టీఆర్‌ఎస్ పాలకులను తన్ని తరమండి Updated :17-11-2015 00:48:18 |
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజా వ్యతిరేక విధానాలతో నిరంకుశ పాలన సాగిస్తూ.. ఇప్పుడు ఓట్ల కోసం వరంగల్‌కు వస్తున్న టీఆర్‌ఎస్ పాలకులను తన్ని తరమండి. ఏ ముఖం పెట్టుకొని వరంగల్ వస్తున్నారో నిలదీయండి’’ అని సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలకు ఆయన లేఖ రాసిన ఆయన. టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ‘‘ఓవైపు రైతులు ఆత్మ హత్య చేసుకుంటుంటే మరోవైపు.. సీఎం కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో తందనాలు ఆడుతున్నాడు’’ అని మండిపడ్డారు. ‘మావోయిస్టు ఎజెండానే నా ఎజెండా’ అన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజాస్వామిక విలువల్ని పక్కనపెట్టి తన ఫ్యూడల్‌తత్వాన్ని బయట పెట్టుకుంటున్నాడని ధ్వజమెత్తారు. వాక్, సభా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ కేసీఆర్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాడని చెప్పారు. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను అణిచివేస్తూ దొర అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. బంగా రు తెలంగాణ అంటూ మాటల గారడితో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నాడని విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం తదితర జిల్లాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు, మైనింగ్ మాఫియాకు కట్టబెట్టేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నాడని అన్నారు.
దీనికి అడ్డురాకుండా ఉండేందుకు, మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మలిచేందుకు ఏజెన్సీ గ్రామాల్లో గ్రేహౌండ్స్ దళాలను దించు తూ అరాచకాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. శృతి, విద్యాసాగర్‌ల బూటకపు ఎనకౌంటర్ ఇందులో భాగమేనని అన్నారు. ఈ బూటకపు ఎనకౌంటర్‌పై విచారణకు డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టు చేయించి క్రూర త్వాన్ని ప్రదర్శించాడన్నారు. ఎనకౌంటర్లు లేని తెలంగాణను చూస్తారన్న సీఎం.. ఈ ఎనకౌంటర్‌పై కనీసం స్పందించకపోవడం ఆయన మనసులోని మర్మాన్ని బయటపెడుతోందని అన్నారు. ఎప్పటికైనా ఈ హత్యలకు సీఎం కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకుంటారని జగన్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ కనుసన్నుల్లోనే ప్రజా హంతక ముఠా పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికార మదంతో కండ్లు నెత్తికెక్కిన కేటీఆర్.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని.. ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగలుగా పేరుపడ్డ తుమ్మల, కడియం శ్రీహరి, తలసాని వంటి ప్రజా హంతకులకు మంత్రి పదువులిచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జగన్ దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలో వేలాది మందిని.. పోలీసులచే హత్య చేయించిన కడియం, ఖమ్మం జిల్లాలో ఆదివాసీలపై హంతక దాడి చేయిస్తున్న తుమ్మల, హైదరాబాద్‌లో గుండాగిరికి మారుపేరైన తలసాని.. ఎప్పటికీ ప్రజా శత్రువులేనన్నారు. ప్రజా ఉద్యమాలపై చీకటి హత్యలకు పథకం పన్నుతున్న ఇంటెలిజెన్స ఐజీ శివధర్‌రెడ్డి పన్నాగాలను తిప్పికొట్టాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.
‘‘కేంద్రంలోని నరహంతక మోదీ ప్రభుత్వ.. అప్రజాస్వామిక పాలనను ప్రజాస్వామ్య వాదులంతా ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం వచ్చే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ మోసపూరిత పార్టీలేనని విమర్శించారు. ఈ బూటకపు ఎన్నికల ద్వారా ఒరిగేదేమీ ఉండదని, వీటిని బహిష్కరించి మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పాలక వర్గాలను ఓడించాలని పిలుపునిచ్చారు.
|
No comments:
Post a Comment