Saturday, 21 March 2015

ప్రపంచనగరంగా ఏపి రాజధానిని నిర్మిస్తాం

ప్రపంచనగరంగా ఏపి రాజధానిని నిర్మిస్తాం
ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం
రాష్ర్టాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలి
ఉగాది వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌, మార్చి 21 : ప్రపంచనగరంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల జీవితాల్లో ఈ ఉగాది వెలుగు నింపాలని ఆకాంక్షించారు. తుళ్లూరు ప్రాంత రైతులను ఎప్పటికీ మరిచిపోనని, ఒక్క రైతుకూ అన్యాయం జరగన్విమని చంద్రబాబు తెలిపారు.
 
రైతులకు ఇప్పటికే మంచి ప్యాకేజి ఇచ్చామన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి పేదలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు నాలుగు నగరాలను హైదరాబాద్‌లా తీర్చదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్‌కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నామన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు.
 
జపాన్‌,జర్మనీ తరహాలో ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ నూతన రాజధాని వైపు వచ్చేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తుళ్లూరు పరిసరాలను చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందన్నారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, దాని ఫలితాన్ని కాంగ్రెస్‌ అనుభవిస్తోందని చంద్రబాబు అన్నారు.
 
పోలవరం పూర్తి అయ్యేలోపు పట్టిసీమతో రాయసీమకు సాగునీరు అందజేస్తామని తేల్చిచెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నామని మరోసారి సీఎం స్పష్టం చేశారు.
 
ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. కుటుంబంలోని ఒక్కొక్కరికి 5 కిలోల చొపున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రాష్ర్టాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ అసూయపడి, కుళ్లికుళ్లిపోయే విధంగా ఏపీ అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

No comments:

Post a Comment