Monday 14 September 2015

రుచికరమైన భోజనం రూపాయే!

రుచికరమైన భోజనం రూపాయే!
Updated :14-09-2015 09:59:26
మనసుంటే మార్గముంటుంది అంటారు. ఆ యువకులకు మనసు ఉంది కాబట్టే పేదల ఆకలి తీర్చడానికి నడుం కట్టారు. ఒక సంఘంగా ఏర్పడి పేదవారి ఆకలి 
తీర్చడమే కాకుండా, చాలా తక్కువ ధరకే వారికి కావలిసినవన్నీ అందించడానికి శ్రీకారం చుట్టారు ఆ యువకులు. ఖర్చు గురించి ఆలోచించకుండా ఎంత మంది ఆకలి తీరుస్తున్నామన్న విషయంపైనే దృష్టి పెట్టారు కర్నాటకలోని మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు. రూపీయా కనుమరుగైపోతున్న తరుణంలో ‘ఒక్కరూపాయి’ కే పేదల కడుపు నింపుతున్నవారి గురించి తెలుసుకుందాం.
 
 
రోటీఘర్‌ క్యాంటీన్‌
పేదల ఆకలినే కాదు అడిగినవారందరి ఆకలీ తీరుస్తూ ‘అన్నదాతా సుఖీభవ’ అంటూ ఆశీస్సులు అందుకుంటోంది రోటీఘర్‌ క్యాంటీన్‌! ఇక్కడ ఒక్కరూపాయికే అన్నం, కూర, సాంబారుతో పాటు రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తారు. చివరకు ఓ స్వీటు కూడా ఇచ్చి నోటిని తీపి చేస్తున్నారు!
ఇక్కడికి అందరూ పేదవారే వస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే! రోజు
కూలీల నుంచి కార్పొరేట్‌ ఉద్యోగుల వరకూ అందరూ మధ్యాహ్న సమయంలో ఈ రోటీఘర్‌ క్యాంటీన్‌కే వస్తారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచీ మూడు గంటల వరకూ ఇది తెరిచే ఉంటుంది. అన్నంతో పాటు చపాతీ ఇక్కడ లభిస్తాయి. రోజుకు ఎంత మంది వచ్చినా లేదు... అయిపోయింది అన్న మాట రాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సార్లు చేసిన పదార్థాలు అయిపోయినా వెంటనే వేడి వేడిగా వండి వడ్డిస్తారు. కాకపోతే పార్శిల్‌ సర్వీసు మాత్రం ఇక్కడ లేదు.
 
అందరూ సమానమే! 
తమ క్యాంటీన్‌కు వచ్చేవారు ధనికులా, పేదలా, ఉద్యోగులా, నిరుద్యోగులా అన్నది ఆలో చించబోమని, ఇక్కడకు వచ్చే అందరూ తమకు సమానమే అంటున్నారు మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు! ఈ క్యాంటీన్‌లో వండిపెట్టడమే తప్ప వడ్డించడం ఉండదు. ఎవరికి వారు సెల్ఫ్‌ సర్వీస్‌ చేసుకోవలసిందే! భోజనం చేసిన తరువాత వీరు చార్జి చేసే ఒక్కరూపాయి ఇవ్వబోతే క్యాంటీన్‌లో పనిచేసే వారు తీసుకోరు. అక్కడ ఉండే హుండీలో వేయవలసిందే! వీరి సేవలకు ముగ్ధులైన కొందరు ఇంకా ఎక్కువ మొత్తం కూడా అప్పుడప్పుడు హుండీలో వేస్తూంటారు. డబ్బులు ఇచ్చిన వారి గురించి ఎలా ఆలోచించరో, ఇవ్వనివారిని కూడా క్యాంటీన్‌ సభ్యులు పట్టించుకోరు. ఈ క్యాంటీన్‌లో భోజనం చేసి వెళ్ళేవారిని ఇప్పటి వరకూ తాము ఏనాడూ డబ్బులు డిమాండ్‌ చేయలేదని చెబుతున్నారు క్యాంటీన్‌ నిర్వాహకులు!
 
పరిశుభ్రతకే పెద్దపీట!
ప్రతిరోజూ వందలాది మంది ఆకలి తీరు స్తున్న రోటీఘర్‌లో పరిశుభ్రతకి పెద్ద పీట వేస్తారు. ఈ క్యాంటీన్‌లో చాలా మంది పనిచేస్తున్నారు అనుకుంటే పొరపడినట్టే! కేవలం ముగ్గురంటే ముగ్గురే పనిచేస్తారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, వచ్చేవారికి కావలసినవి చూడడం వంటి క్యాంటీన్‌ పనులన్నీ వీరే చూసుకుంటారు. చేసుకుంటారు.
 
అలా మొదలైంది
సమాజసేవ చేయాలన్న ఆలోచనతో మహావీర్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు తొలుత ఒక ఉచిత వైద్యశాల నిర్వహించారు. నిధుల కొరత, డాక్టర్ల కొరత తోడవడంతో ఆ వైద్యశాలను మూసివేశారు. ఆ తర్వాత కూడా పేదలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యూత్‌ సభ్యులకు రోటీఘర్‌ ఆలోచన వచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోటీఘర్‌కి నిధుల కొరత లేదంటున్నారు నిర్వాహకులు. కర్నాటకలో మరికొన్ని ప్రాంతాలకు కూడా తమ రోటీఘర్‌ సేవలను విస్తరించే ఆలోచన ఉందని అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు.

No comments:

Post a Comment