|
ఐటీ చట్టంలోని 66-ఏ సెక్షన్ కొట్టివేత.. అది రాజ్యాంగ విరుద్ధం.. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరం
ఆ నిబంధనల్లో స్పష్టత లేదు.. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారీమన్ ధర్మాసనం సంచలన తీర్పు
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కొట్టివేత
జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారీమన్ధర్మాసనం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, మార్చి 24: షహీన్, రీనూ... మహారాష్ట్రలోని ఠాణె జిల్లా యువతులు. బాల్ ఠాక్రే మృతికి సంతాపంగా శివసేన ముంబై బంద్‌కు పిలుపు ఇవ్వడాన్ని ఫేస్‌బుక్‌లో ఒకరు తప్పుబట్టారు. మరొకరు ఈ కామెం ట్‌కు ‘లైక్’ కొట్టారు. అంతే... పోలీసులు వీరిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇదంతా ‘సైబర్ లా’గా పేరు పొందిన ‘ఇన్‌ఫర్మేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 66ఏ ఇచ్చిన అధికారం! ఇది అప్పట్లో దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఈ సమాచార యుగంలో, సమాచార మాధ్యమాలద్వారా భావ ప్రకటన నేరమా? అని జనమంతా ఘోషించారు. ఇక మమతా బెనర్జీపై వ్యంగ్య చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో షేర్‌చేసిన ప్రొఫెసర్, యూపీ మంత్రి ఆజంఖాన్‌పై కామెంట్ చేసిన ఇంటర్ విద్యార్థి, ఐఏఎస్ దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్‌ను ఫేస్‌బుక్‌లో తప్పుపట్టిన రచయిత్రి... ఇలా ‘66ఏ’ సెక్షన్ బాధితులెందరో! ఇప్పుడీ అహేతుక, క్రూర సెక్షన్‌ను సర్వోన్నత న్యాయస్థానం చాపచుట్టి పక్కనపెట్టింది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌ల ధర్మాసనం మంగళవారం ఈ చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌వంటి మాధ్యమాలను వాడే కోట్లాది పౌరులపై వేలాడుతున్న ‘66ఏ’ కత్తిని పక్కన పడేసింది. షహీన్, రీనాల తరఫున 2012లో న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్ తొలుత ప్రజాహిత వ్యాజ్యం (పిల్) వేశారు. తర్వాత మరికొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు సుప్రీం కోర్టు గొడుగు పట్టింది. ధర్మాసనం తరఫున జస్టిస్ నారీమన్ తీర్పు వినిపిం చారు. వెబ్‌సైట్లలో ‘తీవ్ర ప్రమాదకర వ్యా ఖ్యలు’ చేసినవారిపై కేసులు పెట్టవచ్చునని ఈ చట్టం చెబుతోంది. అయితే... అవి తీవ్ర ప్రమాదకరం/అభ్యంతరకరం/దురుద్దేశపూరితం అని నిర్ణయించేదెవరన్నదే అసలు ప్రశ్న! ఠాణాలో పోలీసులు ముందే ‘తీర్పు’ ఇచ్చేసి, కేసు పెట్టేస్తారా? అన్నదే ప్రధాన అభ్యంతరం! తీర్పులో సుప్రీంకూడా ఇవే ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘రెచ్చగొట్టే, ఇబ్బందిపెట్టే, తీవ్ర ప్రమాదకరమైన... అంటూ ఇందులో పలు పదబంధాలున్నా యి. వీటిలో స్పష్టత లేదు. నేర స్వరూపం తెలుసుకోవడం పోలీసులకుగానీ, అది చేసినవారికీ కష్టం’’ అని స్పష్టం చేసింది. ఒక వ్యాఖ్య ప్రమాదకరమా? అత్యంత ప్రమాదకరమా? అనేదానిపై బ్రిటన్ కోర్టుల తీర్పులనూ ఉటంకించింది. ‘‘న్యాయశాస్త్ర శిక్షణ పొందినవారు మాత్రమే దీనిపై నిర్ధారణకు రాగలరు. చట్టాన్ని అమలు చేసేవారికి (పోలీసులు) ఇదెలా సాధ్యం? ఒకరికి ప్రమాదకరం (అఫెన్సివ్) అనిపించింది, మరొకరికి కాకపోవచ్చు’’ అని తెలిపింది. ఇంట ర్నెట్‌లో వ్యాఖ్యలను ‘శాంతి భద్రతల’తో ముడిపెట్టడం కుదరదని తెలిపింది. పరువునష్టానికి పాల్పడ్డారనిగానీ, ‘నేరానికి పాల్పడేలా ప్రేరేపించారు’ అనేందుకు గానీ అవసరమైన అంశాలేవీ సెక్షన్ 66ఏలో లేవని పేర్కొంది. ‘‘లిఖితపూర్వక వ్యాఖ్యలు ఒక దృక్కోణంతో వ్యక్తంచేసే అభిప్రాయాలు మాత్రమే. ఇబ్బంది పెట్ట డం, ప్రమాదకారిగా వ్యవహరించడం వంటివి కొన్ని సందర్భాల్లో శిక్షా స్మృతికింద నేరాలు కావచ్చు. కానీ.... ఆ వ్యాఖ్యలు మాత్రం నేరం కాదు. అందువల్ల... ‘నేరానికి ఉసి గొల్పడం’తో 66ఏ సెక్షన్‌కు సంబంధమే లేదు. పరువు నష్టానికీ సంబంధం లేదు’’ అని కోర్టు తెలిపింది. వెరసి... 66ఏ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎక్కువంది. అయితే... ఇలా కాకుండా చర్యలు తీసుకుంటామన్న ఎన్డీయే సర్కారు హామీతో సంతృప్తి చెందలేదు. ‘‘రాబోయే ప్రభుత్వం తరఫున మీరెలా పూచీ పడతార’’ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ తన తీర్పును వెల్లడించింది.
66(ఏ) ఏం చెప్తోంది..? ‘‘ఏ వ్యక్తి అయినా కంప్యూటర్ ద్వారా లేదా సమాచార పరికరం ద్వారా తీవ్ర ప్రమాదకర (గ్రాస్లీ అఫెన్సివ్) లేదా భయపెట్టే వ్యాఖ్యలు చేస్తే... జరిమానా, మూడేళ్ల జైలు శిక్షకు అర్హులు.’’ సుప్రీం విచారణ సాగిందిలా.... 27 అక్టోబర్ 2009: ఐటీ చట్టం-2000కు సవరణతో యూపీఏ సర్కారు సెక్షన్ 66(ఏ)ను ప్రవేశపెట్టింది. 19 నవంబర్ 2012: బాల్‌ఠాక్రే మృతికి నిరసనగా బంద్ ను ఓ బాలిక ఫేస్‌బుక్‌లో ప్రశ్నిస్తే, మరో బాలిక మద్దతు (లైక్) తెలిపింది. దీంతో షాహిన్, రినూ శ్రీనివాసన్ అనే బాలికలను పోలీసులు అరెస్టు చేశారు. 29 నవంబర్ 2012: సెక్షన్ 66(ఏ)ను ప్రశ్నిస్తూ శ్రేయా సింఘాల్ అనే న్యాయ విద్యార్థి సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. 16 మే 2013: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొస్తే అరెస్టుకు ఐజీ లేదా డీసీపీ వంటి సీనియర్ అధికారి అనుమతి ఉండాలని సుప్రీం కోర్టు సూచించింది. 18 మార్చి 2015: ఎస్పీ నేత అజం ఖాన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలతో ఒక విద్యార్థిని యూపీలో అరెస్టు చేశారు. 20 మార్చి 2015: అరెస్టుకు కారణాలు తెలపాలని సుప్రీం ఆదేశించింది. 24 మార్చి 2015: ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ)ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఎందరో బాధితులు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీపై వ్యంగ్య చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు 2012లో జాదవ్‌పూర్ వర్సిటీ ప్రొఫెసర్ అంబికేశ్‌ను అరెస్టు చేశారు. పార్లమెంటు, రాజ్యాంగం సమర్థంగా పని చేయడం లేదంటూ అసీమ్ త్రివేదీ కార్టూన్లు వేయడంతో... రాజద్రోహం నేరంపై 2012లో ఆయన్ను అరెస్టు చేశారు. కశ్మీర్‌లోని కిస్త్వార్ జిల్లా యువకులు ముగ్గురు దైవదూషణకు పాల్పడుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టారంటూ 2012లో అరెస్టు చేసి, 40రోజులపాటు జైలుకు పంపారు. యూపీలోని రాంపూర్‌లో మసీదు వద్ద ఒక గోడ కూల్చివేతకు ఆదేశించిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో రాంపూర్ పట్టణం సమాజ్‌వాదీ పార్టీనేత ఆజంఖాన్ నియంత్రణలో ఉన్నందునే నాగ్‌పాల్‌ను సస్పెండ్ చేశారని కన్వాల్ భారతి ఫేస్‌బుక్‌లో విమర్శించగా 2013ఆగస్టులో అరెస్టు చేశారు. ప్రధానిగా మోదీ ఎన్నికైతే దేశంలో మారణహోమం ప్రారంభమవుతుందని దేవు చోదంకర్ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో నిరుడు అరెస్టయ్యాడు. మోదీ ముఖంపై బూటుతో కొట్టినట్లు కనిపించే ఫొటోలను, అసంబద్ధ వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు రాజేశ్ అనే సీపీఎం కార్యకర్తను అరెస్టు చేశారు.
కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీని ‘అవినీతి పరుడ’ంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్య చేసినందుకు పుదుచ్చేరి పోలీసులు 2012లో రవి శ్రీనివాసన్‌ను అరెస్టు చేశారు.
మా వైఖరి భిన్నం: ఎన్డీయే
న్యూఢిల్లీ, మార్చి 24: ఐటీ చట్టంలోని సెక్షన్ ‘66ఏ’పై యూపీఏతో పోలిస్తే ఎన్డీయే వైఖరి భిన్నమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పుపై సమాచార, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తమకు నచ్చని అసమ్మతి, వ్యంగ్యం తదితర నిరసన రూపాలపై యూపీఏ ఉక్కుపాదం మోపిందన్నారు. దీనికి భిన్నంగా వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నట్టు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశామన్నారు. లోకహిత రీతిలో ఇంటర్‌నెట్ వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందని, సదరు స్వేచ్ఛ రాజ్యాంగ నిబంధన 19(2)లోని అంశాలకు లోబడేలా నియంత్రణను అమలు చేస్తుందని తెలిపారు. ఈ వైఖరి ప్రకారమే రాజకీయ చర్చ, నిజాయతీగల అసమ్మతి, ఆరోగ్యకర హాస్యం-రాజకీయ వ్యంగ్యం వంటివాటిని శిక్షార్హ నిబంధనల దృష్టితో నిర్వచించరాదని స్పష్టం చేశామన్నారు. ఇక జేడీయూ, శివసేన మినహా అన్ని పార్టీలూ సుప్రీం తీర్పుతో ఏకీభవించాయి. తమ హయాంలో ఈ చట్టానికి చేర్చిన సవరణ సవ్యంగా రూపొందకపోవడమేగాక దుర్వినియోగమైందని 2008లో దీన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత, నాటి కేంద్రమంత్రి పి.చిదంబరంతోపాటు మరో నాయకుడు మనీష్ తివారీ అంగీకరించారు. ఓ ‘మంచి’ చట్టాన్ని కొట్టివేయడం సరైన తీర్పు కాదని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. |
No comments:
Post a Comment