Saturday 7 March 2015

అగ్లీ సీన్స్‌ చూస్తారు

అగ్లీ సీన్స్‌ చూస్తారు

బీఏసీ సమావేశంలో జగన్‌ బెదిరింపు వ్యాఖ్య
మంచి పద్ధతి కాదు.. మందలించిన స్పీకర్‌
సభ పద్ధతులు తెలుసుకోవాలని హితవు
హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ‘మాకు అసెంబ్లీలో మాట్లాడటానికి తగినంత సమయం ఇవ్వకపోతే సభలో అసహ్యకరమైన దృశ్యాలు (అగ్లీ సీన్స్‌) చూస్తారు...’ అని ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం స్పీకర్‌ ఛాంబర్లో జరిగిన సభా వ్యవహారాల సంఘం (బీఏసీ) సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య కలకలం సృష్టించింది. సభలో ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై జరిగిన చర్చలో ఒక దశలో ఆవేశానికి లోనైన జగన్‌ హెచ్చరిక ధోరణిలో ఈ వ్యాఖ్య చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకొని జగన్‌ను మందలించినట్లు సమాచారం. ‘ఒక స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అసెంబ్లీ నిర్వహణలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. దాని ప్రకారం సభ నడుస్తుంది. మీరు సభకు మొదటిసారి వచ్చారు. సభ నియమాలు, పద్ధతులు తెలుసుకోండి. వ్యక్తులను బట్టి సభ నడవదు’ అని కోడెల అన్నారు. ఈ సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్‌ వ్యాఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జగన్‌ అసెంబ్లీకి కొత్తగా వచ్చారు. తెలియకపోవచ్చు. మీరు అనుభవం ఉన్న సభ్యులు. మీరైనా చెప్పండి. ఏదంటే అది మాట్లాడటం సరికాదు’ అని వైసీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. దీంతో, నె హ్రూ ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనం వహించారు. సభలో ఎవరు ఎంత సేపు మాట్లాడాలన్న దానిపై జరిగిన వాగ్వివాదం దీనికి దారితీసింది.
గవర్నర్‌ ప్రసంగంపై అధికారపక్షానికి అరవై శాతం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి నలభై శాతం సమయం ఇస్తున్నట్లు ఈ సమావేశంలో స్పీకర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే సమయం కూడా అధికార పార్టీ సమయంలో కలుస్తుందా అని జగన్‌ అడిగారు. సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి సమయం ఇందులో కలవదని, అది అదనమని స్పీకర్‌ చెప్పారు. దీంతో... ప్రతిపక్ష నేతగా ఉన్న తన సమయం కూడా తమ పార్టీ సమయంలో కలపకుండా తనకు అదనంగా సమయం ఇవ్వాలని జగన్‌ కోరారు. ‘అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముఖ్యమంత్రికి ఎప్పుడైనా ఏ అంశంపై అయినా మాట్లాడే అవకాశం ఉంటుంది. అది అధికార పార్టీ సమయం కిందకు రాదు. అలాగే బడ్జెట్‌పై మాట్లాడేటప్పుడు ఆర్థిక మంత్రికి కూడా అలాంటి సదుపాయమే ఉంటుంది. అది అధికార పార్టీ సమయం కిందకు రాదు. ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం ప్రతిపక్ష నేత కావాలంటే కుదరదు. అయినా నేను సభలో మీరు ఎప్పుడు మాట్లాడతానన్నా సమయం ఇస్తూనే ఉన్నాను. మీరు ఎప్పుడైనా మాట్లాడాలనుకొంటే అడగండి. ఇస్తాను’ అని స్పీకర్‌ చెప్పారు. తాను పోయినసారి బడ్జెట్‌పై మాట్లాడాలనుకొంటే తనకు సమయం ఇవ్వలేదని, తాను బయట మీడియా వద్ద మాట్లాడాల్సి వచ్చిందని జగన్‌ ఆరోపించారు. జగన్‌ కనీసం చెయ్యి కూడా ఎత్తకుండా తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తే ఎలా అని స్పీకర్‌ ఎదురు ప్రశ్నించారు. ఈ దశలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ ‘ఇప్పుడు మీ విషయంలో స్పీకర్‌ చాలా ఉదారంగా ఉంటున్నారు. నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాకు మైక్‌ రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వచ్చేది. మా పార్టీ వాళ్ళ సమయం మొత్తం తీసుకొని నేనే మాట్లాడేవాడిని. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి’ అని సూచించారు. కాగా, సభను మరికొన్ని రోజులు పొడిగించాలని వైసీపీ సభ్యులు కోరారు. 28న శ్రీరామనవమి, ఆ తర్వాతి రోజు ఆదివారం ఉన్నాయని, అందువల్లే 27తో సభ ముగించాలని అనుకొన్నామని ఆర్థికమంత్రి యనమల వివరించారు. కాగా, తమ ప్రాధాన్యాలను వివరిస్తూ 23అంశాలతో వైసీపీ ఒక జాబితాను స్పీకర్‌కు అందజేసింది. 13అంశాలతో అధికార టీడీపీ ఒక జాబితా ఇచ్చింది. వివిధ రూపాల్లో వీటిని సభలో చర్చకు తీసుకొంటానని స్పీకర్‌ చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంపై చర్చ తర్వాత పోలవరం ప్రాజెక్టుపై చర్చ తీసుకోవాలని స్థూలంగా నిర్ణయించారు. కాగా, మంత్రుల వివరణ సమయాన్ని కూడా టీడీపీ ఖాతాలో వేయాలనడం జగన్‌ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.

No comments:

Post a Comment