Friday 4 September 2015

వడ్డీ వసూలు ఆపండి: పోచారం

వడ్డీ వసూలు ఆపండి: పోచారం
Updated :05-09-2015 02:34:14
  • మాఫీ పత్రాలు ఇవ్వండి.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?
  • రుణాలు రెన్యువల్‌ చేయాలి.. ఎస్‌ఎల్‌బీసీలో పోచారం ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతుల నుంచి వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టంగా చెప్పాం. ఆదేశాలు జారీ చేశాం. అయినప్పటికీ రుణాల రెన్యువల్‌కు వస్తున్న రైతుల నుంచి వడ్డీ ఎందుకు వసూలు చేస్తున్నారు?’’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బ్యాంకర్లను నిలదీశారు. రుణమాఫీలో బకాయిల మొత్తాన్ని కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ అయినట్లుగా వెంటనే రైతులకు పత్రాలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేస్తున్నారంటూ ఉదాహరణలతో వివరించారు. అదే సమయంలో రైతుల నుంచి వడ్డీ వసూలు చేయని బ్యాంకులకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. సచివాలయంలో శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) జరిగింది. ఈ సమావేశంలో పోచారంతోపాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రదీప్‌చంద్ర, పార్థసారధి, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌, నాబార్డు సీజీఎం తదితరులు పాల్గొన్నారు. ‘‘బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయంటూ ఉదయం, సాయంత్రం నాకు ఫోన్‌లు వస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. ఈ బాధ నుంచి రక్షించండి!’’ అని పోచారం ప్రాధేయపడినంత పని చేశారు. ‘‘జీవో నంబర్‌ 323 ప్రకారం వడ్డీ వసూలు చేయవద్దని అనేకమార్లు చెప్పాం. అయి నా, వసూలు చేస్తూనే ఉన్నాయి. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? వడ్డీ కట్టాల్సిన అవసరంలేదని ప్రభుత్వమే చెప్పిందని రైతులు పేర్కొంటున్నా సిబ్బంది వినడంలేదు’’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీని రెన్యువల్‌ చేసుకోవడానికి వచ్చే రైతుల నుంచి డబ్బు వసూలు చేయవద్దని వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌కు సూచించారు. ఇంకా పంట రుణాల రెన్యువలే మొదలు పెట్టని బ్యాంకులు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘పంట రుణాల మంజూరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రుణాల రెన్యువల్‌ నిరుత్సాహకరంగా ఉంది. రుణమాఫీని ఎలా అమలు చేయాలన్న చర్చలు జరుగుతున్నప్పుడు.. మొదటి విడత 25శాతం మాఫీని రైతులకు నేరు గా ఇద్దామని, మిగిలిన మూడు విడతలకుగాను రైతులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కు లు ఇచ్చి తర్వాత తీరుద్దామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అయితే... బ్యాంకులు, రైతుల మధ్య సంబంధం చెడిపోకూడదని భావించి, బ్యాంకుల ద్వారానే రుణమాఫీకి ఒప్పించాం. అప్పుడు ఎస్‌ఎల్‌బీసీ చేసుకున్న ఒప్పందాలు ఎక్కడపోయాయి? ఇప్పుడు రైతుల నుంచి 25 శాతం మాఫీ పోను మిగిలిన 75 శాతం రుణం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రుణమాఫీ పత్రాలు వెంటనే రైతులకు ఇవ్వాలి’’ పోచారం తెలిపారు.
 
రుణ వితరణ ఇలాగేనా?
వ్యవసాయ రుణాల పంపిణీ తీరుపై మంత్రి పోచారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఖరీఫ్‌లో రూ.18వేల కోట్ల రుణ పంపిణీ లక్ష్యానికిగాను రూ.6,648 కోట్లే ఇచ్చారు. లీడ్‌ బ్యాంకు ఎస్‌బీహెచ్‌ కూడా ఈ విషయంలో వెనుకబడే ఉంది. సహకార బ్యాంకు ప్రథమ స్థానంలో ఉంది’’ అన్నా రు. గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ప్రవర్తనలో మార్పు రాలేదంటూ పోచారం ఆగ్ర హం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తామంటూ ఎస్‌ఎల్‌బీసీ తీర్మానం చేసిందని పోచారం తెలిపారు. రుణమాఫీ పొందుతున్న రైతులకు బ్యాంకు మేనేజర్లు సంతకాలు చేసి ఇచ్చే పత్రాలను పూర్తి చేస్తామని అంగీకరించారన్నారు. ఈ నెలాఖరుకు 80 శాతం పంట రుణాలు, మిగిలినవి అక్టోబరులో ఇస్తామని ఎస్‌ఎల్‌బీసీ తెలిపిందన్నారు.

No comments:

Post a Comment