Saturday 7 March 2015

ఏపీ హోదాకు చట్టబద్ధత కల్పించలేదు - Venkayya

ఏపీ హోదాకు చట్టబద్ధత కల్పించలేదు

అందుకే ఇప్పుడు ఇబ్బందులు : వెంకయ్య
హైదరాబాద్‌, నెల్లూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశానికి యూపీఏ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదని, ఈ అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో పెట్టలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. చట్టంలో పెట్టకపోయినా మేం మాట ఇచ్చాం అని అంటున్నారని, మాట ఇస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయని తాను అంటే దానికి తప్పుడు అర్థాలు తీ స్తున్నారని హైదరాబాద్‌, నెల్లూరుల్లో మీడియాలో అన్నా రు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు మాటలు చెప్పిందే గానీ చట్టబద్ధత కల్పించలేదని, కానీ, కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పుడు చట్టసభల్లో అర్ధం లేని వాదనలు చేస్తున్నారని తప్పుబట్టారు. అలాగే, పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తున్నట్లు చెప్పారని, కానీ అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్‌ జారీ చేయలేదని తెలిపారు. .నవ్యాంధ్ర రాజధానికి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉం దని, అయితే, రాజధానికి సంబంధించిన భూ సమీకరణ నివేదికలను కేం ద్రానికి పంపాల్సి ఉందని, అవి వచ్చిన తర్వాత మరిన్ని నిధులు వస్తాయని వివరించారు. నవ్యాంధ్రకు వెయ్యి కోట్లు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ హయాం నుంచి ఎన్డీయేకు అప్పుల వారసత్వం మాత్రమే లభించిందని,దానిని సరిదిద్దే ప్రయత్నాన్ని అక్కడ మోదీ, ఇక్కడ చంద్రబాబు చేస్తున్నారని వివరించారు.
ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఎన్డీయే కూటమిలోంచి నువ్వు బయటకు వచ్చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని, ‘ఆయన బయటకు వచ్చేస్తే ఏం నువ్వు లోపలికి వెళ్లిపోవాలనా?’ అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి అన్ని భూములు ఎందుకని ప్రశ్నిస్తున్న వారిని వెంకయ్య నాయుడు తప్పుబట్టారు. ‘‘రాజధాని అంటే దానికి కావాల్సిన సదుపాయాలన్నీ అందులో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు రావాలి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రాకవేత్తలు రావాలి. రాజధాని అంటే కేవలం ఆఫీసులు కట్టుకుంటే ఎవరూ అక్కడికి రాడు. ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంప్లాయిమెంట్‌, ఎకనామిక్‌ ఆపర్చ్యునిటీ, ఆస్పత్రులు, పర్యాటక సదుపాయాలు.. ఇవన్నీ కల్పిస్తే రాజధాని పుంజుకుంటుంది. దానినిచూసి పెట్టుబడులు పెట్టేవాళ్లు వస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అసాధ్యమనుకున్న పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ బృందం కలిసి అద్భుతంగా పూర్తి చేసింది. ఎవరినీ ఒత్తిడి చేయకుండా స్వేచ్ఛగా రైతులకు నచ్చచెప్పి భూ సమీకరణ చేయడం నిజంగా గొప్ప విషయం. అభినందించాల్సిన విషయం’’ అని కొనియాడారు. సమీకరించిన భూమిలో ఎకరాకు సగం భూమి మౌలిక సదుపాయాలకు పోతుందని, మిగిలిన దానిలో వెయ్యి నుంచి 1300 గజాలను రైతులకు ఇస్తున్నారని, ఇటువంటి సందర్భాల్లో ప్రతి దానికీ పెడర్థాలు తీయడం మంచిది కాదని హితవు పలికారు. హైదరాబాద్‌ నగరానిది అంతర్జాతీయ ఆకర్షణ అని, అందుకే ప్రపంచవ్యాప్తంగా అంతా ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్‌లోనే పెట్టుబడులు పెడతామని అనడానికి కారణం ఇక్కడి మౌలిక సదుపాయాలేనని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్నారు. నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూ విషయంలో కాంగ్రె్‌సకు ఎదురు దెబ్బ తగిలిందని వివరించారు. నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని భావించి పార్లమెంటులో గొడవ చేశారని, కానీ ఆ అనుమతిని 2013లోనే ఇచ్చారని హోం మంత్రి చెప్పడంతో నీరుగారిపోయారని కాంగ్రె్‌సను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment