- బీజేపీతీరుపై హెచ్‌ఏఎం, ఎల్జేపీ నిరసన
- ఓటమికి షా, ఆరెస్సెస్‌దే బాధ్యత: మాంఝీ
- భగవత వ్యాఖ్యలే కొంపముంచాయి : ఎల్జేపీ
పట్నా, నవంబరు 9: బిహార్ ఫలితాలు ఎన్డీయే కూటమిలో చిచ్చుపెడుతున్నాయా? తాజా పరిణామాలను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తుంది. బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన హిందుస్థానీ ఆవామీ మోర్చా(హెచ్‌ఏఎం), లోక్ జనశక్తిపార్టీ(ఎల్జేపీ) నేతలు బీజేపీ, ఆరెస్సెస్ నేతల వ్యాఖ్యలే ఎన్డీయే ఓటమికి కారణమయ్యాయని సోమవారం ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమితషా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత వ్యాఖ్యలు ఎన్డీయేని ఓటమి దిశగా నడిపించాయని హెచ్‌ఏఎం అధినేత జితిన్ రాం మాంఝీ ఆరోపించారు. సోమవారం పట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిహార్‌లో ఎన్డీయే ఓడిపోతే పాక్‌లో బాణసంచా కాల్చుకుంటారన్న షా వ్యాఖ్యలు, రిజర్వేషన్ కోటాపై భగవత వ్యాఖ్యలే ఎన్డీయే ఓటమికి కారణమయ్యాయన్నారు. ఎల్జేపీ సెక్రటరీ జనరల్ అబ్దుల్ ఖలిక్ సైతం ఆరెస్సెస్ చీఫ్‌పై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో యాదవులు, ఇతర వెనకబడిన కులాల ఓటర్లు ఏకమైన మహాకూటమికి గంపగుత్తగా ఓట్లేశారని ఖలిక్ విమర్శించారు. బీజేపీ ఎంపీ హుకుందేవ్ నారాయణ్ యాదవ్ మాట్లాడుతూ.. భగవత వ్యాఖ్యలు అసమంజసమైనవన్నారు. వెనుకబడిన కులాల ఓటర్లు మహాకూటమి వైపు మొగ్గు చూపడానికి కారణాలపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ ఆరెస్సెస్ భావజాలానికి మద్దతు పలికినట్లు కాదని. ఈ విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలన్నారు.
|
No comments:
Post a Comment