Tuesday 3 March 2015

అభివృద్ధికి మిగిలింది నాలుగు పైసలే! - బాబు

కేటాయింపులకు కోతలు?
- తగ్గిన ఆదాయంతో అనివార్య పరిస్థితి!.. ఇచ్చిన కొన్ని ప్రతిపాదనలు వెనక్కి
-  ఎన్నికల హామీలు, సంక్షేమానికి ప్రాధాన్యం.. ఏపీ బడ్జెట్‌పై చంద్రబాబు 

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇక తన కాళ్లపైనే నిలబడాలన్న నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. ప్రధాన ఆదాయ వనరుల నుంచి రాషా్ట్రవసరాలకు సరిపడ నిధులను రాబట్టే ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా ఆర్ధిక శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈనెల 12న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమర్పించబోయే 2015-16 బడ్జెట్‌ ఎలా ఉండాలన్న దానిపై సీఎం తన నివాసంలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చారు. వివిధ శాఖల నుంచి వచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనలు పరిశీలించి నిధులలో కోత పెట్టాలని నిర్ణయించారు. కొన్ని శాఖలు తమకు గతంలో కన్నా బడ్జెట్‌ పెంచాలంటూ ఇచ్చిన ప్రతిపాదనలను తిప్పి పంపించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఆదాయానికి గండిపడడం, కేంద్రం నుంచి ఆశించిన మేరకు సాయం అందకపోవడంతో అన్ని శాఖలకూ ఈసారి నిధుల కోత తప్పదని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రతిపాదనలను పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా రాష్ట్రంలో ఉన్న వనరుల నుంచే ఆదాయాన్ని సమీకరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ఆదాయాలతో పాటు గనులపై రాయల్టీ, ఎర్రచందనం తదితర ఆదాయవనరులపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రధాన ఆదాయ వనరులను నుంచి నిధుల సమీకరణ ఎంత మేరకు సాధించవచ్చు.. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా ఆదాయం రాబట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలు, వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను ఉండాలని అధికార యంత్రాంగానికి ఆయన సూచించారు. సాధ్యమైనంత వరకూ ఖర్చులు తగ్గించుకునేలా బడ్జెట్‌ను ఉండాలన్నారు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ పెంపు, అలాగే రైతు, డ్వాక్రా రుణమాఫీకి అవసరమైన నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని సీఎం సూచించారు. గవర్నర్‌ ప్రసంగానికి అవసరమైన అంశాలేమిటి..? వాటిని పొందుపరచడంపైనా చర్చించారు.
నేడు ఏపీ కేబినెట్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి చర్చించనున్నారు. అసెంబ్లీలో ఆమోదం పొందాల్సిన వివిధ బిల్లులపైనా చర్చ జరుగనుంది.
 అభివృద్ధికి మిగిలింది నాలుగు పైసలే!
 దీనితో ఏం చేయాలి.. ఎలా చేయాలి?
 అధికారులతో చంద్రబాబు తర్జనభర్జన

విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయానికి ఖర్చుకు లంకె కుదరడం లేదు. ఆ రాష్ట్రంలో వంద పైసలు ఆదాయం వస్తుంటే సరిగ్గా 96 పైసలు ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు సరిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఇక్కడ తన నివాసంలో నిర్వహించిన బడ్జెట్‌ తయారీ సమీక్షలో అధికారులు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల ఉద్యోగుల జీతాలు 43 శాతం మేర పెంచడంతో భారం మరీ పెరిగిందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. రుణాల ద్వారా సేకరించే నిధులు వడ్డీలు, కిస్తీల చెల్లింపునకు సరిపోతున్నాయని వారు తెలిపారు. ‘రూపాయికి నాలుగు పైసలు మాత్రం మిగిలితే దానితో ఏం చేయాలి? ప్రజలకు ఏం న్యాయం చేయగలం’ అని చంద్రబాబు ఒకింత నిర్వేదంగా మాట్లాడినట్లు సమాచారం. వీలైనన్ని పధకాలకు కోతలు పెట్టడం ద్వారా అతి కష్టం మీద ప్రణాళికా వ్యయం రూ.10,000 కోట్ల వరకైనా ఉండేలా చూడాలని ఈ సమావేశం నిశ్చయించింది. ఇరిగేషన్‌ పనులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికా కేటాయింపుల్లో అత్యధిక భాగం దానికే కేటాయించాలని నిశ్చయించారు. రాష్ట్ర స్థూలోత్పత్తి రూ.5.80 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ లెక్కన ఈసారి రూ.17 వేల కోట్ల వరకూ అప్పులు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేశారు.
‘కేంద్రంపై చాలా ఆశలు పెట్టుకొన్నాం. వారి ప్రతిస్పందన కూడా నిరుత్సాహకరంగా ఉంది. రాష్ట్ర విభజన ఏపీ ప్రజలకు శాపంగా మారింది. జనాభా ఎక్కువ ఉంది. ఆదాయం లేదు. ఈ పరిస్థితిని కేంద్రానికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం...ఏం జరుగుతుందో’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment