Wednesday 25 March 2015

కారుకు ముకుతాడు

కారుకు ముకుతాడు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితం.. దేవీప్రసాద్‌ ఓటమి
టీడీపీ-బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఘనవిజయం
‘హైదరాబాద్‌’ పట్టభద్రుల సీట్లో 13 వేల ఓట్ల మెజారిటీ
తొలి ప్రాధాన్యంతోనే ఖరారు.. కాంగ్రెస్‌కు మూడో స్థానం
నల్లగొండ సీట్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీ
అన్ని పార్టీలూ కుమ్మక్కై నన్ను ఓడించాయి
పార్టీ బలిపశువు చేసిందనటం సరికాదుఫ దేవీప్రసాద్‌ వ్యాఖ్య
హైదరాబాద్‌ సిటీ, నల్లగొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆరు జిల్లాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించినా, దాదాపుగా మంత్రులందరినీ మోహరించినా, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినా... ‘పట్టభద్రులు’ పట్టించుకోలేదు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కారు’ను పూర్తిగా బోల్తా కొట్టించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాదరావు ఓడిపోయారు. బీజేపీ-టీడీపీ అభ్యర్థి రామచంద్రరావు 53,881 సాధించి... టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 13,318 ఓట్ల తేడాతో తొలి ప్రాధాన్య ఓట్లతోనే గెలిచారు. ఇక... నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గంలోనూ ‘కారు’ ఎగుడు దిగుడు దారిలో పడుతూ, లేస్తూ సాగుతోంది. విజయం తీరం చేరుతుందా... లేక మధ్యలోనే ఆగుతుందా అనే ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.
తొలి పోరులో తడబాటు...
తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ తడబడింది. ‘తెలంగాణలో టీడీపీ ఉనికే లేదు. బీజేపీకి బలం లేదు’ అని చెప్పుకొంటున్నప్పటికీ... హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి నియోజకవర్గంలో ఆ కూటమి అభ్యర్థి రామచంద్ర రెడ్డి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడిన, టీఎన్‌జీవో నేతగా, టీఆర్‌ఎస్‌ అండగా, బలమైన అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవీప్రసాదరావు ఓడిపోయారు. ఇక... ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో, ఇతర చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా ప్రచారం చేశారు. అయినా, టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు. ఇక... రెండు నియోజకవర్గాల్లోనూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో ఇదో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి చేదు ఫలితం రావడాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
రౌండు రౌండుకూ...
ఓట్ల లెక్కింపు కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలి రౌండ్‌లోనే రామచంద్రరావుకు 2891 ఓట్ల మెజారిటీ లభించింది. ఆ తర్వాత... రౌండు రౌండుకూ మెజారిటీ పెరుగుతూ పోయింది. మొత్తం నాలుగు రౌండ్లు ముగిసే సరికి రామచంద్రరావుకు 53,881 ఓట్లు పడ్డాయి. దేవీప్రసాద్‌కు 40,653 లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రవికుమార్‌కు మొత్తంగా 2856 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవి బీజేపీ-టీడీపీకి తొలి రౌండ్‌లో వచ్చిన మెజారిటీకంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 1,11,739 ఓట్లు పోల్‌ అయ్యాయి. 8433 ఓట్లు చెల్లలేదు. 521 ఓట్లు ‘నోటా’కు పడ్డాయి. వెరసి... 1,02,785 ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇందులో సగానికిపైగా తొలి ప్రాధాన్య ఓట్లు రామచంద్రరావుకు దక్కడంతో... రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సిన అవసరం లేకపోయింది.
ఓట్ల లెక్క ఇది...
మొత్తం పోలైన ఓట్లు 1,11,739
చెల్లని ఓట్లు 8433
నోటా 521
ఎన్‌. రామచంద్రారావు
(బీజేపీ-టీడీపీ) 53,881
దేవీప్రసాద్‌ (టీఆర్‌ఎస్‌) 40,563
ఏ. రవికుమార్‌ (కాంగ్రెస్‌) 2,856
రాకొండ సుభాష్‌రెడ్డి (స్వతంత్ర) 1831
నల్లగొండలో హోరాహోరీ
- ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
-నాలుగో రౌండు ముగిసేసరికి
- 2860 ఓట్ల మెజారిటీ
నల్లగొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ‘నెమ్మది’గా సాగుతున్న ఈ లెక్కింపు బీజేపీ-టీడీపీలో ఉత్కంఠ రేపుతుండగా... టీఆర్‌ఎస్‌కు టెన్షన్‌ పుట్టిస్తోంది. బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలైంది. సాయంత్రం దాకా బ్యాలెట్లను కట్టలు కట్టడానికే సరిపోయింది. రాత్రి 9.20 గంటలకు మొదటి రౌండ్‌ ఫలితం వెలువడింది. తొలి రౌండులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి... బీజేపీ-టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుపై 1109 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. రాత్రి 11 గంటల సమయంలో రెండో రౌండ్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెజారిటీ తగ్గిపోయింది. మొత్తంగా 1657 ఆధిక్యం లభించింది. అర్ధరాత్రి సమయంలో మూడో రౌండు కూడా ముగిసింది. ఈ రౌండులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 294 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. మూడు రౌండ్లలో కలిసి టీఆర్‌ఎస్‌కు 1951 ఓట్ల మెజారిటీ లభించింది. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 909 ఓట్ల ఆధిక్యం లభించింది. వెరసి... నాలుగు రౌండ్లు ముగిసే సరికి రాజేశ్వర రెడ్డి 2860 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,81,138 లక్షల ఓట్లు ఉండగా... 1.53 లక్షల ఓట్లు పోల్‌ అయ్యాయి. నోటా, చెల్లని ఓట్లను మినహాయించగా మిగిలే ఓట్లలో కనీసం సగం తొలి ప్రాధాన్య ఓట్లు లభిస్తే సరేసరి! లేకపోతే... రెండో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించి విజేతను ప్రకటిస్తారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే... టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లలో ఆధిక్యం సాధించినప్పటికీ, సగానికిపైగా ఓట్లు తెచ్చుకోవడం కష్టమేనని చెబుతున్నారు. రెండో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించాల్సి వస్తే మాత్రం గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఏ విధంగా చూసినా గురువారం మధ్యాహ్నానికిగానీ తుది ఫలితం వెలువడే అవకాశం లేదని చెప్పవచ్చు.
ఇదేమి నత్తనడక...
నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో శ్రుతిమించిన జాప్యంపై అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేయలేదంటూ పెదవి విరిచారు. బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా... తొలి రౌండు ఫలితం వచ్చేసరికి రాత్రి 9.20 గంటలు అయ్యింది. ఈ సమయానికి హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి నియోజకవర్గ తుది ఫలితం కూడా వచ్చేసింది. నల్లగొండలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక్కో రౌండులో 500 చొప్పున బ్యాలెట్లు కేటాయించారు. పోలైన ఓట్లు అధికంగా ఉన్నందున కనీసం 28 టేబుళ్లు ఏర్పాటు చేయాల్సిందని, ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పన కేటాయిస్తే త్వరగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేది. ఇక... సిబ్బంది కేటాయింపులోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేదు. ఉదయం విధుల్లో చేరిన సిబ్బంది మూడు రౌండ్ల కౌంటింగ్‌ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చని మొదట ప్రకటించారు. అయితే... మొదటి రౌండ్‌ పూర్తి కాగానే వీరికి విరామం ఇచ్చారు. ఆ తర్వాత రెండో విడత సిబ్బంది వచ్చి లెక్కింపు ప్రారంభించే సరికి 45 నిమిషాలు గడిచిపోయాయి. ఓట్ల లెక్కింపు సరళి చూస్తే... గురువారం మధ్యాహ్నం దాకా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపించడంలేదు. రెండో ప్రాధాన్య ఓట్లు కూడా లెక్కించాల్సి వస్తే మరింత జాప్యం తప్పదు. ఇక... ఒక్కో రౌండ్‌లో సగటున 10 శాతం వరకు చెల్లని ఓట్లు వస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యం...
1వ రౌండు 1109
2వ రౌండు 488
3వ రౌండు 294
4వ రౌండు 909
మిగిలిన రౌండ్లు 12
తొలి నాలుగు రౌండ్లలో లెక్కించిన ఓట్లు: 40వేలు, టీఆర్‌ఎస్‌: 14,754,
బీజేపీ: 11,894
లెఫ్ట్‌: 3,772
కాంగ్రెస్‌: 3,579
నోటా: 1,743
చెల్లని ఓట్లు: 3,667
అన్ని పార్టీలు కలిసి ఓడించాయి
పార్టీ బలిపశువు చేసిందనటం సరికాదు
రామచంద్రరావుకు శుభాకాంక్షలు
దేవీ ప్రసాద్‌ ప్రకటన
తనను ఓడించడానికి అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయని దేవీ ప్రసాదరావు అన్నారు. ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందనడానికి ఆ పార్టీకి వచ్చి వెయ్యికంటే తక్కువ ఓట్లే తార్కాణమని చెప్పారు. తన ప్రత్యర్థులు కుమ్మక్కయ్యారని చెప్పాడానికి ఇదే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ప్రత్యర్థి పార్టీలు కుయుక్తులు పన్నాయని ఆరోపించారు. పార్టీ తనను బలిపశువును చేసిందనడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. రామచంద్రరావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి శాసనసభకు పోటీ చేసి ఓడిపోవడం కూడా ఆయన ఓటర్ల వద్దకు వెళ్లేందుకు మంచి అవకాశం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన రామచంద్రరావుకు దేవీ ప్రసాద్‌ అభినందనలు తెలిపారు. తనకు ఓటేసిన 40,000 మంది పైగా పట్టభద్రులు, ఉద్యోగులు, కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వం ఖరారుకు ఆలస్యం కావడం వల్ల కూడా తన ప్రత్యర్థికి లాభించిందని చెప్పారు. ఓటమిపై విశ్లేషణ చేస్తామని దేవీ ప్రసాదరావు తెలిపారు.

No comments:

Post a Comment