి పిలిపించాలి. ఈ యాగానికి భారత రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఆహ్వానిస్తున్నం.
జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం కోటా...
కేంద్రంలో రకరకాల పథకాలుంటయి. కొన్ని లబ్ధిదారులు, బ్యాంకుల కంట్రిబ్యూషన్‌తో ఉంటయి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇండ్లు అవే. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో రెండు, మూడు సార్లు మాట్లాడిన. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వంద శాతం సబ్సిడీతో డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తది. పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మాజీ సైనికోద్యోగులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లలో పది శాతం వాటా ఇస్తాం. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఈ ఇండ్లలో కొంత వాటా ఇవ్వాలని ఆలోచిస్తున్నం. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణతో మాట్లాడతా. రాష్ట్రంలో 10-12వేల మంది వరకు జర్నలిస్టులు ఉండవచ్చు. కొంత కోటాను ఫిక్స్ చేస్తం.
వీసీల నియామకానికి సెర్చ్ కమిటీ...
గత ప్రభుత్వాల హయాంలో యూనివర్సిటీ వీసీలు దిగిపోయే రెండు, మూడు రోజుల ముందు 300-400 మంది ఉద్యోగులను నియమించిపోయారు. అలాంటివి పునరావృతం కాకుండా మంచి వారిని వీసీలుగా నియమించేందుకు సెర్చ్ కమిటీని వేసినం. నెల, నెలన్నర రోజుల్లో వీసీలు, పాలకమండలి ఏర్పాటు చేస్తం.
తక్షణ కార్యాచరణ ఇది...
-పట్టణాల్లో మెప్మా అని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో పేరుతో రాష్ట్రంలో 40-50వేల వరకు గ్రూపులు మంచిగ పనిచేస్తున్నయి. త్వరలో వాళ్లకు తీపి కబురు అందిస్తం. ప్రోత్సాహకాలు అందిస్తం.
-నెలన్నర, రెండు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను పూర్తిచేస్తం.
-10-15 రోజుల్లో డీఎస్సీని ప్రకటిస్తం. క్వాలిఫైడ్ టీచర్లు 1998, 2006 డీఎస్సీ అభ్యర్థులకు కూడా ఉద్యోగాలియ్యాలని నిర్ణయించినం.
-ఈ ఏడాదిలో 60-65వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మింస్తున్నం. వచ్చే మార్చి నుంచి ఒక లక్ష, ఆపై రెండు లక్షలు. స్టెప్‌బై స్టెప్ పెంచుతం.
-వాటర్‌గ్రిడ్ ద్వారా పేద కుటుంబాల వాళ్లకు ప్రభుత్వమే నల్లాలను బిగించాలని కూడా నిర్ణయించినం.
-అ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా రెండు లక్షల మంది పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ ,ప్రభుత్వపరంగానే మధ్యాహ్నం విందు ఇస్తం.
-కల్యాణలక్ష్మి పథకం బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి అమలు చేస్తం. బీసీలతోపాటు అగ్రకులాల్లోని పేదలకు కూడా ఇది వర్తిస్తుంది.
-మంత్రులకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.25 కోట్ల చొప్పున ఇవ్వనున్నాం.
-మా యువ ఎంపీ బాల్క సుమన్ కోరినట్టు కళాశాల, యూనివర్సిటీ హాస్టళ్లలోనూ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తం.
-రానున్న వారంరోజుల్లో నామినేటెడ్ పోస్టుల భరీ ప్రక్రియను మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేస్తం.
ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత
-అడ్డగోలు మాటలకు వరంగల్ ఫలితమే జవాబు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పిచ్చి రాతల్లోనే ప్రజా వ్యతిరేకత
-ప్రజలు మా వెంటే ఉన్నారు సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తా
-2021నాటికి కోటి ఎకరాలకు సాగునీరు గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా 80 డివిజన్లు సాధిస్తాం
No comments:
Post a Comment