Sunday 22 March 2015

YCP లో సీమ రెడ్లదే సీన్‌

సీమ రెడ్లదే సీన్‌

మా గొంతు నొక్కుతున్నారు.. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి
 దళిత ఎమ్మెల్యేలను గద్దిస్తున్న చెవిరెడ్డి
 అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన
హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో ఎమ్మెల్యే రోజా దళిత, గిరిజన ఎమ్మెల్యేల పాలిట మర్రిచెట్టులా మారారా!? మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారా!? వైసీపీలో రాయలసీమ రెడ్డి వర్గం ఆధిపత్యమే కొనసాగుతోందా!? అసెంబ్లీలోనూ బయటా తమ గొంతు వినిపించకుండా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు మథన పడుతున్నారా..? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి సంబంధిత ఎమ్మెల్యేల అనుచర వర్గాలు. రాయలసీమ రెడ్డి వర్గం ఎమ్మెల్యేల తీరుపై వైసీపీలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు లోలోపల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన పరిణామాలను వివరిస్తున్నాయి. అసెంబ్లీలో గిరిజన మహిళా ఎమ్మెల్యేలపై రోజా చెలాయిస్తున్న పెత్తనం, అసెంబ్లీ బయట దళిత ఎమ్మెల్యేలు మాట్లాడకుండా చెవిరెడ్డి అడ్డుకోవడం వారికి ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడిచినా సభలో కనీసం ఒక్కరోజు అయినా నోరు విప్పే అవకాశం గిరిజన మహిళా ఎమ్మెల్యేలకు దక్కలేదు. ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతం నుంచి ఎన్నికైన గిరిజన మహిళా ప్రతినిధుల్లో పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతికి ఒక్కరోజు కూడా మాట్లాడే అవకాశం లభించలేదు. విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణి నోరు విప్పేందుకు ఆమెకు అవకాశం కల్పించలేదు. అరకు ఎమ్మెల్యే ఈశ్వరి పరిస్థితి కూడా అంతే. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పరిస్థితి మరీ అధ్వానం. అసెంబ్లీలో ఆమెను పట్టించుకొనేవారే ఉండరు. అధికార పార్టీలో గిరిజన, దళితులకు ప్రాధాన్యం లేదని తమ పార్టీ నేతలు తరచూ విమర్శిస్తూ ఉంటారని, తమ వారికి అసలైన ప్రతినిధి తామేనని కూడా చెబుతారని, కానీ, తమను కనీసం పట్టించుకోవడం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వారి అనుచర వర్గాలు వివరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ రోజా వారికి అడ్డుపడుతున్నారని చెబుతున్నాయి. రోజా తరహాలోనే రాయలసీమకు చెందిన అగ్రకుల మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారని, కానీ గిరిజన, దళిత ఎమ్మెల్యేలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదని గుర్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చలో ‘నేను తల్లిని పోగొట్టుకున్నా’ అంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మొదటి సమావేశంలోనే మాట్లాడారని, మహిళా సమస్యలపై గౌరు చరితా రెడ్డి మాట్లాడారని, ఉత్తరాంధ్రలోని గిరిజన మహిళా ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి, మీడియా పాయింట్‌కు వెళ్లి మాట్లాడదామని అనుకున్నా రోజా వారికి లీడర్‌లా వెంట వస్తూ ఆమే మాట్లాడుతున్నారని అంటున్నారు. మహిళల విషయంలో రోజా తీరు ఇలా ఉంటే, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తమ గొంతు నొక్కుతున్నారని దళిత ఎమ్మెల్యేలు వాపోతున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం సరిగా రావడం లేదంటూ మూడు రోజుల కిందట దళిత ఎమ్మెల్యేలంతా మీడియా పాయింట్‌కు వచ్చారు. అదే సమయంలో, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతున్నారు. డేవిడ్‌రాజు, మరో ఆరుగురు దళిత ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘వద్దు.. మాట్లాడొద్దు’ అని చెవిరెడ్డి ఆదేశించారు. దీంతో, అవాక్కయిన డేవిడ్‌రాజు నిశ్చేష్టుడై ఉండిపోగా.. ‘నువ్వు మాట్లాడన్నా..’ అని ఆదిమూలం సురేశ్‌ ప్రోత్సహించారు. దాంతో, మాట్లాడడానికి డేవిడ్‌రాజు సిద్ధపడగా, ‘‘అరె.. చెబితే అర్థం కాదా..? పార్టీ అనుమతి లేకుండా ఎలా మాట్లాడతారు..? పక్కకు రండి’’ అంటూ గద్దించారు. దీంతో, రెండు నిమిషాలపాటు అలాగే నిలుచున్న డేవిడ్‌రాజు, ఇతర దళిత ఎమ్మెల్యేలు అవమాన భారంతో పక్కకు వెళ్లిపోయారు. తెలుగుదేశంలో మంత్రులు రావెల కిశోర్‌, పీతల సుజాత, సీనియర్‌ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, విద్యావంతుడు శ్రావణ్‌కుమార్‌, విప్‌ యామినీబాల.. ఇలా దళితులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆ ప్రాధాన్యంలో తమ పార్టీ తమకు కనీసం ఒక్క శాతం కూడా ఇవ్వడం లేదని వారంతా వాపోయినట్లు తెలిసింది. ప్రతి విషయంలోనూ రాయలసీమ రెడ్లే మాట్లాడుతున్నారని, ప్రతిపక్షనేత జగన్‌ కాకపోతే రోజా, కాదంటే చెవిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడతారని, బడ్జెట్‌లో రాజేంద్రనాథ్‌ రెడ్డి, రైతు సమస్యలు, నీటిపారుదలపై విశ్వేశ్వర రెడ్డి ముందుకు వస్తారని, కానీ, ఎక్కడా దళిత, గిరిజనులకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపు తమకు అవకాశం కల్పించకపోతే బహిరంగంగా నిరసన వ్యక్తం చేయాలనే ఆలోచనలో కొందరు ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. పార్టీలో తమకు జరుగుతున్న అవమానాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని వైసీపీలోని దళిత, గిరిజన, ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment