Wednesday, 18 March 2015

‘పట్టి’ కట్టి తీరుతాం!

‘పట్టి’ కట్టి తీరుతాం!

రాయలసీమ దాహం తీరుస్తాం
అవసరమైతే ప్రాజెక్టు దగ్గరే నిద్ర.. గోదావరి జిల్లాలకు నష్టం వాటిల్లదు.. అన్నీ ఆలోచించే ప్రాజెక్టు చేపట్టాం ఎక్సె్‌సపై స్పష్టమైన నిబంధనలున్నాయ్‌.. ఏడాదిలో పూర్తి చేస్తేనే ఆ సొమ్ములుమీరెందుకు టెండర్లు వేయలేదు?.. గోదావరిలో జూలై నుంచే వరద నీరు.. శాసనసభలో చంద్రబాబు వివరణ
హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):‘రాయలసీమ దాహం తీర్చేందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టాం. దీనిని చేపట్టి తీరుతాం. ఏడాదిలోపలే పూర్తి చేస్తాం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అవసరమైతే ప్రాజెక్టు దగ్గరే నిద్రిస్తానని ఉద్ఘాటించారు. ఉభయ గోదావరి జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా... వృథాగా సముద్రంలో కలిసే నీటినే పట్టిసీమ ద్వారా రాయలసీమకు తరలిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తిచేసి తీరుతామని ప్రకటించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు 22 శాతం ఎక్సె్‌సకు టెండర్లు ఎందుకు పిలిచారు? ఎత్తిపోసిన నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? ఒకేసారి గోదావరి, కృష్ణాలో వరద వస్తున్నప్పుడు... గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపి అక్కడి నుంచి సముద్రంలో కలిపేస్తారా? అంటూ విపక్ష నేత జగన్‌ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో బదులిచ్చారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానమిచ్చిన తర్వాత... చంద్రబాబు ఇదే అంశంపై మరింత వివరంగా మాట్లాడారు. ఆయా పత్రాలను చూపిస్తూ, వాటిలోని అంశాలను చదువుతూ స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్టు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనే అంశం నుంచి పట్టిసీమ నీటి వినియోగం తీరు తెన్నుల దాకా అన్ని అంశాలను వివరించారు. విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని... విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని హితవు పలికారు.
పట్టిసీమ ఎందుకంటే?
‘‘ప్రస్తుతం రాయలసీమలోని అనేక జిల్లాల్లో 1500 అడుగులదాకా వెళ్లినా నీళ్లు లభించడంలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు... రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై మూడు నాలుగు విడతల్లో వంద గంటలకుపైగా సమీక్షించాం. చివరికి... పట్టిసీమ ద్వారా ఈ కష్టం తీర్చవచ్చుననే ఆలోచన వచ్చింది’’ అని చంద్రబాబు తెలిపారు. పోలవరం నిర్మాణం పూర్తికి మరో నాలుగేళ్లు పడుతుందని... కానీ, ఏడాదిలోపే పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు మిగులు జలాలు అందించవచ్చునని చెప్పారు. ‘‘ఇలాంటి ఆలోచన మీకు రాలేదు. మీకు ఎంతసేపు మట్టి పనులు (కాలువల తవ్వకం), డబ్బులపైనే దృష్టి. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్విపెట్టారు. అప్పుడే పట్టిసీమలాంటి ప్రాజెక్టును చేపట్టి ఉంటే రాయలసీమకు తొమ్మిదేళ్లుగా కరువు కష్టమే ఉండేది కాదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఇప్పటికే భూమిని అప్పగించేశామని, ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేసితీరుతామని, అవసరమైతే తాను ప్రాజెక్టు దగ్గరే నిందిస్తానని ప్రకటించారు.
ఇదీ ‘ఎక్సెస్‌’ సంగతి...
పట్టిసీమ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా చేపట్టామన్నారు. ‘‘ఐదు శాతం ఎక్సె్‌సకు మించి కూడా టెండర్‌ వేయవచ్చునని నిబంధనల్లోనే పేర్కొన్నాం. దీనికీ నిబంధలున్నాయి. లక్ష్యాల మేరకు (మైల్‌ స్టోన్స్‌) పనులు పూర్తి చేయాలి. ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి చేసి తీరాలి. అంతేగానీ, ఒక్కపైసా మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కూడా ఇవ్వం. మీకూ చాలా కాంట్రాక్టు కంపెనీలు తెలుసుకదా? మీరు ఎందుకు టెం డర్లు వేయలేదు?’’ అని చంద్రబాబు నిలదీశారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ 29 శాతానికి, ఎంఈఐఎల్‌ 21.9 శాతం ఎక్సె్‌సకు కోట్‌ చేసిందని, ఈ కాంట్రాక్టు ఎంఈఐల్‌ కంపెనీకి దక్కిందని చెప్పారు. ఎక్సెస్‌ వేయడం ముఖ్యం కాదని, పనులు పూర్తికావడం ముఖ్యమని తెలిపారు. ‘ఎక్సె్‌సకు టెండర్లు వేయడం ఇదే కొత్త కాదు. నాగార్జునసాగర్‌ ఆధునీకరణ పనులు 24 శాతం, జూలకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 25 శాతం ఎక్సె్‌సకు వెళ్లాయి’’ అని చంద్రబాబు వివరించారు. పట్టిసీమపై పెట్టే ఖర్చు వృథా అవుతుందనే వాదనలను తిప్పికొట్టారు. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పట్టిమ ఎత్తిపోతల్లో ‘మొబైల్‌ పంపులు’ వాడుతున్నామని చెప్పారు.
‘స్టడీ’ చేసి మాట్లాడాలి...
‘‘గోదావరి, కృష్ణాల్లో ఒకేసారి వరద వస్తుంది. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణాలో ఎత్తిపోసి...సముద్రంలో కలిపేస్తారా?’ అంటూ జగన్‌ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. ‘‘కృష్ణా ప్రాజెక్టు మీద ఆలమట్టితో మొదలుకుని అనేక ప్రాజెక్టులున్నాయి. అవన్నీ దాటి మనకు నీళ్లు వచ్చేసరికి సెప్టెంబరు అవుతోంది. అప్పుడు పంట వేస్తే..తుఫాను సీజన్‌లో దెబ్బతింటున్నాయి. ఇక గోదావరికి జూలై నుంచే వరద నీరు ప్రవహిస్తుంది’’ అని తెలిపారు. ‘ఫ్లడ్‌’ అంటే ముంచెత్తేది కాదని...నిర్దిష్ట పరిమితికి మించి, సముద్రంలో కలిసిపోయే జలాలను వరదగా భావిస్తారని లెక్కలు చెప్పారు. ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని రాజకీయాలు చేసినా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం ఆగదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ‘‘పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి రైతాంగానికి ఎలాంటి నష్టం జరగదు. తమ జిల్లాలకు నష్టం జరగకుండా, సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకు తీసుకెళితే అభ్యంతరం లేదని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన మా ప్రజా ప్రతినిధులు చెప్పారు. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది’’ అని తెలిపారు.
‘ఆలమట్టి’లో జరిగిందేమిటి?
ఆలమట్టి ఎత్తు పెంపును అడ్డుకునేందుకు తాను సీఎంగా ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో పోరాడి విజయం సాధించానని చంద్రబాబు తెలిపారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక... మిగులు జలాలపై హక్కులు వదులుకుంటూ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చారని ధ్వజమెత్తారు. ‘‘ట్రిబ్యునల్‌ ముందు ఏపీ తరఫున కేసు కేసు వాదించిన సుదర్శన్‌ రెడ్డి ఏం చెప్పారండీ?మీ తండ్రి చేతగానితనం, అసమర్థతతో కృష్ణాపై హక్కులను తాకట్టు పెట్టారు’’ అంటూ జగన్‌పై ధ్వజమెత్తారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణం చాలా సున్నితమైన అంశం. నీటికోసం గ్రామాలు, జిల్లాలు, రాషా్ట్రలు, దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మీ చర్యలతో ప్రజలకు ఏమని సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని ప్రశ్నించారు.
సీమను కాపాడేందుకే: మంత్రి దేవినేని
రాయలసీమకు నీళ్లందించే పట్టిసీమను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. అర్థంలేని రాజకీయాలతో పక్కరాషా్ట్రలకు లేనిపోని తెలివితేటలు ఇచ్చేలా ప్రయత్నించవద్దని కోరారు. గోదావరికి భారీ వరద వచ్చే 130 రోజుల సమయంలో సముద్రంలో కలిసే జలాలను పట్టిసీమ ద్వారా తరలిస్తామని చెప్పారు. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. ప్రతిపక్షాన్ని ఎంతసేపటికీ కలెక్షన్లు, పర్సంటేజీల మీదే ధ్యాస అని ఆయన విమర్శించారు.
నీటిని ఇలా వాడుకుంటాం..
గోదావరి నుంచి సముద్రంలో కలిసే నీటిలో 80 టీఎంసీలను పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాలువలోకి ఎత్తిపోస్తామని చంద్రబాబు తెలిపారు. ఆ నీటిని కృష్ణా డెల్టా అవసరాకలు ఉపయోగిస్తామని చెప్పారు. ఆ మేరకు 80 టీఎంసీలను శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తామని తెలిపారు. ‘ఎత్తిపోసిన నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని జగన్‌ అర్థం లేకుండా ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు గురించి తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. కాలువల ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి డెల్టాకు తిరిగి వాడుకునేందుకు స్టోరేజీ ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ఇక... రాయలసీమలో 273 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యమున్న ప్రాజెక్టులున్నాయంటూ జిల్లాల వారీగా వాటి వివరాలు తెలిపారు. ఒక్కసారి నీటిని నిల్వ చేస్తే రెండు మూడేళ్లకు సరిపడా భూగర్భ జలాలు వస్తాయని చెప్పారు. ఈసారి సోమశిల ద్వారా నీళ్లు ఇవ్వడంతో... రైతులు రెండోపంటకూ సిద్ధమయ్యే పరిస్థితి ఉందని తెలిపారు.

No comments:

Post a Comment