Wednesday 4 March 2015

ఇది నత్తకు మేనత్త! - పోలవరం

ఇది నత్తకు మేనత్త!

పోలవరం ప్రాజెక్టుకు జాప్యం శాపం.. 16వేల కోట్ల ప్రాజెక్టు 100 కోట్ల కేటాయింపు
అందులో సగం జీతాలకే సరి!
పాత వ్యయం చెల్లింపుపైనా మెలిక
విభజన చట్టంలోనే ‘జాతీయ హోదా’
ఇప్పటికీ అసంపూర్ణంగానే ప్రాజెక్టు అథారిటీ
లభించని పెట్టుబడులకు క్లియరెన్స్‌
మోదీ సర్కారు తీరుపై జనం గుర్రు
(హైదరాబాద్‌, న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి) పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం... పదహారు వేల కోట్ల రూపాయలు! దీనిని నాలుగేళ్లలో పూర్తి చేయాలని ఏడాది క్రితం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన... ఏడాదికి సగటున కనీసం నాలుగు వేల కోట్లు ఖర్చుపెట్టాలి. కానీ... 2015-16 బడ్జెట్‌లో కేంద్రం దీనికి కేటాయించింది కేవలం వంద కోట్లు! పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం పెద్దలు చెప్పే మాటలకు, చేసే చర్యలకు పొంతన లేదనేందుకు ఇదే పెద్ద నిదర్శనం. యూపీఏ సర్కారు విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేసింది. దీనిపై తెలంగాణకు అభ్యంతరాలున్నప్పటికీ... విభజన తర్వాత ఏర్పడే తెలంగాణ రాష్ట్రం పోలవరానికి ఒప్పుకొన్నట్లే అని చట్టంలో తేల్చేసింది. ఇక... మోదీ సర్కారు తన మొదటి కేబినెట్‌లోనే ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. దీంతో... ప్రాజెక్టు పనులు పరుగులు తీస్తాయని సీమాంధ్రులు భావించారు. కానీ, ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రానిది నత్తలతో పోటీపడే తత్వమని తాజా ఉదంతాలతో తేలిపోయింది.
కేటాయింపులు ఇలాగేనా...
పోలవరం ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించారు. ‘ఇదే మొదటి బడ్జెట్‌ కదా! అందునా పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా కాదు! ఫర్వాలేదులే’ అని ఏపీ సర్కారు భావించింది. కేంద్ర కేటాయింపులు నమ్ముకొని రూ.304 కోట్లు వ్యయం చేసింది. ఈ ఖర్చుకు సంబంధించిన లెక్కలూ వివరించి చెప్పింది. కానీ... ఇప్పటిదాకా కేంద్రం నుంచి పైసా విడుదల కాలేదు. పైగా... మేం రూ.250 కోట్లు కేటాయిస్తే మీరు అదనంగా 64 కోట్లు ఎలా ఖర్చుచేస్తారంటూ దబాయింపు! ఆ సంగతి వదిలేద్దాం! 2015-16 ప్రాజెక్టులోనైనా పోలవరానికి తగిన స్థాయిలో కేటాయింపులు ఉంటాయని ఏపీ సర్కారు కొండంత ఆశ పెట్టుకుంది. వీరి ఆశలన్నీ గంగలో కలిపేస్తూ కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. దీంతో... అటు సర్కారుకు, ఇటు ప్రజలకు పెద్ద షాక్‌ తగిలింది. ‘‘పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినందున... దానికోసం ప్రత్యేక హెడ్‌ఆఫ్‌ అకౌంట్‌ (నిధుల విడుదల కోసం ప్రత్యేక ఖాతా)ను ఏర్పాటు చేయాలి. మరో మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నందున... ఈ బడ్జెట్‌లో రూ.7 కోట్లు కేటాయించాలి. ఇప్పటికే మేం పెట్టిన ఖర్చు రూ.5వేల కోట్లను కూడా మీరే ఇవ్వాలి’’ అని ఏపీ సర్కారు కేంద్రానికి పలు లేఖలు రాసింది. అయితే, ఇంతా చేసి... చివరికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ వందకోట్లలో సగం సిబ్బంది జీతాలకే సరిపోతుంది! ఇక... ప్రాజెక్టు కట్టేదెలా? అది పూర్తయ్యేదెప్పుడు? ఈ ప్రశ్నలకు మోదీ సర్కారేసమాధానం చెప్పాలి. అయితే, ఏఐబీపీ స్థానంలో ప్రవేశపెట్టిన పథకం నుంచి పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్ర వర్గాలు అంటున్నాయి. ఈ పథకానికి, అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిందే నాలుగు వేల కోట్లు. అందులో వెయ్యి కోట్లు వరదల నిర్వహణకే! మరి... దీనిని నుంచి పోలవరానికి ఇచ్చేదేమిటి? ఇక... మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 16,010 కోట్లకు ఇప్పటి వరకు కేంద్రం పెట్టుబడి అనుమతి (క్యాపిటల్‌ క్లియరెన్స్‌) ఇవ్వలేదు. కేంద్రం వ్యూహాత్మకంగానే దీనిని పెండింగ్‌లో పెట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెట్టుకున్న లక్ష్యంలో ఏడాది కరిగిపోయింది. మిగిలింది మూడేళ్లే. ఈ లెక్కన ఏటా కనీసం 5వేల కోట్లు కేటాయించి విడుదల చేయాలి. మూడేళ్లు కాదు... ఐదేళ్లు అనుకుంటే, ఏటా 3వేల కోట్లు కేటాయించాలి. కానీ... ఈ వంద కోట్ల లెక్కేమిటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. ఇప్పటికీ 12 గ్రామాల్లో భూ సేకరణ క్లిష్టమైన సమస్యగా ఉంది. దాన్ని పరిష్కరించాలంటే 300 కోట్లపైనే అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికి భిన్నంగా ఏటేటా వంద, ఆపైన నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేయాలంటే కొన్ని యుగాలు పడుతుందని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. జాప్యం జరిగేకొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతూ పోతుందని హెచ్చరిస్తున్నారు.
అథారిటీ ఎక్కడ?
పోలవరం పేరుకే ‘జాతీయ’ ప్రాజెక్టుగా మారింది. సొంతంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై కేంద్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి ఒకేఒక్కసారి సమీక్షించారు. అదికూడా... మంగళవారం! అందులోనూ, బీజేపీపై ఏపీలో ఆగ్రహం రగులుతోందనే సమాచారంతో ఆమె ఈ అంశంపై అధికారులతో సమీక్షించారు. ‘అనుమానాలు వద్దు. ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబు కూడా మద్దతుతో సహకరించాలి’ అంటూ ఆమె పాతపాటే పాడారు. ఇక... పోలవరం ప్రాజెక్టు అథారిటీని కూడా కేంద్రం తూతూమంత్రంగా ఏర్పాటు చేసింది. పూర్తిస్థాయి అథారిటీని నియమించకుండా... సీఈవోను మాత్రం నియమించి చేతులు దులుపుకొంది. ఇక... అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని కూడా ఏపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనిని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నాడు మోదీ మాట...
‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై చాలా కాలమైంది. అయినా, ఇంకా నత్తనడకన నడుస్తూనే ఉంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ హోదా కల్పిస్తాం. ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాం!’’
- నరేంద్ర మోదీ (గత ఏడాది మే 2న పశ్చిమ గోదావరి జిల్లా
భీమవరం ఎన్నికల ప్రచార సభలో)
నాటి మాటలు నేడేవీ?
ఎన్నికల ముందు, విపక్షంలో ఉండగా బీజేపీ నేతలు కూడా గట్టిగా పోలవరం పాట పాడారు. నాడు సీమాంధ్ర బీజేపీ నేతలు ‘పోలవరం యాత్ర’ కూడా నిర్వహించారు. ఇక... బీజేపీ తెలంగాణ నేతలకు సైతం ప్రాజెక్టు డిజైన్‌పై మాత్రమే అభ్యంతరాలు ఉండేవి. పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నదే వారి డిమాండ్‌. ఆ తర్వాత... విభజన చట్టంలో యూపీఏ సర్కారు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ‘ఇదంతా మా పోరాటం వల్లే’ అని క్రెడిట్‌ను బీజేపీ నేతలు తమ ఖాతాలో వేసుకున్నారు కూడా. ఇప్పుడు.. తామే స్వయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తూతూ మంత్రపు కేటాయింపులతో పోలవరానికి తూట్లు పొడుస్తోంది.
విభజన చట్టంలో పోల‘వరం’
‘‘పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలవరం సాగునీటి ప్రాజెక్టును కేంద్రమే ఆధీనంలోకి తీసుకోవడం ఆవశ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీ, తదితర అనుమతులను పొంది... నిబంధనల మేరకు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించి... ప్రాజెక్టును చేపట్టడం కేంద్ర బాధ్యత.’’

No comments:

Post a Comment