Wednesday, 25 March 2015

హషీంపురా మారణకాండకు కారకులెవరు ?

హషీంపురా మారణకాండకు కారకులెవరు ?

17:03 - March 25, 2015
బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తాయి..శవాలు కాల్వల్లో తేలుతాయి..బరిసెలు రక్త తర్పణాన్ని కోరుతాయి..కత్తులు సున్నిత దేహాలపై నాట్యం చేస్తాయి..అమాయకులను చీల్చి చెండాడుతాయి.వెంటాడి, వేటాడి బలి తీసుకుంటాయి..కానీ, చివరికి అక్కడ బాధితులు మాత్రమే ఉంటారు. తప్ప హంతకులుండరు.. ఎవరికీ శిక్షలు పడవు.. ఏ శక్తులు వారికి అండగా నిలుస్తున్నాయి ? ఏ ధర్మ శాస్త్రాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి ? ఈ దేశంలో మైనారిటీలపై, దళితులపై నిత్యం జరుగుతున్న ఎన్నో దాడులు ఏ పరిస్థితిలో ముగుస్తున్నాయి ? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ సమాధానాలు మాత్రం లేవు. కన్నీళ్లున్నాయి. సాంత్వన లేదు. హతులున్నారు. హంతకులు లేరు. కర్మభూమిలో దళితులు, మైనారిటీలపై అనాదిగా జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు.
ఢిల్లీ కీలక తీర్పు..
హషీంపుర మారణకాండపై ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 16మంది నిందితులు నిర్దోషులని తీర్పిచ్చింది. 1987లో జరిగిన ఈ ఘటనలో సరైన ఆధారాలు లేవని చెప్పింది. అసలీ ఘటనలో ఏం జరిగింది ? రెండున్నర దశాబ్దాల క్రితం జరిగిన మీరట్ ఊచకోత వివరాలేంటి ? ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ని లెక్కచేయలేదు. నిందితుల సర్వీసు రికార్డులో ఈ ప్రస్తావన లేదు. ప్రభుత్వాలు మారాయి. ఉద్యోగులు రిటైర్డ్ కూడా అవుతున్నారు. కానీ, ఏ ఫలితం లేదు. నరికిన కత్తులేమవవుతున్నాయి? గుండెల్లో దించిన బరిసెలెటుపోతున్నాయి ? బుల్లెట్టును పేల్చిన చేతులు ఎక్కడ పాపాన్ని కడుక్కుంటున్నాయి ? ఒక్క మీరట్ ఘటన మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలు అనేకం జరిగాయి. రక్తం చిందింది. కానీ, కత్తికి మరకలు అంటలేదు. మారణకాండ జరిగింది కానీ, హంతకులు మాత్రం లేరు. ఒక చుండూరు, ఒక లక్షింపేట, బీహార్ లో లక్ష్మణ్ పూర్ బాతె, బఠానీ టోలా కేసు ఇలా నిత్యం దళితుల, మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రక్త తర్పణం చేస్తూనే ఉన్నాయి. కానీ, ఆధారాలు లేని సందర్భాలే ఎక్కువ.
చంపిన వాడికి శిక్షలు పడవా ?
ఓ పక్క విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలిన బాధితులు దీనంగా కనిపిస్తున్నారు. కానీ, మారణకాండకు కారణమైన నిందితుల ఆధారాలు మాత్రం ప్రభుత్వాలు కోర్టుముందుంచలేకపోతున్నాయి ఈ దేశంలో దళితులను, మైనార్టీలను చంపిన వాడికి శిక్షలు పడవా..? స్వతంత్ర భారతంలో నిత్యం దళితులపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అవమానాలెన్నో. అమానవీయంగా, అన్యాయంగా ఎందరినో ఈ దురహంకారం బలిగొంటోంది. ఏళ్లకేళ్లు న్యాయం జరగక అభాగ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపడంలో సర్కార్లు విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా మీరట్ కేసులో సాక్ష్యాలు లేవంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి పెద్ద ఉదాహరణ. 

No comments:

Post a Comment