వైసీపీ నేతలకు గిరిజనుల మార్చ్‌ఫాస్ట్! Updated :10-11-2015 00:24:23 |
చింతపల్లి/గూడెంకొత్తవీధి, నవంబరు 9: విశాఖ ఏజెన్సీలో వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం బాక్సైట్ నిక్షేపాలు ఉన్న గూడెం కొత్తవీధి మండలం జర్రెల కొండ (బోడమ్మ బీడింగ్) ప్రాంత సందర్శనకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరి, జిల్లా నాయకులను గిరిజనులు అడ్డుకొన్నారు. జగన్‌కు మేనమామ వరుసైన పెన్నా ప్రతా్‌పరెడ్డికి అన్‌రాక్‌లో వాటాలున్నాయని, ముందు ఆ కంపెనీని మూయించి, ఆ తర్వాత బాక్సైట్‌పై పోరాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేసహా నాయకులందరినీ సంప్రదాయ ఆయుధాలతో చుట్టుముట్టి సుమారు 5 కిలోమీటర్ల మేర కొండల్లో నడిపించారు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్, నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పెట్ల గణే్‌షతోపాటు జర్రెల సర్పంచి విజయకుమారి, జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, పాడేరు, జి.మాడుగుల మండలాలకు చెందిన పార్టీ సర్పంచులు, నాయకులు సోమవారం జర్రెలకు వచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజనులతో సమావేశం నిర్వహించాలన్నది వీరి ఉద్దేశం. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకొన్న వైసీపీ నాయకులు ఆదివాసీలు వచ్చేలోపు బాక్సైట్ కొండలను పరిశీలిద్దామని బోడమ్మ బీడింగ్‌కు బయలుదేరారు. జర్రెల నుంచి బోడమ్మ బీడింగ్‌కు సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జర్రెల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిగడ్డకు వాహనాల్లో వెళ్లిన నాయకులు అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడమ్మ బీడింగ్‌కు కాలినడకన చేరుకొన్నారు. సుమారు గంటపాటు కొండలను పరిశీలించారు.
మాకు చెప్పకుండా కొండ ఎక్కుతారా.. నడవండి
వైసీపీ నాయకులు బాక్సైట్ కొండపైకి వెళ్లారని తెలుసుకున్న కోండ్రుపల్లి, బుడ్డలగొంది, పెబ్బెంపల్లి, రాసకోట గ్రామాల గిరిజనులు ఆగ్రహంతో ఊగిపోయారు. గిరిజన సంప్రదాయ ఆయుధాలతో కొండపైకి బయలుదేరారు. వైసీపీ నాయకులతో బాక్సైట్ కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చారనే అనుమానంతో రహదారికి అడ్డంగా చెట్లను నరికిపడేశారు. కొండపైకి వెళుతున్న గిరిజనులకు మార్గమధ్యంలోనే కొండ దిగుతున్న ఎమ్మెల్యే ఈశ్వరి, వైసీపీ నేతలు ఎదురయ్యారు. వారిని గిరిజనులు చుట్టుముట్టారు. మాకు చెప్పకుండా కొండ ఎందుకు ఎక్కారంటూ నిలదీశారు. ‘జగనకు పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాపరెడ్డి మేనమామ అవుతారు. ప్రతాపరెడ్డికి అన్‌రాక్ కంపెనీలో వాటా ఉంది. వైసీపీ నాయకులు బాక్సైట్ కొండను సందర్శించాలన్నా, బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్నా ముందు కంపెనీనిని మూసేయించాలి. నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. జర్రెల వెళ్లి మాట్లాడుకుందామంటూ వైసీపీ నాయకులు అప్పటికే అక్కడికి వచ్చిన తమ వాహనాలను ఎక్కేందుకు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకొన్నారు. నాయకులను సంప్రదాయ ఆయుధాలతో చుట్టుముట్టి, తమతోపాటు జర్రెల వరకు నడవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల ముందు కొందరు.. వెనుక మరికొందరు గిరిజనులు సంప్రదాయ ఆయుధాలతో మోహరించి జర్రెల వరకు సుమారు 5 కిలోమీటర్లు కొండల్లో గుట్టల్లో నడిపించారు. జర్రెల చేరుకొన్న తర్వాత వైసీపీ నాయకులను కోండ్రుపల్లి వచ్చి బహిరంగ సమావేశం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఏ ఒక్కరు రాకపోయినా ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
దీంతో పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి.. తాము బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికే వచ్చామని, పార్టీ స్థానిక నాయకులకు, గిరిజనులకు మధ్య అంతరం ఉండడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని నచ్చజెప్పబోయారు. అయినా గిరిజనులు తమ పట్టు వీడలేదు. కోండ్రుపల్లి రావాల్సిందేనని పట్టుబట్టారు. మరోసారి ఈశ్వరి గిరిజనులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. జర్రెలలోనే బహిరంగ సమావేశం పెట్టుకుందామని సూచించారు. దీంతో శాంతించిన గిరిజనులు జర్రెలలో బాక్సైట్ వ్యతిరేక సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.
|
No comments:
Post a Comment