- దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- వచ్చే నెల 2న ఏజెన్సీలో జగన్ పర్యటన
విశాఖపట్నం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ని తక్షణం ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకవిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేత హోదాలో 2010 డిసెంబరు 24న గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారా? అని బొత్స ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తామన్నారు. గిరిజనుల సంక్షేమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు నిరసిస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 2న ఏజెన్సీలో పర్యటిస్తారని, ఈ సందర్భంగా చింతపల్లిలో బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు.
|
No comments:
Post a Comment